hair donated
-
8 ఏళ్ల తర్వాత జుట్టు కత్తిరించా: కొరియోగ్రాఫర్
ముంబై: కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ మెల్విన్ లూయిస్ క్యాన్సర్ పేషెంట్ల కోసం తన జుట్టును దానం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ లేఖను షేర్ చేశారు. "క్యాన్సర్ రోగులకు దానం చేయడం కోసం నా జుట్టును పెంచుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాన్ని కత్తిరించే సమయం ఆసన్నమైందని భావించాను. నిజానికి నాకు భుజాల వరకు జుట్టు ఉండటమే ఇష్టం. కానీ దాన్ని ఇంకా పొడవుగా పెంచుకుని.. క్యాన్సర్ పేషెంట్లకు అవసరమయ్యే విగ్గుల కోసం దానం చేయవచ్చు కదా అనిపించింది. ఈ క్రమంలో నేను పొడవు జుట్టుతో చేసిన వీడియోలు కొన్ని వైరల్ కూడా అయ్యాయి" (చదవండి: నేనేమీ తనను బలవంతపెట్టలేదు: సనా భర్త) "అయితే ఇలా ఎందుకు జుట్టు పెంచుకుంటున్నానన్నది కొందరికే తెలుసు. ఇప్పుడు అందరికీ తెలిసింది. 8 ఏళ్ల తర్వాత నేను నా జుట్టును కత్తిరించాను. క్యాన్సర్ మహమ్మారితో పోరాడేవారి కోసం నేను ఎప్పటికీ ప్రార్థిస్తాను, వారిపై నా ప్రేమ ఎల్లప్పటికీ ఉంటుంది. ఇలాంటి మంచి పనులు చేయడానికి నన్ను ప్రేరేపించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు" అని రాసుకొచ్చారు. కాగా మెల్విన్ స్నేహితులు చిన్న వయసులోనే క్యాన్సర్ పేషెంట్ల కోసం జుట్టును దానం చేశారు. దాన్ని ప్రేరణగా తీసుకునే అతడు ఈ పనికి పూనుకున్నారు. మెల్విన్ చేసిన మంచిపనికి అభిమానులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు మీరు మాకు ఇన్స్పిరేషన్గా నిలిచారని కీర్తిస్తున్నారు. (చదవండి: క్యాన్సర్ పిల్లలకు తల్లిగా...) View this post on Instagram A post shared by Melvin Louis (@melvinlouis) View this post on Instagram A post shared by Melvin Louis (@melvinlouis) -
వయసులో చిన్నది.. ఔదార్యంలో గొప్పది
గాంధీనగర్: మనిషికి కొత్త అందాన్నిచ్చే జుట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే.. మగువ అందంలో ఎనలేని పాత్ర పోషించే జుట్టును క్యాన్సర్ రోగుల కోసం దానం చేసి తమ ఔదార్యం చూపి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది సూరత్‌కు చెందిన ఓ చిన్నారి. వివరాలు.. దేవ్నా జనార్దన్ అనే పదేళ్ల చిన్నారి చైల్డ్ ఆర్టిస్ట్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో క్యాన్సర్ రోగులకోసం తన జుట్టును దానం చేసింది. దీని గురించి దేవ్నా మాట్లాడుతూ.. ‘నా జుట్టు దానం చేస్తే ఎవరైనా ఆనందం పొందుతారంటే.. వారి కోసం సంతోషంగా నా జుట్టు ఇచ్చేయాలనుకున్నాను’ అంటుంది ఈ చిన్నారి. తన 32 అంగుళాల పొడవాటి జుట్టును దానం చేసింది. భవిష్యత్తులో క్యాన్సర్ స్పెషలిస్ట్ కావాలని దేవ్నా కోరుకుంటుంది. పదేళ్ల ఈ చిన్నారి చూపిన ఔదార్యం ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చిన్నదానివైనా.. మనసు మాత్రం గొప్పది అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు. (చదవండి: క్యాన్సర్ పిల్లలకు తల్లిగా...) -
కేన్సర్ బాధితులకు కేశాల దానం
అమ్మాయిల ముఖ వర్ఛస్సుకు జుట్టు ఎంత అవసరమో తెలియంది కాదు. అందుకేఅబ్బాయిల తరహాలో గుండుతో కనిపించే అమ్మాయిలను చూడడమే అరుదు. మరోవైపు కేశాలంకరణ కోసమే వేల రూపాయలు ఖర్చు చేసే వారు కోకొల్లలు. అయితే అందరికీ తెలిసిన మహిళల శైలికిభిన్నంగాముఖ సౌందర్యం కన్నా మానసిక సౌందర్యం మిన్న అని నమ్ముతున్నారు కొందరు. కేన్సర్ బాధితుల కోసం శిరోజాలను దానం చేస్తూ...స్ఫూర్తిని అందిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లు, నిత్యావసర ఉత్పత్తుల్లో మితిమీరిన కేన్సర్ కారక రసాయనాల వాడకంతో చిన్నా పెద్దా తేడా లేకుండా కేన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ వ్యాధికి చికిత్సగా అందించే కీమోథెరపి కారణంగా జుట్టు మెత్తం రాలిపోవడం, తద్వారా ఆత్మనూన్యతకు గురికావడం కనిపిస్తోంది. అలాంటి బాధితుల్లో చిన్నారుల కోసం కొన్ని స్వచ్చంద సంస్థలు దాతల శిరోజాలతో కృత్రిమ విగ్స్ తయారు చేసి వ్యాధిగ్రస్త పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాయి. ఈ క్రతువులో నగర మహిళలు ఎందరో మేము సైతం అంటున్నారు. బాధితుల కోసం.. నగరంలోని ఓ హెయిర్ సెలూన్లో స్టైలిస్ట్‌గా పనిచేసే శివ యాదవ్ కేన్సర్ భాధితులకు ఉచితంగా విగ్స్ తయారు చేసి అందించే మదత్ ట్రస్ట్ గురించి తెలుసుకున్నాడు. దీనికి తన వంతు సాయం చేయాలనే ఆలోచనతో.. హేర్ డొనేషన్ ఫర్ కేన్సర్ పేషెంట్స్ ప్రారంభించాడు. అలా సేవా తత్పరత కలిగిన వారి నుంచి జుట్టుని సేకరించి ట్రస్ట్‌కి పంపుతున్నాడు. ‘‘ఒక విగ్ తయారీకి కనీసం 5, 6గురి నుంచి జుట్టు అవసరం అవుతుంది.. అలాగే దాతల కేశాల పొడవు కనీసం 12 అంగుళాలు ఉండాలి. అందుకే అమ్మాయిలు జుట్టు మాత్రమే ఉపకయోగపడుతుంది. ఓ ప్రత్యేకమైన పద్ధతిలో ఆ జుట్టుని కత్తిరించి సేకరించిన అనంతరం దాతలకి ట్రస్ట్ తరపున ప్రశంసా పత్రం అందిన్తాం. ఉద్యోగంతో పాటు ఓ మంచి పని చేస్తున్నాననే ఆలోచన మరింత ఉత్సాహన్నిస్తోంది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు శివ. జుట్టు లేకుండా తిరుగుతున్నా... నేను పని చేస్తున్న రంగంలో అందానికి ప్రాధాన్యత ఎక్కువ. గుండుతో బ్యూటీ ట్రైనర్‌గా కొనసాగడం సామాన్యమైన విషయం కాదు. అయినా సరే కేన్సర్ భాధిత చిన్నారుల్లో చిరునవ్వు చూడడం కోసం నా శిరోజాలను దానం చేశాను. అంతేకాదు.. దీని గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచాలనుకుని క్యాప్ లేకుండానే తిరుగుతూ...ప్రశ్నించిన ప్రతి ఒక్కరికీ వివరంగా చెప్తున్నా. అందులో కొందరు తాము కూడా డొనేషన్‌కి ముందుకు రావడం మరింత ఆనందంగా అనిపిస్తోంది. – బిందు, బ్యూటీ ట్రైనర్ సకుటుంబసమేతంగా.... కేన్సర్ మహమ్మారితో కుదేలైన పిల్లల్ని చూసినప్పుడు ఎంతో బాధ అనిపించేది. వీరి గురించి మనమేం చేయలేమా అనుకునేదాన్ని. అలాంటి సమయంలోనే కేన్సర్ బాధితులకు హేర్ డొనేషన్ తెలిసింది. నాతో పాటు పిల్లలకు చిన్నప్పటి నుంచే సామాజిక, నైతిక విలువలు నేర్పించాలనే ఉద్దేశ్యంతో మా కుమార్తెలు శరణ్య, నూతన కేశాలు కూడా డొనేట్ చేశాను. నా ఆలోచనను నా భర్త పూర్తిగా ప్రోత్సాహించారు. – లత, ఎస్.ఆర్ నగర్ అమెరికా టు ఇండియా.. అమెరికాలో ఉంటూ ఇండియా వచ్చినప్పుడల్లా తిరుమలలో తలనీలాలను ఇవ్వడం ఆనవాయితి. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా వెంట్రుకలను డొనేట్ చేయొచ్చు అని నిరూపించాలనుకున్నా. నా భార్య సలçహా మేరకు ప్రత్యేకంగా డొనేషన్‌కి సరిపోయేంత పొడవు వెంట్రుకలను పెంచా. గత డిసెంబర్లో ఇండియా వచ్చి కేశాలను దానం చేశా. – భరత్ నేటి నుంచి కేన్సర్‌పై అవగాహన గచ్చిబౌలి: కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని కొండాపూర్ అపోలో క్లినిక్ డాక్టర్ విజయ్ కరణ్‌రెడ్డి తెలిపారు. సోమవారం కొండాపూర్ అపోలో క్లినిక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నుంచి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల పాటు ‘ఐయామ్ ఐ విల్’ పేరిట ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ల ద్వారా అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కేన్సర్‌పై తీసుకుంటున్న జాగ్రత్తలు, దురలవాట్లను విడనాడటం తదితర అంశాలను జోడించి ప్రతిజ్ఞ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తారని తెలిపారు. 50 వేల మందికి పోస్టింగ్‌లు పంపే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా గుర్తిస్తే పూర్తిస్థాయి చికిత్స ఖైరతాబాద్: రోజు రోజుకూ పెరుగుతున్న లివర్ కేన్సర్ పై అవగాహన కల్పించడంతో పాటు ఆధునిక లివర్ శస్త్రచికిత్సలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ చైర్మన్ సీనియర్ కన్సల్టెంట్, సర్టికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ కె.రవీంద్రనా«థ్ సోమవరాం తెలిపారు. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన శరీరంలో అతి పెద్ద అవయవం...ఎక్కువ క్రియలు నిర్వర్తించేది లివర్(కాలేయం) అన్నారు. కొంత కాలంగా లివర్ కేన్సర్ల బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఫ్యాటీ లివర్ సిర్రోసిస్‌గా మారి లివర్ కేన్సర్‌కు దారితీయడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం ఇలా అనేక కారణాల వల్ల లివర్ దెబ్బతిని లివర్ కేన్సర్‌కు కారణమవుతున్నాయన్నారు. ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, జాండీస్ రావడం వంటి లక్షణాలుంటే నిపుణులైన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్స్పెషలిస్ట్ను సంప్రదించాలన్నారు. ప్రస్తుతం లివర్ కేన్సర్‌కు ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందుగానే గుర్తిస్తే లివర్ కేన్సర్‌ను చాలా వరకు పూర్తిగా నయం చేయవచ్చన్నారు. కరోనాపై అవగాహన ఖైరతాబాద్: కరోనా వైరస్ హై అలర్ నేపథ్యంలో గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రంగనాథ్ ఎన్ అయ్యర్ సోమవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. హాస్పిటల్ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్, క్రిటికల్ కేర్ సిబ్బందికి జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ లక్షణాలతో ఎవరైనా ఆస్పత్రికి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్, క్రిటికల్ కేర్ సిబ్బంది తరచూ చేతులు వాష్ చేసుకోవడం, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అడ్డుగా కడ్చీప్లు, ఎన్ 95 మాస్క్‌లు ఉపయోగించాలన్నారు. వైరస్ సోకిన వ్యక్తి లాలాజలం, ఇతరత్రా ద్రవాలను తాకడం, ఆ చేతులను తిరిగి మనం ముఖంపై పెట్టుకోవడం వల్ల కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలిపారు. దీనికంటూ ప్రత్యేక చికిత్స ఏమీ ఉండదని, అవసరమైతే నగరంలో అందుబాటులో ఉన్న కరోనా వైరస్ పరీక్షలు చేయించాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, దగ్గు, జలుబు ఉన్నవారితో దగ్గర సంబంధాలను కొనసాగించరాదని, జనసంచారం ఉన్న ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించడం, శ్వాసకోస ఇబ్బందులుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో హాస్పిటల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ మనీందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కేన్సర్ బాధితుల కోసం జుట్టు దానం
జూబ్లీహిల్స్: అతివలకు కొత్త అందాన్నిచ్చే జుట్టు గురించి ఎంతచెప్పినా తక్కువే.. మగువ అందంలో ఎనలేని పాత్ర పోషించే జుట్టును కేన్సర్ రోగుల కోసం దానం చేసి తమ ఔదార్యం చూపి ఎంతోమంది మహిళలు ఆదర్శంగా నిలిచారు. హోప్‌ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆద్వర్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లో కేన్సర్ బాధిత మహిళల కోసం హెయిర్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. క్యాంప్‌లో పాల్గొన్న పలువురు మహిళలు తమ శిరోజాలను దానం చేశారు. భావన అనే మహిళ తన పూర్తి జుట్టును దానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకురాలు హిమజ తదితరులు పాల్గొన్నారు. పూర్తి జుట్టును దానం చేసిన భావన -
ఇవ్వడంలోనే ఉంది సంతోషం
ఉద్యోగం చేసేవారైనా, ఇంటిపట్టున ఉండేవారైనా ఆడవాళ్లు పొడవైన శిరోజాలను ఇష్టపడతారు. ఏ ఉద్యోగంలో ఉన్నా వాటిని వదులుకోవడానికి ఇష్టపడరు. అందుకే.. కేరళలో మహిళా పోలీస్ అధికారి అపర్ణ లవకుమార్ ఓ క్యాన్సర్ బాలిక విగ్గు కోసం పొడవాటి తన జడ కత్తిరించి ఇవ్వడం ఒక విశేషం అవడమే కాకుండా.. ఎందరికో ఆమె ప్రేరణగా నిలిచారు. త్రిశూర్ సమీపంలోని ఇరింజలకుడ మహిళా పోలీస్ స్టేషన్లో అపర్ణ సీనియర్ పోలీస్ అధికారి. 17 ఏళ్ల క్రితం పోలీసుగా విధులను చేపట్టారు అపర్ణ. ఆమె కురులు తల నుంచి మోకాలి పొడవు వరకు ఉండేవి. మూడేళ్ల క్రితం తొలిసారిగా ఆమె జుట్టును క్యాన్సర్ పేషంట్ల కోసం దానం చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ పనికి పూనుకున్నారు. ‘ముందు ఎవరికీ చెప్పలేదు. అలా చెబితే నాకు అడ్డు చెప్పేవారే ఎక్కువ ఉంటారు. ఆలోచన వచ్చిన వెంటనే సెలూన్‌కి వెళ్లిపోయాను. విగ్గులు తయారు చేసేవారికి ఆ వెంట్రుకలు ఇచ్చేశాను. ఆ విగ్గును క్యాన్సర్ బారిన పడిన పిల్లలకు చేరేలా చూశాను. ఇదో పెద్ద విషయంగా పరిగణించలేదు’’ అని చెబుతారు అపర్ణ. ప్రజలకు ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో లేను, ఇలా కొందరి పిల్లల ముఖాల్లో నవ్వులు చూడాలనుకున్నాను అంతే’’ అంటూ సంతోషంగా చెబుతున్నారు అపర్ణ. ఆత్మన్యూనతను పోగొట్టేందుకు క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగినా, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా చూడడం కష్టం. పిల్లలకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమో గురించి అంతగా తెలియదు. ‘‘క్యాన్సర్ బారిన పడిన పిల్లలు కీమోథెరపీ చేయించుకుని జుట్టు కోల్పోయిన తరువాత పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడ తోటి పిల్లల నుంచి ఎగతాళిని ఎదుర్కోవచ్చు. లేదంటే అందరికీ జుట్టు బాగా ఉండి తమకెందుకు ఇలా జరిగిందని బాధపడవచ్చు. ఈ ఆలోచనలు వారిలోని ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయి. క్యాన్సర్ బారిన పడి, కీమో థెరపీ చేయించుకున్న ఓ ప్రభుత్వ స్కూల్లో చదువుకునే అమ్మాయిని చూసినప్పుడు ఇలాగే బాధనిపించింది. అలాంటి పిల్లలు పడే బాధను తొలగించి, వారిలో ఆత్మ విశ్వాసం పెరిగేందుకు ఏం చేయచ్చు అనిపించినప్పుడు ఈ ఆలోచన వచ్చింది’’ అని చెప్పారు ఈ పోలీస్ అధికారిణి. అనుష్కా శర్మ : ‘అపర్ణ చేసిన పని సాధారణమైనదేమీ కాదు. అమెకు నా అభినందనలు’ అపర్ణకు ఇద్దరు కుమార్తెలు.ఎంఎస్సీ చదువుతున్న దేవిక, పదోతరగతి చదువుతున్న గౌరీ కూడా రెండేళ్ల క్రితం తల్లిలాగే విగ్గుల కోసం తమ పొడవైన కురులను దానం చేశారు. అపర్ణ బంధువు, తోటి మహిళా పోలీసు అధికారి కూడా ఆమె ధైర్యమైన చర్యతో ప్రేరణ పొంది తమ శిరోజాలను దానం చేశారు. బాలీవుడ్ నటి అనుష్కా శర్మ అపర్ణ పెద్దమనసుకు ప్రశంసలు కురిపించారు. వెల్లువలా వచ్చి పడుతున్న అభినందనలపై అపర్ణ స్పందిస్తూ.. తాను చేసింది పెద్ద ఘన కార్యమేమీ కాదని.. వెంట్రుకలు కత్తిరించుకుంటే ఏడాదికో, రెండేళ్లకో పెరుగుతాయని, నిజమైన త్యాగం అవయయ దానం చేసే వారిదేనని అన్నారు. – ఆరెన్నార్ -
పోలీసులంటే అందరికీ భయం..అందుకే
కేరళకు చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ అపర్ణ లవకుమార్ (46) సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్త్రీలకు సహజంగా ఉండే కేశ సౌందర్యాభిలాష గురించి ఏమాత్రం పట్టించుకోకుండా..ఔదార్యాన్ని ప్రదర్శించారు. ఇటువంటి చర్యలతో, పోలీసులు ప్రజల మధ్య అంతరం తగ్గుతుందని నమ్ముతున్నానని ఆమె చెప్పారు. సాధారణంగా పోలీసులంటే ప్రజలకు మంచి అభిప్రాయం ఉండదు. భయపడిపోతారు. కానీ మానవతా దృక్పథంతో దీన్ని మార్చాలనుకుంటున్నానని ఆమె చెప్పడం గమనార్హం. న్యూస్ మినిట్ అందించిన కథనం ప్రకారం అపర్ణ క్యాన్సర్ రోగి కోసం తన పొడవాటి జుట్టును త్యాగం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కృషి చేయాల్సి వచ్చింది. తన సీనియర్ అధికారులనుంచి ప్రత్యేక అనుమతి పొంది మరీ గుండు కొట్టించుకుని, పలువురి ప్రశంసలకు పాత్రలయ్యారు త్రిశూర్‌లోని ఇరింజలకుడలోని మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేసే ఇద్దరు బిడ్డల తల్లి క్యాన్సర్ బారిన పడినపుడు ఆమె తొలిసారి తన జుట్టును దానం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే క్యాన్సర్ అవేర్నెస్ డ్రైవ్‌లో భాగంగా స్థానిక పాఠశాలలో ఓ చిన్నారి (10) కలిసిన తరువాత తన నిర్ణయాన్ని మరింత దృఢపర్చుకున్నారు. క్యాన్సర్ రోగులకు విగ్స్ తయారు చేయడానికి తన పొడవాటి జుట్టును దానం చేశారు. కీమోథెరపీ తర్వాత జుట్టును పోగొట్టుకున్న బాధితుకు మద్దతుగా తన వంతు సాయం చేశానని అపర్ణ చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే అపర్ణ ఇంతకుముందు కూడా తన జుట్టును దానం చేశారు. అయితే అపుడు భుజాలవరకు మాత్రమే జుట్టును కత్తిరించుకున్నారు. కానీ ఈ సారి మాత్రం మొత్తం జుట్టును దానం చేయడం విశేషం. ముఖ్యంగా పిల్లలు క్యాన్సర్ బారిన పడినపుడు.. కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోతే, వారి పరిస్థితి మరీ బాధాకరం. తోటిపిల్లల వింతగా చూడటం, అవహేళన చేయడం వారి బాధను మరింత పెంచుతుంది. అందుకే మానసికంగా కృంగిపోయిన అలాంటి చిన్నారులకు సాయం చేయాలన్నదే తప్ప అందం గురించి తానెపుడూ పట్టించుకోలేదని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ఆమెకు కటింగ్ చేసిన పార్లర్ ఓనర్ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. 2008 లో, ఆసుపత్రి బిల్లు కట్టలేని బాధితునికి, అపర్ణ తన బంగారు గాజులను విరాళంగా ఇచ్చారట. అపర్ణ నిర్ణయంతో ఉన్నతాధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. కేరళ పోలీసు మాన్యువల్‌లో యూనిఫామ్‌కు సంబంధించి,ఇతర కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే మహిళలు మొత్తం గుండు చేయించు కోకూడదు. కానీ ఒక గొప్ప విషయంకోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆమె జుట్టును దానం చేయడానికి అనుమతినిచ్చినట్టు త్రిస్సూర్ పోలీసు చీఫ్ విజయకుమార్ చెప్పారు. అంతేకాదు ఒక పోలీసు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారని, ఇది నిజంగా ప్రశంసనీయమని ఆయన అభినందించారు. -
అందంతో పాటు మంచి మనసున్న నటి
హైదరాబాద్: అందమైన హీరోయిన్ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి అని టాలీవుడ్ ముద్దుగుమ్మ ఛార్మి నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆమె షార్ట్ హెయిర్ తో వెరీ క్యూట్ గా కనిపిస్తున్నారు. దీనివెనక ఓ మంచిపని దాగుంది. సాధారణంగా ఆడవాళ్లు తమ కేశాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే! అయితే క్యాన్సర్ తో బాధపడుతున్న బాధితులకు సహాయం చేయాలని ఛార్మింగ్ హీరోయిన్ ఛార్మి భావించారు. క్యాన్సర్ బాధితులకు విగ్గులు తయారు చేసే సంస్థకు తన కేశాలు అందించారు. బేబీ కటింగ్ చేయించుకుని ఆ కత్తెర పడ్డ వెంట్రుకలను కొందరు మహిళలకు తయారుచేసే విగ్గుల కోసం వినియోగించనున్నారు. క్యాన్సర్ బారిన పడ్డ వారికి చేసే కీమోథెరపి చికిత్సలో భాగంగా వారు తమ కేశాలను కోల్పోయి ఎంతో ఆందోళన చెందుతుంటారు. వారికి తనవంతు సహాయంగా కొంత మేరకు జుట్టును ఛార్మి అందించారు. ఈ విషయం తెలిసిన చాలా మంది అభిమానులు ఛార్మి అందంతోనే కాదు మంచి మనసుతోనూ ఆకట్టుకుంటుందని అభినందిస్తున్నారు. కాగా, గతంలో నటి రేణు దేశాయ్ ఇదే తరహాలో క్యాన్సర్ బాధిత మహిళల కోసం తన కేశాలను అందించి సహాయం చేసిన విషయం తెలిసిందే. ఇలాగే మరి కొంతమంది హీరోయిన్లు ముందుకొస్తే ఎంతో కొంత మార్పు అనేది సాధ్యమవుతుందని చెప్పవచ్చు.