The Hague
-
16 ఏళ్లుగా వీర్యదానం?.. ఎట్టకేలకు కళ్లెం!
ఆమ్స్టర్డ్యామ్: నెదర్లాండ్స్ కోర్టు ఒకటి శుక్రవారం ఆసక్తికర తీర్పు వెల్లడించింది. ఓ వ్యక్తిని ఇకపై వీర్యదానం చేయొద్దని పేర్కొంటూ అతనిపై నిషేధం విధించింది. అంతగా ఎందుకు సీరియస్ అయ్యిందంటే.. గత 16 ఏళ్లుగా అతను వీర్యదానం చేస్తూ వస్తున్నాడట!. ఆ దానం వల్ల వందల మంది పిల్లలు పుట్టారట!. అది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఈ తీర్పు ఇస్తూ.. ఇంకోసారి దానం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. జోనాథన్ జాకోబ్ మెయిజర్(41) అనే వ్యక్తికి వ్యతిరేకంగా ది హేగ్ నగరంలోని న్యాయస్థానంలో.. ఓ మహిళ, ఓ ఫౌండేషన్లు దావా వేశాయి. తన వీర్యం ద్వారా తాను ఎంతమందికి జన్మనిచ్చాననే విషయాన్ని దాచి.. తన దగ్గరికి వచ్చే పేరెంట్స్‌ను జోనాథన్ మోసం చేశాడన్న అభియోగాలు ఉన్నాయి. విచారణ అనంతరం అది నిజమని కోర్టు తేల్చింది. ఇకపై జోనాథన్ వీర్యదానం చేయకూడదని ఆదేశిస్తూ.. ఒకవేళ కాదని ఆ పని చేస్తే లక్ష యూరోల(మన కరెన్సీలో 90 లక్షల రూపాయలకు పైమాటే) జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు.. ఇప్పటిదాకా జన్మినిచ్చిన పిల్లల పేరెంట్స్‌తో జోనాథన్ సంప్రదింపులు కూడా జరపొద్దని స్పష్టం చేసింది. మ్యూజిషియన్ అయిన జోనాథన్ జాకోబ్ మెయిజర్.. ప్రస్తుతం కెన్యాలో ఉంటున్నాడు. ఇప్పటిదాకా 13 క్లినిక్స్‌లో తన వీర్యాన్ని దానం చేశాడని తెలుస్తోంది. అందులో 11 క్లినిక్స్ నెదర్లాండ్స్‌లోనే ఉన్నాయి. డచ్ క్లినికల్ గైడ్‌లైన్స్ ప్రకారం.. వీర్యదాతలు 12 మంది మహిళలకంటే ఎక్కువమందికి వీర్యదానం చేయకూడదు. 25 మంది పిల్లలకు మించి జన్మనివ్వకూడదు. అయితే.. మెయిజర్ మ్రాం నిబంధనలకు విరుద్ధంగా వీర్యదానం చేసుకుంటూ పోతున్నాడు. 2007 నుంచి.. అతని వీర్యదానం ఫలితంగా ఏకంగా 550 నుంచి 600 మంది పిల్లలు పుట్టారట. విచ్చలవిడిగా వీర్యదానం చేసుకుంటూ పోతున్న అతనిపై 2017లో నిషేధం విధించాయి అక్కడి ఫెర్టిలిటీ క్లినిక్స్. అయితే.. అప్పటి నుంచి విదేశాల్లో ఉన్నవాళ్లకి ఆన్లైన్ సంప్రదింపుల ద్వారా వీర్యదానం చేస్తూ వస్తున్నాడు. అయితే.. పిల్లల్ని కనలేని తల్లిదండ్రులకు మెయిజర్ సాయం చేస్తున్నాడని, నిషేధం సరికాదని అతని లాయర్ చెబుతున్నాడు. ఇదీ చదవండి: సూడాన్‌లో చిమ్మచీకట్లో.. మన సైన్యం సాహసం -
బాధితుల గొంతుక.. ప్రాణాలతో పోరాడుతున్న డచ్ క్రైమ్ రిపోర్టర్
హేగ్ (నెదర్లాండ్స్): ప్రముఖ డచ్ క్రైమ్ రిపోర్టర్ పీటర్ ఆర్. డి వ్రీస్పై దుండుగులు కాల్పులకు తెగపడ్డారు. తీవ్రగాయాపాలైన ఆయనను ఆమ్స్టర్డామ్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. డి వ్రీస్ తలపై దుండగులు అయిదు సార్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. పీటర్ ఆర్. డి వ్రీస్ జర్నలిస్ట్, టీవీ ప్రెజెంటర్. క్రిమినల్ కేసులపై పరిశోధన చేయడంలో ఆయనకు మంచి పేరు ఉంది. పీటర్ ఆర్. డి వ్రీస్ బాధితుల తరపున నిత్యం తన గొంతుకను వినిపిస్తుంటారు. గతంలో డి వ్రీస్కు అనేక కేసులకు సంబంధించి క్రిమినల్ అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ ఘటనపై డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే హేగ్‌లోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఈ దాడి దిగ్భ్రాంతికరమైనది. ఓ సాహసోపేతమైన జర్నలిస్టుపై దాడి చేయడం.. మన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత పత్రికల పై దాడి చేయడం వంటిది." అని అన్నారు. కాగా, ఈ ఘటనలో షూటర్‌తో.. సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డౌన్ టౌన్ లీడ్సెప్లిన్ స్క్వేర్ సమీపంలో కాల్పులు జరిపిన ప్రాంతంలో వీడియో ఫుటేజ్, సాక్షి స్టేట్మెంట్స్, ఫోరెన్సిక్ సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇక 2005లో అరుబాలో టీనేజర్ నటాలీ హోల్లోవే అదృశ్యంపై దర్యాప్తు చేసినందుకు 2008లో కరెంట్ ఎఫైర్స్ విభాగంలో డి వ్రీస్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు. -
రెండున్నర కోట్ల ముత్యం...!
ముత్యాల దండలో ఒదిగి పోయే ముత్యం అదేనండి పెరల్...మహా అయితే సింగిల్ ముత్యానికి వెయ్యి రూపాయిలో అంతగా కాకపోతే మరీ ప్రత్యేకమైనదైతే లక్ష రూపాయలు ఉంటుంది అని అనుకోవడం సహజమే... అయితే ఈ ముత్యానికి మాత్రం ఏకంగా రెండున్నర కోట్లకు పైగానే (3.2 లక్షల యూరోలు) పలికింది. ఇంత పెద్దమొత్తంలో ధర పలకడానికి దానికెవో ప్రత్యేకతలుంటాయని భావించడం సహజమే. విలక్షణమైన ఆకృతి కలిగిన ఈ ముత్యం ‘ద స్లీపింగ్ లయన్ పెరల్’గా గుర్తింపు పొందింది. దాదాపు 300 ఏళ్ల క్రితం చైనా జలాల్లో (మరీ ముఖ్యంగా పెరల్ రివర్‌లో) ఇది రూపుదిద్దుకుని ఉంటుందని భావిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద తాజానీటి ముత్యంగా పరిగణిస్తున్న దీనిని గతంలో కేథరీన్ ది గ్రేట్ ఆధీనంలో ఉండేది. ఇటీవల నెథర్లాండ్లోని హేగ్‌లో నిర్వహించిన వేలంలో దానిని రూ.రెండున్నర కోట్లకు పైగా రికార్డ్ మొత్తానికి విక్రయించారు. 120 గ్రాముల బరువు. దాదాపు ఏడు సెంటీమీటర్లు (2.7 అంగుళాలు) పొడవైనది. ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ముత్యాల్లో ఇదొకటి. 1765 ప్రాంతంలో యునైటెడ్ ఈస్ట్ ఇండీస్ కంపెనీకి చెందిన ఓ డచ్ వ్యాపారి దీనిని బతావియా (జకార్తా)కు తీసుకొచ్చాడు. ఆ తర్వాత కంపెనీ అకౌంటెంట్ హెండ్రిక్ శాండర్స్ దానిని సొంతం చేసుకున్నాడు. శాండర్స్ మరణం తర్వాత 1778లో ఆ ముత్యాన్ని అమ్‌స్టర్‌డామ్‌లో వేలం వేశారు. దానిని రష్యా రాణి కేథరీన్ ది గ్రేట్ కొనుగోలు చేశారు.సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని తన నివాసంలో 1796 వరకు దీనిని ప్రదర్శనలో పెట్టారు. ఆమె మరణం తర్వాత అక్కడి నుంచి ఈ ముత్యం మాయమై పోలండ్‌లో తేలింది. దీనిని పొందేందుకు ఎన్నో ప్రయత్నాల అనంతరం 1865లో డచ్ స్వర్ణకారుడి వద్దకు చేరుకుంది. నాలుగుతరాల పాటు ఆ కుటుంబసభ్యుల వద్దే ఉండిపోయింది. దీనిపై పరిశోధనకు, దీనితో ముడిపడిన చరిత్రను వెలికితీసేందుకు 1979లో అమ్‌స్టర్‌డామ్ పెరల్ సొసైటీ ఈ ముత్యాన్ని కొనుగోలు చేసింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బాన్‌కీ మూన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం
ది హాగ్యు: యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్‌కు డచ్ అత్యున్నత రాయల్ పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్ ది నెదర్లాండ్స్ లయన్' లభించింది. మంగళవారం నెదర్లాండ్స్‌లోని ది హాగ్యు పట్టణంలో మూన్ ఈ పురస్కారాన్ని డచ్ విదేశాంగ శాఖ మంత్రి బెర్ట్ కోఏండర్స్ చేతుల మీదుగా అందుకున్నారు. సభలో మూన్ గురించి మాట్లాడిన బెర్ట్.. ప్రపంచ శాంతిభద్రతలు, న్యాయం, అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేశావని ప్రకృతి విపత్తుల బాధితులకు గొంతుక అయ్యారని మూన్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రపంచ శాంతితో పాటు దేశాల మధ్య సఖ్యతను నెలకొల్పడం, మానవ హక్కుల కోసం పోరాటం కింద డచ్ ప్రభుత్వం మూన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.1815లో ప్రారంభమైన ఈ పురస్కార ప్రధానం ప్రపంచంలోని అన్ని రంగాల్లో నిపుణులకు డచ్ ప్రభుత్వం అందజేస్తోంది. గతంలో యూఎన్ జనరల్‌గా పనిచేసిన కొఫ్పి అన్నన్ కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. -
అంతర్జాతీయ శాంతి బహుమతికి నేహా నామినేట్
ది హేగ్: అంతర్జాతీయ చిన్నారుల శాంతి బహుమతి -2014కి భారతీయ సంతతికి చెందిన నేహా అనే టీనేజీ బాలిక యూఎస్ నుంచి నామినేట్ అయింది. ఆమెతో పాటు రష్యా నుంచి అలెక్స్, ఘనా నుంచి అండ్రూలు కూడా నామినేట్ అయ్యారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. చిన్నారులకు హక్కులను కాపాడటంలో చురుకైన పాత్ర పోషించే టీజేజీ బాలికలకు ఈ అవార్డును అందజేస్తారని తెలిపింది. 18 ఏళ్ల నేహా యూఎస్‌లో సొంతంగా ఓ ఫౌండేషన్ స్థాపించి... దీని ద్వారా చిన్నారుల హక్కులపై చైతన్యం కలిగిస్తుందని పేర్కొంది. అలాగే 17 ఏళ్ల అలెక్స్... హోమో సెక్య్సువల్, ట్రాన్స్‌జెండర్‌పై రష్యాలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. 13 ఏళ్ల అండ్రూ దేశంలో కరువుపై పోరాడుతూ... ఫుడ్ ఎయిడ్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారని వెల్లడించింది. 2005 నుంచి అంతర్జాతీయ చిన్నారుల శాంతి బహుమతి పథకాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఈ అవార్డు విజేత పేరును నవంబర్ 18న ది హేగ్‌లో ప్రకటిస్తారని మీడియా తెలిపింది.