guvvala balraju
-
అచ్చంపేట: త్రిముఖ పోరు.. గెలుపు ఎవరిది?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్సీ నియోజకవర్గంగా అచ్చంపేటలో ఈసారీ త్రిముఖపోటీ అనివార్యం కానుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలే ప్రధాన ఎజెండాగా అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముందుకెళ్తుండగా ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతతో పాటు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం తమకు కలిసి వస్తుందని కాంగ్రేస్ భావిస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ది గువ్వల బాల్‌రాజు విజయం సాధించారు. ఆయన రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్ది డాక్టర్ వంశీకృష్ణను ఓడించారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్న గువ్వల బాల్‌రాజు మూడోసారి అచ్చంపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కాని ఆయన వ్యవహారశైలిపై సొంతపార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లు, పార్టీ కార్యకర్తల పట్ల దురుసుగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు తప్పా కొత్తగా తన మార్కు పనులు ఏమీ చేయలేదనే ప్రచారం ఉంది. నియోజకవర్గ సమగ్ర అభివృద్ది కోసం ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రధానంగా ఏజేన్సీ ప్రాంతం అధికంగా ఉన్న అమ్రాబాద్ మండలంలో సాగునీటి సమస్య తీరలేదు. అక్కడ వేలాది మంది రైతులకు చెందిన పోడు భూముల వ్యవహారం కొలిక్కి రాలేదు. దీనికి తోడు ఆయనపై పోడు రైతులు గుర్రుగా ఉన్నారు. బల్మూరు, లింగాల మండలాలకు సాగునీరు అందిస్తామన్న హామీ నేటికి నెరవేరలేదు. పలు మండలాల్లో టీఆర్ఎస్ పార్టీకి కొందరు నేతలు కూడ ఎమ్మెల్యే వైఖరితోనే దూరమవుతున్నారని సొంతపార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నా ఆ విషయాన్నిఆయనకు చెప్పే ధైర్యం చేయటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. భూ వివాదాల్లో కూడా తలదూర్చుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకునియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం కూడా ఇవ్వలేదు. ఇళ్లస్దలాలు ఇవ్వలేదు. మాదిగా సామాజిక వర్గానికి చెందటం ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. ఫాంహౌజ్ ఎపిసోడ్లో గువ్వల బాల్‌రాజ్ కూడ ఉండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అచ్చంపేట ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ చక్కర్లు కొట్టడం గువ్వలకు ఇబ్బందిగా మారింది. రంగంలోకి ఎంపీ కొడుకు భరత్ ప్రసాద్? అయితే బాల్‌రాజ్ పక్కన పెడితే నాగర్ కర్నూల్ ఎంపీ రాములుకు సీటు ఇవ్వొచ్చని ఒకవేళ ఆయన వయస్సు మీదపడిందని భావిస్తే ఆయన కుమారుడు భరత్ ప్రసాద్‌ను రంగంలోకి దించే అవకాశం ఉంది. భరత్ ప్రసాద్‌కు నాగర్ కర్నూల్ జడ్పి చైర్మన్‌కి బరిలో నిలిచి చేజాయిరిపోయింది. దానికి ఎమ్మెల్యే గువ్వల బాల్రాజే కారణమని ఆరోపిస్తున్న భరత్ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో భరత్ ప్రసాద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో అచ్చంపేట ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎంపీగా తన తండ్రి రాములుకు నియోజకవర్గంలో ఉన్న మంచిపేరు కలిసివస్తుందని భావిస్తున్నారు. పార్టీ సీటు ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా బరీలో దిగాలనే ఆలోచనలో భరత్ ప్రసాద్ ఉన్నట్టు సమాచారం. దీంతో అధికార బీఆర్ఎస్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు ఓడిన డాక్టర్ వంశీకృష్ణ మరోసారి పోటీకి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీకృష్ణ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు,ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కూడ అచ్చంపేట నియోజకవర్గంలో ఉండటంతో దీనిపై రేవంత్‌రెడ్డి కూడ ప్రత్యేక దృష్టి సారించారు.ఈసీటు తప్పకుండా గెలవాలనే యోచనలో ఉన్నారు.ఎమ్మెల్యే గువ్వలబాల్రాజ్ భూకబ్జాలు,ఇసుక అక్రమ రవాణకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదని మండిపడుతున్నారు. గతంలో పార్టీని వదిలిన నేతలు సైతం తిరిగి సొంతగూటికి వస్తున్న నేపధ్యంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే వంశీకృష్ణ భార్య,అమ్రాబాద్ జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ అనురాధను రంగంలోకి దింపితే గెలుపు మరింత సులభమవుతుందనే అభిప్రాయం పార్టీ నేతలు,కార్యకర్తల్లో ఉంది.అయితే మాల సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణకు మాదిగసామాజిక వర్గ ఓట్లు మైనస్‌గా మారే అవకాశం ఉంది. బీజేపీ నుంచి ఆ ఇద్దరిలో ఎవరూ? బీజేపీ కూడ ఈసారి గెలుపుపే ద్యేయంగా పనిచేయాలని యోచిస్తోంది. బలమైన అభ్యర్దిని రంగంలోకి దింపాలని చూస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన సతీష్ మాదిగ, శ్రీకాంత్ భీమా పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నేతలు ఎవరు, వారు చర్యలు ప్రారంభించింది.మిగితా బీఎస్పీ,వైఎస్ఆర్టీపీ పార్టీల అభ్యర్దులు పోటీకి ఆసక్తి చూపుతున్నా వారి ప్రభావం నామమాత్రమే కానుంది. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: నియోజకవర్గంలో 80 శాతం ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. పరిశ్రమలు లేవు అడవి విస్తీర్ణం బాగా ఉంటుంది. నియోజకవర్గంలోనే నల్లమలలో దట్టమైన అడవులు ఉన్నాయి. చిరుతలు పెద్దపులులు ఇతర వన్యప్రాణులకు నిలయం నల్లమల్ల. ఉమామహేశ్వర క్షేత్రం, నిరంజన్ షావాలి దర్గా, మద్దిమడుగు, లొద్ది మల్లయ్య, తెలంగాణ అమర్నాథ్గా పలిచే సలేశ్వరం, మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు ప్రసిద్ధిగాంచినవి.అనేక కిలోమీటర్ల పరిధిలో దుందుభినది విస్తరించి ఉంది. ఎస్ఎల్బీసీ నక్కలగండి సాగునీటి ప్రాజెక్టులు పనులు నడుస్తున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో జంగల్ సఫారీ పేరుతో పర్యాటకులను ప్రత్యేకమైన వాహనంలో అడవిలో పర్యటింప చేస్తున్నారు. కే ఎల్ ఐ కాలువ విస్తీర్ణం నియోజకవర్గం లో అధికంగా ఉంది రైతులకు కొంతమేర లబ్ధి జరుగుతుంది. -
డ్రగ్ పరీక్షలకు కాంగ్రెస్ నేతలు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ‘డ్రగ్ ఆఫ్ వార్’నడుస్తోంది. ఈ వ్యవహారం కుటుంబసభ్యులను లాగే వరకూ వెళ్లింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలందరూ డ్రగ్ పరీక్షలు చేసుకుంటే తామూ సిద్ధంగా ఉన్నామని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులకు కూడా నార్కో పరీక్షలు చేయించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో డ్రగ్ పరీక్షకు రావాలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ ఎ.జీవన్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ మంగళవారం ఇక్కడి టీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను ఏదో యుద్ధం చేస్తున్నట్లు ప్రజల్లో భ్రమలు కలి్పంచేలా రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని బాలరాజు విమర్శించారు. రేవంత్ తీరు మారకుంటే ఆయన దుర్మార్గాలు, అరాచకాలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎండగడతామని హెచ్చరించారు. అమరుల స్తూపాన్ని తాకే అర్హత రేవంత్‌కు లేదని అన్నారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ ఐటీ, పారిశ్రామిక రంగాల్లోకి పెట్టుబడులు రాబ డుతూ హైదరాబాద్ ప్రతిష్టను పెంచుతున్న కేటీఆర్ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని, రేవంత్‌రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేస్తున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. రాహుల్ అమెరికాలో డ్రగ్స్ కేసులో పట్టుబడినట్లు బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి గతంలో ఆరోపించారని, ఈ అంశంపై పత్రికల్లో వార్తలు కూడా వచ్చా యని గుర్తుచేశారు. రేవంత్ నుంచి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలకు సూ చించారు. నేతల వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడం ద్వారా రాజకీయపబ్బం గడుపుకునే చర్యలను రేవంత్ మానుకోవాలని కిశోర్ హితవు పలికారు. -
దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకో
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి కొత్త బిచ్చగాడిలా రాష్ట్రంలో తిరుగుతున్నాడని, దమ్ముంటే యుద్ధానికి అనువుగా ఉన్న హుజూరాబాద్ వచ్చి డిపాజిట్ తెచ్చుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సవాల్ విసిరారు. బుధవారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించామన్నారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌లో పోటీలో నిలవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డి సమావేశాలకు హాజరుకావడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న దళితబంధుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. హుజూరాబాద్‌లో నిజమైన పొలిటికల్ యుద్ధం జరుగుతోందని, ఓ పక్క దళితులు, బడుగు బలహీన వర్గాల భూములను దోచుకుని ఈటల రాజేందర్ పువ్వుపార్టీ చాటున దాక్కున్నారని అన్నారు. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ అభ్యర్థి దొరకడం లేదని, భవిష్యత్‌లో ప్రజాప్రతినిధిగా రేవంత్‌రెడ్డిని ప్రజలు విశ్వసించరని, ప్రజా నాయకుడిగా కొనసాగాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ మాజీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీటీసీ బక్కారెడ్డి, మన్సిపల్ వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల–శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్రగతి భవన్‌ను అంబేడ్కర్ బహుజన్ భవన్‌గా మారుస్తాం -
‘రేవంత్ రెడ్డి, పవన్ చట్టసభలను అవమానించారు’
సాక్షి, హైదరాబాద్ : నల్లమల అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం యూరేనియం సర్వే, తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిందని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చేసిన చట్టాన్ని రేవంత్‌రెడ్డి అపహాస్యం చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, పవన్ ఇద్దరు చట్టసభలను అవమానించారని, అచ్చంపేటలో పుట్టిన రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా నియోజకవర్గం గురించి పట్టించుకోలేదని ఎమ్మెల్యే బాలరాజు విమర్శించారు. యూరేనియం అంశం మీద రచ్చ జరుగుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం సోనియా గాంధీతో ఫోటోలు దిగుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్టంలో హీరోయిజం మాటు మాట్లాడి.. ఢిల్లీకి వెళ్లి ఫోటోలు దిగుతున్నాడని ఆయన విమర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు అడవులు ఎక్కడ ఉంటాయో తెలియదు కానీ ఆయన కూడా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. పవన్‌కు రాజకీయంలో తిరిగే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. నల్లమల మీద అసెంబ్లీలో తీర్మానం చేస్తే పవన్ దానికి విలువ లేదనట్లు మాట్లాడటం సిగ్గు చేటని ఆయన అన్నారు. -
ఎన్నికల సిత్రాలు...
సంపద పెంచుతాం టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్దిని చూసి కారు గుర్తుకు మరోసారి ఓటు వేయాలని దేవరకద్ర టీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వరెడ్డి సతీమణి మంజుల కోరారు. మండల పరిదిలోని లాల్కోట గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుస్తూ ముందుకు సాగిన కుర్మ, యాదవుల ఇంట్లో గొర్రె పిల్లలు కనిపించగా ఇలా కాసేపు ఎత్తుకున్నారు. – చిన్నచింతకుంట పచారి కొట్టు.. ఓట్లు పట్టు గద్వాల టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సోమవారం పట్టణంలోని 15, 18వ వార్డుల్లో రాష్ట్ర జల వనరుల శాఖ చైర్మన్ వి.ప్రకాశ్‌తో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కుంటవీధిలోని ఓ కొట్టులో వస్తువులు అమ్ముతూ దుకాణానికి వచ్చే వారితో మాట్లాడారు. ఈసారి కారు గుర్తుకు ఓట్లు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు. – గద్వాల అర్బన్ పతి కోసం సతి ఆయన గెలుపుకోసం ఆమె ఎంతో కష్టపడుతోంది! నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం పట్టణంలోని 7వ వార్డులో పర్యటించి కరపత్రాలు, కారు గుర్తును చూపిస్తూ ప్రచారం చేశారు. మరోసారి ఎస్.ఆర్.రెడ్డిని గెలిపించాలని కోరారు. – నారాయణపేట రూరల్ ‘తీపి’ రుచి చూడండి..చూపించండి ఉమామహేశ్వర క్షేత్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు–అమల దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అచ్చంపేటలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాల వద్ద వ్యాపారులను కలిసి రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా స్వీట్లు కొనుగోలు చేసిన అమల మహిళలకు ఇలా తినిపించి.. తమకు కూడా మరోమారు విజయం ‘తీపి’రుచి చూపించాలని కోరారు. – అచ్చంపేట రూరల్ చాయ్ పోస్తా..ఓట్లు పడతా ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు ప్రతీ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం మండల పరిధిలోని చిన్నపాడులో డీకే.అరుణ కుమార్తె స్నిగ్దారెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీ పాయింట్ వద్ద ప్రజలకు చాయ్ పోసి అందిస్తూ ఆకట్టుకున్నారు. – ధరూరు -
‘భీ’ ఫారాల లొల్లి
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: బీ ఫారాలు ఇవ్వలేదని అభ్యర్థుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సోమవారం నామినేషన్ల ఉప సంహరణకు చివరిరోజు కావడంతో జెడ్పీ, ఎంపీటీసీలు పోటీ చేస్తున్న అభ్యర్థుల బీఫారాల కోసం బాహాబాహీకి దిగారు. వంగూరు జెడ్పీటీసీ స్థానం టీఆర్ఎస్ బీఫారంపై వివాదం రచ్చరచ్చ జరిగింది. జెడ్పీటీసీగా నామినేషన్ వేసిన కరాటే రాజుకు అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి గువ్వల బాలరాజుపై దాడికి యత్నించారు. బీఫామ్ నీకేంది ఇచ్చేదని తోసిపారేశారు. నన్ను చంపుతున్నారని కరాటే రాజు కేకలు వేయడంతో అక్కడ ఉన్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. రాజును పోలీసులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాజు మాట్లాడుతూ బీఫామ్ త నకే ఇస్తానని చెప్పి నామినేషన్ వేయించారని, తీరా బీఫామ్ ఇచ్చే సమయంలో వేరే వ్యక్తికి ఇచ్చారని మండిపడ్డారు. ఓయూలో తాను చేస్తున్న ఉద్యోగానికి సైతం రాజీనామా చేయించి... ఇప్పుడు గువ్వల బాల్‌రాజు మోసం చేశారని ఆరోపించారు. ఉదయం వరకు తనకే టిక్కెట్ ఇస్తానని చెప్పి... పూల్‌సింగ్‌కు టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. బీఫాం చింపే ప్రయత్నం... కొత్తూర్ మండల జెడ్పీటీసీ స్థానానికి టీఆర్ఎస్ తరుఫున నామినేషన్ వేసిన సత్యయ్యకు ఇచ్చిన బీఫాంను ఏనుగ మహీందర్‌రెడ్డి చింపే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న సత్యయ్య తరుఫున ఉన్న వ్యక్తులు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి బీఫాం ఉన్న సత్యయ్యను నామినేషన్ కేంద్రంలోకి పంపించారు. ఒకే స్థానానికి ఇద్దరికి బీఫారాలు ధన్వాడ: ధన్వాడ-3 ఎంపీటీసీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థులుగా నీరటి నర్సింహులు నాయుడు, బోయ బాల్‌రాజులకు బీఫారాలు జారీ చేయడంతో ఇరువురు తమదే ఆమోదించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సక్రియానాయక్తో వాగ్వివాదానికి దిగారు. నర్సింహులునాయుడుకు రెండురోజుల క్రితమే జిల్లా అధ్యక్షులు విఠల్‌రావు ఆర్య నుంచి పార్టీ బీఫారం పొంది ఎన్నికల అధికారికి అందజేశారు. సోమవారం శివకుమార్‌రెడ్డి వర్గానికి చెందిన బోయ బాల్‌రాజు మరో బీఫారాన్ని తెచ్చి ఎన్నికల అధికారికి ఇచ్చారు. దీంతో ఎవరిని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించాలో తెలియక ఎన్నికల అధికారి సందిగ్ధంలో పడిపోయారు.ఈ విషయంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సక్రియానాయక్ ‘పేట’ ఆర్డీఓ మోహన్‌రెడ్డి, సీఈఓతో చర్చించి...బాల్‌రాజుకు ఇచ్చిన బీఫారంలో సబ్‌స్ట్యూట్ అని సూచించలేకపోవడంతో మొదట బీఫారం తెచ్చిన నర్సింహులు నాయుడిని టీఆర్ఎస్ అభ్యర్థిగా బాల్రాజును స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించారు.