Graphene-papers
-
మొక్కల దాహం చెప్పేస్తాయి...
మొక్కలు ఏపుగా పెరిగి మోపెడంత పంట ఇవ్వాలంటే నీరు బాగా అవసరం. మరి ఇదే నీరు మోతాదుకు మించి అందితే.. మొక్కలు కుళ్లిపోతాయి. లేదంటే నీరు వథా అవుతుంది. రెండింటితోనూ నష్టమే కదా.. అందుకే అయోవా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మొక్కల నీటి అవసరాలను సులువుగా గుర్తించేందుకు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. చిన్నసైజు పట్టీల్లా ఉండే గ్రాఫీన్ పొరలను మొక్కల ఆకులపై అతికిస్తే చాలు.. ఎప్పుడు నీరు పట్టాలో ఇట్టే తెలిసిపోతుంది. గ్రాఫీన్లోని కర్బన అణువులు ఒక నిర్దిష్ట పద్ధతిలో అమరి ఉంటాయి. పైగా ఇది విద్యుత్తు ప్రసారానికి బాగా సహకరిస్తుంది. ఈ లక్షణాలను ఉపయోగించుకుని లియాంగ్ డాంగ్ అనే శాస్త్రవేత్త వీటిని గ్రాఫీన్ను తేమను గుర్తించే సెన్సర్గా మార్చేశారు. అతి చౌకగా, సులువుగానూ ఉత్పత్తి చేసుకోగల ఈ సెన్సర్లు మొక్కల ఆకుల నుంచి వెలువడే నీటి ఆవిరిలో వచ్చే తేడాలను గుర్తిస్తాయి. ఇందులో వచ్చే మార్పుల ఆధారంగా మొక్కకు నీటి అవసరం ఎప్పుడు ఉంటుందో గుర్తించవచ్చు. తాము ఈ పద్ధతిని ఇప్పటికే కొన్ని మొక్కజొన్న పంటల్లో వాడి మంచి ఫలితాలు సాధించామని డాంగ్ తెలిపారు. ఈ సెన్సర్లు చాలా పలుచగా, చిన్నగా ఉండటం వల్ల మొక్కల సాధారణ ఎదుగుదలకు ఏమాత్రం ఇబ్బంది ఉండదని అంచనా. పొలంలో అక్కడక్కడా కొన్ని మొక్కలకు ఈ సెన్సర్లను అతికిస్తే పంటలకు ఎప్పుడు నీళ్లు పట్టాలో తెలుస్తుందన్నమాట! -
గ్రాఫీన్ ఈ-పేపర్
బీజింగ్: చైనా శాస్త్రవేత్తలు మరో సంచలనానికి తెరతీస్తూ తొలిసారిగా గ్రాఫీన్తో ఎలక్ట్రానిక్ కాగితాన్ని తయారు చేశారు. దీన్ని ఈ-రీడర్లు, శరీరానికి ధరించే స్మార్ట్ పరికరాల్లో డిస్ప్లేగా ఉపయోగిస్తారు. గ్రాఫీన్ ప్రపంచంలోనే అత్యంత బలమైన, తేలికైన పదార్థం. దీని ఒక పొర కేవలం 0.335 నానోమీటర్ల మందం ఉంటుంది. ఇది ఉష్ణం, విద్యుత్తు శక్తిలకు మంచి వాహకం. ప్రస్తుతమున్న సంప్రదాయ ఈ-పేపర్లతో పోలిస్తే, గ్రాఫీన్ ఎలక్ట్రానిక్ కాగితం, అవసరానికి తగ్గట్టుగా వంగడంతోపాటు, బలంగా ఉంటుంది. కాంతిని ఎక్కువదూరం ప్రసరింపచేస్తుంది గనుక విషయం బాగా కనిపిస్తుంది. గ్రాఫీన్ కార్బన్ మూలకం అయినందున ధర కూడా తక్కువగా ఉంటుంది. మరో ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభిస్తారు.