GST software
-
జీఎస్టీ స్కాంలో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన జీఎస్టీ కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు మరికొందరు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి లేఖతో జీఎస్టీ స్కాం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, జీఎస్టీ సబ్సిడీ చెల్లింపు వ్యవహారంలో అక్రమాలపై ఆమె ఆరా తీశారు. కుంభకోణం ఎలా జరిగిందనే దానిపై టీకే శ్రీదేవి నివేదిక ఇచ్చారు. ఇక, సీఎస్ శాంతకుమారికి సైతం ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోమేష్ కుమార్‌తో పాటుగా పలువురు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా రూ.1000 కోట్ల మోసం జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం తెలిపింది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఇదే కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి.ఇక, ఈ కుంభకోణంపై వాణిజ్య పన్నుల శాఖ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ (సెంట్రల్ క్రైం స్టేషన్) పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
రాష్ట్రానికి 169 కోట్ల పరిహారమే వచ్చింది: కవిత
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ పరిహారం కింద తెలంగాణకు గత రెండు నెలల్లో వచ్చింది కేవలం రూ.169 కోట్లేనని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. 14 శాతం కంటే తక్కువ వృద్ధిరేటున్న రాష్ట్రాలకే పరిహారం దక్కుతోందని, 18 నుంచి 20 శాతం వృద్ధిరేటున్న తెలంగాణకు అందడంలేదని పేర్కొన్నారు. బుధవారం లోక్‌సభలో జీఎస్టీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. 14 శాతం బేస్‌రేటును సమీక్షించాలని కోరారు. జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందులున్నాయని, చిన్న వర్తకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాండూరు రాయి పేదోళ్ల గ్రానైట్‌గా పేరొందిందని, దీనికీ జీఎస్టీ వర్తింపజేయడం అన్యాయమని పేర్కొన్నారు. పైగా 18 శాతం శ్లాబులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ కారణంగా బీడీ పరిశ్రమ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆధారపడిన కార్మికుల్లో 99 శాతం మంది మహిళలేనని గుర్తుచేశారు. బీడీలు, చేనేతలు, హస్తకళలు, అటవీ ఉత్పత్తులపై ఉన్న జీఎస్టీని తొలగించాలని కోరారు. -
3 రోజుల పాటు దుకాణాలన్నీ బంద్
దేశమంతా ఒకే పన్ను వ్యవస్థలోకి వచ్చేస్తూ జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ జీఎస్టీలోకి అప్‌గ్రేడ్ అవడానికి చాలామంది వ్యాపారస్తులు తమ దుకాణాలను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. మొబైల్ ఫోన్ సర్వీసు సెంటర్ల నుంచి ఫార్మా కంపెనీలు, బిస్కెట్ల తయారీదారులు, ఆటోమొబైల్ షోరూంల వరకు అన్నీ కనీసం 72 గంటల పాటు తమ దుకాణాలు మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంతేకాక కొందరైతే, ఏకంగా జూలై 7న లేదా జూలై 10నే మళ్లీ విక్రయాలు ప్రారంభిస్తామని చెబుతున్నారు. తమ అంతర్గత సిస్టమ్స్ స్థిరత్వానికి వచ్చాకే కార్యకలాపాలు ప్రారంభిస్తామంటున్నారు. ''ఇదే మా చివరి డెలివరీ'' అని ఢిల్లీలోని ఓ సూపర్‌బైక్ షోరూం జనరల్ మేనేజర్ ఓ కస్టమర్‌కు చెప్పినట్టు తెలిసింది. కొత్త పన్ను విధానంలోకి తమ సాఫ్ట్వేర్ సిస్టమ్‌ను అప్డేట్ చేయాల్సి ఉందని చెప్పినట్టు ఆ కస్టమర్ పేర్కొన్నారు. శుక్రవారం రోజు సర్వీసు సెంటర్లకు వెళ్లిన కొంతమంది కస్టమర్లకు కూడా నిరాశే ఎదురైందట. టాప్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల సర్వీసు సెంటర్లు తమను తిరిగి మంగళవారం రావాలని చెబుతున్నట్టు ఢిల్లీ నివాసులు తెలిపారు. ఫార్మా దిగ్గజం జీఎస్కే కూడా తన కార్యకలాపాలను రెండు రోజుల పాటు మూసివేస్తోంది. దీన్ని ఆ కంపెనీ అధికార ప్రతినిధే ధృవీకరించారు. గోద్రెజ్ అప్లయెన్స్ కూడా తాజా ప్రైమరీ ఆర్డర్లను ఏడు నుంచి పది రోజుల పాటు తీసుకోవద్దని నిర్ణయించిందని ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. కొన్ని బెవరేజ్, స్నాక్స్ కంపెనీలు కూడా ఈ మేరకే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ''మేము జూన్ 29 నుంచి విక్రయాలు ఆపివేస్తున్నాం. మళ్లీ జూలై 4న ప్రారంభిస్తాం'' అని డాబర్ ఇండియా సీఎఫ్ఓ లలిత్‌మాలిక్ చెప్పారు. తమ మొత్తం ప్రక్రియను ఇన్వాయిస్ నుంచి ఇతర అంశాల్లోకి మార్చుతున్నామని తెలిపారు. ఈ ప్రక్రియతో డాబర్ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి మందగించనున్నట్టు కూడా చెప్పారు. కంపెనీ పరిమాణాలు బట్టి జీఎస్టీలోకి మారడానికి రెండు నుంచి ఏడు రోజుల వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ముందస్తు ఉన్న వ్యాట్ ఇతర పన్ను విధానం కంటే ప్రస్తుతం అమల్లోకి వచ్చిన జీఎస్టీకి భిన్నమైన ఇన్వాయిసింగ్ సిస్టమ్ అవసరమవుతుందన్నారు. తాత్కాలికంగా మూసివేస్తున్న వ్యాపారాల వల్ల కొన్ని రోజుల వరకు మార్కెట్లో కొంత ప్రభావం పడనుందని ఇండస్ట్రి నిపుణులు చెబుతున్నారు.