ముత్యాల దండలో ఒదిగి పోయే ముత్యం అదేనండి పెరల్...మహా అయితే సింగిల్ ముత్యానికి వెయ్యి రూపాయిలో అంతగా కాకపోతే మరీ ప్రత్యేకమైనదైతే లక్ష రూపాయలు ఉంటుంది అని అనుకోవడం సహజమే... అయితే ఈ ముత్యానికి మాత్రం ఏకంగా రెండున్నర కోట్లకు పైగానే (3.2 లక్షల యూరోలు) పలికింది. ఇంత పెద్దమొత్తంలో ధర పలకడానికి దానికెవో ప్రత్యేకతలుంటాయని భావించడం సహజమే.
విలక్షణమైన ఆకృతి కలిగిన ఈ ముత్యం ‘ద స్లీపింగ్ లయన్ పెరల్’గా గుర్తింపు పొందింది. దాదాపు 300 ఏళ్ల క్రితం చైనా జలాల్లో (మరీ ముఖ్యంగా పెరల్ రివర్‌లో) ఇది రూపుదిద్దుకుని ఉంటుందని భావిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద తాజానీటి ముత్యంగా పరిగణిస్తున్న దీనిని గతంలో కేథరీన్ ది గ్రేట్ ఆధీనంలో ఉండేది. ఇటీవల నెథర్లాండ్‌లోని హేగ్‌లో నిర్వహించిన వేలంలో దానిని రూ.రెండున్నర కోట్లకు పైగా రికార్డ్ మొత్తానికి విక్రయించారు. 120 గ్రాముల బరువు. దాదాపు ఏడు సెంటీమీటర్లు (2.7 అంగుళాలు) పొడవైనది. ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ముత్యాల్లో ఇదొకటి. 1765 ప్రాంతంలో యునైటెడ్ ఈస్ట్ ఇండీస్ కంపెనీకి చెందిన ఓ డచ్ వ్యాపారి దీనిని బతావియా (జకార్తా)కు తీసుకొచ్చాడు.
ఆ తర్వాత కంపెనీ అకౌంటెంట్ హెండ్రిక్ శాండర్స్ దానిని సొంతం చేసుకున్నాడు. శాండర్స్ మరణం తర్వాత 1778లో ఆ ముత్యాన్ని అమ్‌స్టర్‌డామ్‌లో వేలం వేశారు. దానిని రష్యా రాణి కేథరీన్ ది గ్రేట్ కొనుగోలు చేశారు.సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని తన నివాసంలో 1796 వరకు దీనిని ప్రదర్శనలో పెట్టారు. ఆమె మరణం తర్వాత అక్కడి నుంచి ఈ ముత్యం మాయమై పోలండ్‌లో తేలింది. దీనిని పొందేందుకు ఎన్నో ప్రయత్నాల అనంతరం 1865లో డచ్ స్వర్ణకారుడి వద్దకు చేరుకుంది. నాలుగుతరాల పాటు ఆ కుటుంబసభ్యుల వద్దే ఉండిపోయింది. దీనిపై పరిశోధనకు, దీనితో ముడిపడిన చరిత్రను వెలికితీసేందుకు 1979లో అమ్‌స్టర్‌డామ్ పెరల్ సొసైటీ ఈ ముత్యాన్ని కొనుగోలు చేసింది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment