కేరళకు చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ అపర్ణ లవకుమార్ (46) సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్త్రీలకు సహజంగా ఉండే కేశ సౌందర్యాభిలాష గురించి ఏమాత్రం పట్టించుకోకుండా..ఔదార్యాన్ని ప్రదర్శించారు. ఇటువంటి చర్యలతో, పోలీసులు ప్రజల మధ్య అంతరం తగ్గుతుందని నమ్ముతున్నానని ఆమె చెప్పారు. సాధారణంగా పోలీసులంటే ప్రజలకు మంచి అభిప్రాయం ఉండదు. భయపడిపోతారు. కానీ మానవతా దృక్పథంతో దీన్ని మార్చాలనుకుంటున్నానని ఆమె చెప్పడం గమనార్హం.
న్యూస్ మినిట్ అందించిన కథనం ప్రకారం అపర్ణ క్యాన్సర్ రోగి కోసం తన పొడవాటి జుట్టును త్యాగం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కృషి చేయాల్సి వచ్చింది. తన సీనియర్ అధికారులనుంచి ప్రత్యేక అనుమతి పొంది మరీ గుండు కొట్టించుకుని, పలువురి ప్రశంసలకు పాత్రలయ్యారు త్రిశూర్‌లోని ఇరింజలకుడలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఇద్దరు బిడ్డల తల్లి క్యాన్సర్ బారిన పడినపుడు ఆమె తొలిసారి తన జుట్టును దానం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే క్యాన్సర్ అవేర్‌నెస్ డ్రైవ్‌లో భాగంగా స్థానిక పాఠశాలలో ఓ చిన్నారి (10) కలిసిన తరువాత తన నిర్ణయాన్ని మరింత దృఢపర్చుకున్నారు. క్యాన్సర్ రోగులకు విగ్స్ తయారు చేయడానికి తన పొడవాటి జుట్టును దానం చేశారు. కీమోథెరపీ తర్వాత జుట్టును పోగొట్టుకున్న బాధితుకు మద్దతుగా తన వంతు సాయం చేశానని అపర్ణ చెప్పారు.
ఇంకో విషయం ఏమిటంటే అపర్ణ ఇంతకుముందు కూడా తన జుట్టును దానం చేశారు. అయితే అపుడు భుజాలవరకు మాత్రమే జుట్టును కత్తిరించుకున్నారు. కానీ ఈ సారి మాత్రం మొత్తం జుట్టును దానం చేయడం విశేషం. ముఖ్యంగా పిల్లలు క్యాన్సర్ బారిన పడినపుడు.. కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోతే, వారి పరిస్థితి మరీ బాధాకరం. తోటిపిల్లల వింతగా చూడటం, అవహేళన చేయడం వారి బాధను మరింత పెంచుతుంది. అందుకే మానసికంగా కృంగిపోయిన అలాంటి చిన్నారులకు సాయం చేయాలన్నదే తప్ప అందం గురించి తానెపుడూ పట్టించుకోలేదని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ఆమెకు కటింగ్ చేసిన పార్లర్ ఓనర్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. 2008 లో, ఆసుపత్రి బిల్లు కట్టలేని బాధితునికి, అపర్ణ తన బంగారు గాజులను విరాళంగా ఇచ్చారట.
అపర్ణ నిర్ణయంతో ఉన్నతాధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. కేరళ పోలీసు మాన్యువల్‌లో యూనిఫామ్‌కు సంబంధించి,ఇతర కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే మహిళలు మొత్తం గుండు చేయించు కోకూడదు. కానీ ఒక గొప్ప విషయంకోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆమె జుట్టును దానం చేయడానికి అనుమతినిచ్చినట్టు త్రిస్సూర్ పోలీసు చీఫ్ విజయకుమార్ చెప్పారు. అంతేకాదు ఒక పోలీసు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారని, ఇది నిజంగా ప్రశంసనీయమని ఆయన అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment