handicapped Persons
-
TS Election 2023: ఈ ఎన్నికలకు ఎంతో ప్రత్యేకత! ఈవీఎంలపై అభ్యర్థి ఫొటో..
నల్గొండ: ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటో తెలుసుకుందా. దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు.. దివ్యాంగులు వంద శాతం ఓటు వినియోగించుకునేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. పోలింగ్ రోజు సిబ్బంది ఇంటికే వచ్చి ఆటో, జీపు, ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రానికి తరలించనున్నారు. ఓటు వినియోగం అనంతరం వారిని అదే వాహనంలో ఇంటి దగ్గర దిగబెడతారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేశారు. ట్రైసైకిళ్లు అందుబాటులో ఉంచనున్నారు. ఈవీఎంలపై అభ్యర్థి ఫొటో.. ఒక నియోజకవర్గంలో ఒకే పేరు గల ఇద్దరు వ్యక్తులు పోటీ చేసినప్పుడు ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఈసారి ఈవీఎంలపై అభ్యర్థి ఫొటో పెడుతున్నారు. ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులను కొందరు ఓటర్లు గుర్తు పట్టలేకపోవచ్చు. కానీ అభ్యర్థి సుపరిచితుడు కావడంతో వెంటనే గుర్తుపట్టే అవకాశం ఉంటుందని.. ఈవీఎంలలో అభ్యర్థి పేరు, ఫొటో, గుర్తులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ‘సోషల్’ ఖాతాల వివరాలు చెప్పాల్సిందే.. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాపై సైతం ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ సోషల్ ఖాతాలను కచ్చితంగా వెల్లడించాలని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులు నామినేషన్ వివరాల్లో ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, సోషల్ మీడియా ఖాతాలు తప్పనిసరిగా వెల్లడించాలని పేర్కొంది. నేర చరిత్ర తెలపాల్సిందే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్రను తప్పకుండా తెలపాలి. క్రిమినల్ కేసులు ఉంటే కచ్చితంగా ఈసీకి ప్రత్యేక ఫార్మాట్లో వెల్లడించాల్సి ఉంటుంది. తమ నామినేషన్ పత్రాలతోపాటు నేర చరిత్ర వివరాలను జత చేయాల్సి ఉంటుంది. కేసుల వివరాలను నామినేషన్ పత్రం పార్ట్–3ఏలో తప్పనిసరిగా పేర్కొనాలి. కేసు ఎప్పుడు ముగిసింది. దానికి సంబంధించిన రికార్డులు, కేసు నంబర్ లాంటి వివరాలు తెలపాలి. పోలింగ్‌కు ముందే మూడు సార్లు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో నేర చరిత్ర వివరాలను ప్రకటనల రూపంలో వెల్లడించాలి. ఒకవేళ నేరచరిత్ర తెలపకపోతే నామినేషన్‌ను తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని ప్రత్యేకతలు.. అంధులకు బ్రెయిలీ లిపిలో ఉన్న ఓటరు గుర్తింపు కార్డులను అందించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా ఈవీఎంలపై బ్రెయిలీ చెక్కబడింది. ఎన్నికల సభలు, ప్రచార అనుమతులు పొందేందుకు ఎన్నికల సంఘం ‘సువిధ’ అప్లికేషన్‌ను రూపొందించింది. ఈ యాప్‌తో ఎన్నికలకు సంబంధించిన అనుమతులు సులభంగా పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో ఎన్నికల సంఘం నుంచి అనుమతులు వస్తాయి. -
ప్రతి దివ్యాంగుడికి విశిష్ట గుర్తింపుకార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రతి దివ్యాంగుడికి విశిష్ట వికలత్వ ధ్రువీకరణకార్డును కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి పౌరుడికి ఆధార్‌కార్డు ఇస్తున్నట్లుగా దేశంలోని దివ్యాంగులకు యూనిక్ డిజెబులిటీ ఐడీ(యూడీఐ) జారీచేస్తోంది. ఈ కార్డుల జారీ నేపథ్యంలో రాష్ట్రంలోని వికలాంగులకు ప్రకత్యేక పరీక్షలు లేకుండా సదరం(వికలత్వ ధ్రువీకరణ) సర్టిఫికెట్లతో వీటిని అనుసంధానం చేయాలని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే సదరం సర్టిఫికెట్లు ఉన్న వారందరికీ స్వయంచాలిక(ఆటోమెటిక్) పద్ధతిలో వీటిని జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సదరం సర్వర్‌ను కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌కు అనుసంధానం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర వికలాంగుల సంక్షేమశాఖ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్ల పథకం కోసం సదరం సర్టిఫికెట్లను జారీచేస్తోంది. ఈ ధ్రువీకరణపత్రం ఆధారంగానే పింఛన్లు జారీచేస్తున్నారు. కనీసం 50 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,98,656 మంది సదరం సర్టిఫికెట్లు తీసుకున్నట్లు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఏడాది చివరికల్లా నూరు శాతం కార్డులు జారీ యాభై శాతం కంటే తక్కువ వికలత్వం ఉన్నవారికి ఈ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో చాలామంది దివ్యాంగులు ఈ జాబితాలోకి రాలేదని దివ్యాంగుల సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సదరం సర్టిఫికెట్లు పొందిన ప్రతిఒక్కరికీ యూడీఐ కార్డులు జారీ చేయనున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ చెబుతోంది. ఇప్పటికే పలువురికి కార్డులు జారీ చేయగా, ఈ ఏడాది చివరికల్లా నూరు శాతం కార్డులు జారీ చేసేలా ఆ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ చేస్తున్న యూడీఐ కార్డులను దేశంలో ఎక్కడైనా గుర్తింపుకార్డు కింద పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ కార్డుకు ఆధార్ నంబర్‌ను కూడా అనుసంధానం చేయనున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. కేంద్రం అమలు చేసే పథకాలకు ఈ కార్డులే ప్రామాణికం కానున్నాయి. -
అప్పన్న చందనోత్సవంలో దివ్యాంగులకు ఇబ్బందులు
-
దివ్యాంగులకు ప్రత్యేక బోగీలు
నాగ్‌పూర్: దివ్యాంగుల ప్రయాణ సౌకర్యార్థం రైల్వే శాఖ 2018 నాటికి 3 వేల ప్రత్యేక బోగీలను తయారుచేయనుంది. వీటిలో దివ్యాంగుల ప్రయాణం సజావుగా సాగేలా పలు వసతులను కల్పించనున్నట్లు దివ్యాంగుల విభాగం ముఖ్య కమిషనర్ కమలేశ్ పాండే చెప్పారు. నాగ్‌పూర్ జిల్లాలో దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన పథకాల సమీక్ష సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక బోగీలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారని, వీటిలో ఎక్కువ సీట్లు, అధిక స్థలంతో పాటు వీటిని గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక చిహ్నాలను అమరుస్తామని తెలిపారు. ముంబై, నాసిక్, నాగ్‌పూర్‌లోని సుమారు180 ప్రభుత్వ భవనాలను దివ్యాంగులకు అనుకూలంగా మార్చేందుకు వాటిలో ర్యాంపులు, లిఫ్టులు లాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. -
వికలాంగులకు కృత్రిమ పరికరాలు
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జిల్లాలోని వికలాంగులకు ఉచితంగా కృత్రిమ పరికరాలు అందజేయడానికి లయన్స్‌క్లబ్ ముందుకొచ్చింది. బుధవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో వికలాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. జిల్లాల నలుమూలల నుంచి 500 మంది వికలాంగులు వచ్చారు. 250 మందిని పరీక్షించి పరికరాలకు ఎంపిక చేశారు. లయన్స్‌క్లబ్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ చౌదరి మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ లింబ్స్ మ్యాను ఫ్యాక్టరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వికలాంగులు, అంధులు, చెవిటి వారికి ఉచితంగా పరికరాలు అందజేస్తామని అన్నారు. కృత్రిమ అవయవాలు, సహాయపరికరాలు, క్రచ్‌లు, మూడు చక్రాల సైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి పరికరాలు, బ్రెయిల్కేన్, ఎంఎస్ఈడీ కిట్లు ఎంపికైన 250 మంది వికలాంగులకు 45 రోజుల్లో అందిస్తామని అన్నారు. రిమ్స్ డెరైక్టర్ శశిధర్, లయన్స్‌క్లబ్ రీజినల్ చైర్పర్సన్ వెంకటేశ్వర్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పోగ్రాం చైర్మన్ డాక్టర్ యండి.సమీయొద్దీన్, సభ్యులు పాల్గొన్నారు.