Hacking report
-
భారత సరిహద్దులో చైనా మరో దుశ్చర్య!
న్యూఢిల్లీ: భారత సరిహద్దులో చైనా మరో దుశ్చర్యకు పాల్పడ్డ విషయం వెలుగు చూసింది. హ్యాకర్ల సాయంతో సరిహద్దులో ఉన్న విద్యుత్ పంపిణీ కేంద్రాలపై హ్యాకింగ్‌కు పాల్పడే యత్నం చేసింది. ఈ విషయం ప్రైవేట్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ బయటపెట్టింది. లడఖ్ రీజియన్‌లోని పవర్ గ్రిడ్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ధృవీకరించింది. ఇటీవలి నెలల్లో.. గ్రిడ్ నియంత్రణ, విద్యుత్ పంపిణీ కోసం నిజ-సమయ(రియల్ టైం) కార్యకలాపాలను నిర్వహించేందుకు బాధ్యత వహించే కనీసం ఏడు ఇండియన్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్లను (SLDC) లక్ష్యంగా చైనా నెట్వర్క్ చొరబాట్లను గమనించాము. ముఖ్యంగా, ఈ లక్ష్యం లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న SLDCతో భౌగోళికంగా కేంద్రీకృతమై ఉందని గుర్తించాం. ఆ హ్యాకింగ్ ప్రయత్నాలన్నీ చైనా అధికారిక సైబర్ సెంటర్ల నుంచి వచ్చినవే’ అంటూ బుధవారం ఒక ప్రకటన చేసింది రికార్డెడ్ ఫ్యూచర్ కంపెనీ. పవర్ గ్రిడ్ ఆస్తుల లక్ష్యంతో పాటు.. జాతీయ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ, బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన భారతీయ అనుబంధ సంస్థను సైతం హ్యాకర్లు టార్గెట్ చేసినట్లు గుర్తించామని రికార్డెడ్ ఫ్యూచర్ వెల్లడించింది. ఈ లెక్కన ప్రభుత్వ సహకారంతోనే హ్యాకర్లు ఈ దాడులకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇక నివేదికను పబ్లిష్ చేసే ముందు.. ప్రభుత్వాన్ని ఈ విషయమై హెచ్చరించినట్లు సదరు గ్రూప్ వెల్లడించింది. ఈ అంశంపై కేంద్రం స్పందించాల్సి ఉంది. -
చైనా హ్యాకర్ల చేతిలో అమెరికా నేవీ వివరాలు
వాషింగ్టన్: అమెరికా నౌకాదళం (నేవీ)కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చైనా ప్రభుత్వ హ్యాకర్లు భారీస్థాయిలో చోరీ చేశారు. అమెరికా తయారుచేయబోయే కొత్త రకం జలాంతర్గాముల రహస్య సమాచారం సహా పలు కీలక వివరాలు చైనా హ్యాకర్లు సంపాదించారు. చోరీకి గురైన మొత్తం సమాచార పరిమాణం 614 జీబీ ఉంటుందనీ, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో హ్యాకింగ్ జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. సీ డ్రాగన్ అనే రహస్య ప్రాజెక్టు వివరాలు, సిగ్నళ్లు, సెన్సర్ల సమాచారం, సముద్రగర్భంలో యుద్ధానికి సంబంధించిన పలు వివరాలు చైనా హ్యాకర్ల చేతికి వెళ్లాయని ఓ అధికారి చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. -
నమో బాటలోనే కాంగ్రెస్ యాప్..
సాక్షి, పాట్నా : ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నమో యాప్ యూజర్ల అనుమతి లేకుండానే వారి డేటాను అమెరికన్ కంపెనీకి పంపుతోందని ఫ్రెంచ్ హ్యాకర్ ఎలియట్ అల్డర్సన్ ఆరోపించిన క్రమంలో తాజాగా కాంగ్రెస్ యాప్ సైతం సింగపూర్‌లోని ఓ కంపెనీకి సమాచారాన్ని చేరవేస్తోందని సంకేతాలు పంపారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కాంగ్రెస్ అధికారిక యాప్ ద్వారా సభ్యత్వానికి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారి వ్యక్తిగత వివరాలు పార్టీ సభ్యత్వ ఆన్లైన్ పేజ్‌కు హెచ్‌టీటీపీ ద్వారా వెళతాయని అల్డర్సన్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మెంబర్షిప్ పేజ్ ఐపీ అడ్రస్ సింగపూర్‌లోని ఓ సర్వర్‌కు అనుసంధానమైందని చెప్పుకొచ్చారు. అల్డర్సన్ ట్వీట్ నేపథ్యంలో కాంగ్రెస్ తీరును పలువురు ట్విటర్ యూజర్లు తప్పుపట్టారు. మరోవైపు వేరొక దేశంలో సర్వర్లు ఉన్నంతమాత్రాన డేటా లీకవుతుందనేందుకు వీలులేదని మరికొందరు చెబుతున్నారు. రాజకీయ కోణంలోనే అల్డర్సన్ ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే సాంకేతిక అంశాలను ప్రజల ముందుంచేందుకే తన ప్రయత్నమని ఇందులో తనకెలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ఫ్రెంచ్ హ్యాకర్ అల్డర్సన్ చెప్పుకొచ్చారు. కాగా, ఐఎన్‌సీ అధికారిక యాప్‌లో భద్రతా లోపాలపై ఫ్రెంచ్ హ్యాకర్ ట్వీట్ చేసిన గంటకే గూగుల్ ప్లేస్టోర్ నుంచి తన యాప్‌ను కాంగ్రెస్ తొలగించింది. మరోవైపు కాంగ్రెస్ యాప్‌ను తొలగించడంపై బీజేపీ స్పందించింది. నమోయాప్ను డిలీట్ చేయాలని డిమాండ్ చేసిన రాహుల్ చివరకు కాంగ్రెస్ యాప్‌నే తొలగించారని ఆ పార్టీ ఎద్దేవా చేసింది. -
అందరి లెక్కలు తేలుస్తాం: ట్రంప్
న్యూయార్క్: 'నాపై పత్రికల్లో వచ్చిన కథనాలన్నీ పిచ్చిరాతలు.. పచ్చి అబద్ధాలు..’ అని కొట్టిపారేసిన డొనాల్డ్ ట్రంప్.. ప్రత్యర్థి డొమొక్రటిక్ పార్టీ నేతల కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని బాంబు లాంటి వార్త పేల్చారు. ఎన్నికల సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చేతులు కలిపారని, ఆ దేశ అధికారుల సాయం వల్లే విజయం సాధించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 90 రోజుల సమయంలో అందరి లెక్కలు తేలుస్తానని మరో ఎనిమిది రోజుల్లో అధ్యక్ష పదవి చేపట్టనున్న ట్రంప్ వ్యాఖ్యానించారు. హ్యాకింగ్ విషయంపై తాను దృష్టిపెట్టినట్లు పేర్కొన్న ట్రంప్.. యాంటీ హ్యాకింగ్ టీమ్ ఏర్పాటుచేసి ఎన్నికల సమయంలో జరిగిన సైబర్ దాడుల వివరాలను ప్రజలకు తెలియజేస్తానని తెలిపారు. ప్రతిరోజు అమెరికా అధికారిక, అనధికారిక వెబ్సైట్లను రష్యాతో పాటు చైనా, మరికొన్ని దేశాలు హ్యాక్ చేయాలని తీవ్రంగా యత్నిస్తాయని ఆరోపించారు. తమ నుంచి ఎంతో లబ్ధిపొందిన జపాన్, చైనా, రష్యా, మెక్సికో దేశాలు అమెరికాను గౌరవించాలన్నారు. ఇటీవల జరిగిన సైబర్ దాడి వల్ల 22 మిలియన్ల వ్యక్తుల వివరాలను కోల్పోయాయని, ఇది కచ్చితంగా చైనా చర్యేనని ట్రంప్ ఆరోపించారు. 'ప్రపంచంలో గ్రేటెస్ట్ కంప్యూటర్ మైండ్ ఉన్న ఆరుగురిని సెలెక్ట్ చేసుకుంటాం. వారందరినీ ఒక్కటిగా చేసి.. సైబర్ దాడులకు అడ్డుకట్ట వేస్తాం. సైబర్ దాడులపై వచ్చిన ఆరోపణలపై పూర్తి సమాచారాన్ని రిట్రీవ్ చేసుకుంటాం. సైబర్ సెక్యూరిటీని పూర్తిస్థాయిలో మెరుగు పరిచి ఏ దేశానికి హ్యాకింగ్ చేయడానికి అవకాశం లేకుండా చేస్తాం. 90 రోజుల్లో హ్యాకింగ్ కు గురయిన డేటా వివరాలపై పూర్తిస్థాయి నివేదిక రూపొందిస్తాం' అని డొనాల్ట్ ట్రంప్ వివరించారు.