ఉద్యోగులు బరువు పెరిగారని..
న్యూఢిల్లీ: సంస్ధలో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులు బరువు పెరిగారని భారతీయ విమానయాన సంస్ధ ఎయిర్ ఇండియా వారిని గ్రౌండ్ డ్యూటీలకు బదిలీ చేసింది. క్యాబిన్ క్రూ ఉద్యోగులుగా పనిచేస్తున్న 57 మంది(వీరిలో ఎక్కువ మంది ఎయిర్ హోస్టస్ గా విధులు నిర్వహిస్తున్నారు) అధిక బరువు ఉన్నట్లు ఎయిర్ ఇండియా గత నెలలో గుర్తించింది. త్వరగా బరువు తగ్గకపోతే శాశ్వత గ్రౌండ్ డ్యూటీ ఉద్యోగులుగా చేస్తామని హెచ్చరించింది కూడా.
డెడ్ లైన్ లోగా బరువు తగ్గాలని సూచించిన ఎయిర్ ఇండియా అందులో ఫెయిల్ అయిన వారిని గ్రౌండ్ జాబ్స్ కు పంపినట్లు ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్ఐ) ప్రకారం.. అధిక బరువును కలిగివున్నట్లు గుర్తించామని చెప్పారు. గ్రౌండ్ జాబ్ లో చేరడమంటే నెలకు రూ.35 వేల నుంచి రూ.50 వేల ఫ్లైయింగ్ అలవెన్సును కోల్పోయినట్లే. అధిక బరువు కలిగిన వారిని క్యాబిన్ క్రూ జాబ్ కు తొలుత ఆరు నెలల పాటు అన్ ఫిట్ గా పరిగణిస్తారు. 18నెలల్లోగా తిరిగి తక్కువ బరువును చూపించలేకపోతే పర్మనెంట్ గా క్యాబిన్ క్రూ జాబ్ కు అన్ ఫిట్ గా పరిగణిస్తారు.