మహా వాక్యాలు
మహాద్భుత భాష్య ప్రకరణ గ్రంథాలతో వేదాంత జిజ్ఞాసువులకు మహోపకారం చేసిన జగద్గురువులు ఆదిశంకరులు అవతార సమాప్తి సమయంలో ఐదు శ్లోకాలను బోధించారు. ‘సోపాన పంచకం’ అని వాటికి పేరు. వాటిలో ఆయన సత్యాన్వేషణకు అను సరించదగిన కర్తవ్యాలను చెప్పారు. మూడో శ్లోకంలో ఎనిమిది ముఖ్య అంశాల కార్య ప్రణాళికను ప్రతిపా దించారు: ఒకటి, వాక్యార్థం బాగా విచారించండి.
అంటే ఉపనిషత్తులు చెప్పిన మహా వాక్యాల తాత్పర్య మేమిటో బాగా చింతన చేయండి. రెండు, శ్రుతి-శిర స్సులయిన ఉపనిషత్తుల బోధనలు బాగా అవగాహన చేసుకొని అనుసరించండి. వేదాలకు శీర్ష భాగాలు - ‘వేద=అంతం’ - ఉపనిషత్తులే కదా! మూడు, వితండ వాదాలూ, దుష్టతర్కాలకు దూరంగా ఉండండి. వాటి వలన కాల యాపనా, చిత్త విభ్రమం, చాంచల్యం, రణ గొణ ధ్వనీ తప్ప ప్రయోజనం శూన్యమే.
నాలుగు, సత్యాన్వేషణలో ఆసక్తి ఉంటే వేద శాస్త్ర సమ్మతమైన తర్క పద్ధతి అవలంబించండి. ఐదు నేను బ్రహ్మ స్వరూపుడిని అని నిరంతరం భావన చేస్తూ ఉండండి. ఆరు, గర్వాన్ని ఎప్పుడూ, పూర్తిగా త్యజిం చండి. నాకు ఈ విషయం అంతా ముందే తెలుసు అన్న భావన వదలకపోతే, ఇక ఆ విషయాన్ని తెలుసుకొనే అవ కాశమే ఉండదు. ఏడు, ‘ఈ శరీరమే నేను’ అనే తాదాత్మ్యత వదిలిపెట్టండి. ఎనిమిది, పండి తులతో వాదాలకు దిగవద్దు.
మొదటి అంశంలో చెప్పి న వాక్యార్థ విచారణ ఉపనిషత్తులు చెప్పిన మహా వాక్యాల గురించి. ఈ మహా వాక్యాలు వేదాలూ, ఉపని షత్తులలో వివరించిన జ్ఞానకాండకు కీలకాలు. వీటి విస్తరణే వేదాంతశాస్త్రం. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ (జ్ఞానమే బ్రహ్మ) అనే మహా వాక్యం ఋగ్వేదానికి కీలకం. ఇది పరమార్థ ‘సాక్షాత్కార’ మహా వాక్యం. యజుర్వేదం లోని ‘అహం బ్రహ్మాస్మి’ (నేను పరబ్రహ్మమును అయి ఉన్నాను) ‘అనుభవ’ మహావాక్యం. ‘నేను సర్వ వ్యాపి అయిన పరబ్రహ్మ కంటే భిన్నం కాదు’ అన్న సత్యం నోటి మాటలుగా, గురువు చెప్పిన పాఠాలుగా నేర్చు కోవటం కాకుండా దాన్ని అపరోక్షంగా అనుభవించ మంటుంది.
సామవేదంలోని ‘త్-త్వం-అసి’ (అది - నువ్వు- అయి ఉన్నావు) అన్న మహావాక్యం ఆ పరబ్రహ్మవు నువ్వే అని చెప్పే ‘ఉపదేశ’ మహావాక్యం. అథర్వణ వేదంలోని ‘అయం- ఆత్మా-బ్రహ్మ‘ (ఈ ఆత్మయే పరబ్రహ్మము) అన్నది జ్ఞాన బోధను సంపూ ర్ణం చేసే ‘సమాప్తి’ మహావాక్యం.
ఈ మహా వాక్యాల అర్థాలు అంత తేలికగా అం తుచిక్కేవి కావు. వీటి తాత్పర్యం తెలుసుకొనేందుకు, అంతకంటే ముఖ్యంగా దానిని అనుభూతి చేసుకొ నేందుకు, అనేక జన్మల కఠోర సాధన అవసరం. తత్-త్వం-జ్ఞానం-ఆత్మ-బ్రహ్మ లాంటి మాటలకు సరయిన అర్థం తెలుసుకోవాలంటే బహుకాలం పాటు శ్రవణ, మనన, నిదిధ్యాసనలు అవసరమని ఉపనిషత్తు చెప్తున్నది. ఆదిశంకరుల వాక్య వృత్తి, లఘు వాక్య వృత్తి, మహా వాక్య దర్పణం మొదలైన భాష్య ప్రకరణ గ్రంథాలు ఈ మహా వాక్యాలను విశదం చేయటానికి ఉద్దేశించినవే. ఈ మహా వాక్యాల నిరంతర చింతనే ముముక్షువైన సాధకుడికి జీవితం.
-ఎం. మారుతిశాస్త్రి