నల్గొండ: ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటో తెలుసుకుందా.
దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు..
దివ్యాంగులు వంద శాతం ఓటు వినియోగించుకునేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. పోలింగ్ రోజు సిబ్బంది ఇంటికే వచ్చి ఆటో, జీపు, ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రానికి తరలించనున్నారు. ఓటు వినియోగం అనంతరం వారిని అదే వాహనంలో ఇంటి దగ్గర దిగబెడతారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేశారు. ట్రైసైకిళ్లు అందుబాటులో ఉంచనున్నారు.
ఈవీఎంలపై అభ్యర్థి ఫొటో..
ఒక నియోజకవర్గంలో ఒకే పేరు గల ఇద్దరు వ్యక్తులు పోటీ చేసినప్పుడు ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఈసారి ఈవీఎంలపై అభ్యర్థి ఫొటో పెడుతున్నారు. ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులను కొందరు ఓటర్లు గుర్తు పట్టలేకపోవచ్చు. కానీ అభ్యర్థి సుపరిచితుడు కావడంతో వెంటనే గుర్తుపట్టే అవకాశం ఉంటుందని.. ఈవీఎంలలో అభ్యర్థి పేరు, ఫొటో, గుర్తులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
‘సోషల్’ ఖాతాల వివరాలు చెప్పాల్సిందే..
ఎన్నికల సమయంలో సోషల్ మీడియాపై సైతం ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ సోషల్ ఖాతాలను కచ్చితంగా వెల్లడించాలని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులు నామినేషన్ వివరాల్లో ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, సోషల్ మీడియా ఖాతాలు తప్పనిసరిగా వెల్లడించాలని పేర్కొంది.
నేర చరిత్ర తెలపాల్సిందే..
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్రను తప్పకుండా తెలపాలి. క్రిమినల్ కేసులు ఉంటే కచ్చితంగా ఈసీకి ప్రత్యేక ఫార్మాట్‌లో వెల్లడించాల్సి ఉంటుంది. తమ నామినేషన్ పత్రాలతోపాటు నేర చరిత్ర వివరాలను జత చేయాల్సి ఉంటుంది.
కేసుల వివరాలను నామినేషన్ పత్రం పార్ట్–3ఏలో తప్పనిసరిగా పేర్కొనాలి. కేసు ఎప్పుడు ముగిసింది. దానికి సంబంధించిన రికార్డులు, కేసు నంబర్ లాంటి వివరాలు తెలపాలి. పోలింగ్‌కు ముందే మూడు సార్లు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో నేర చరిత్ర వివరాలను ప్రకటనల రూపంలో వెల్లడించాలి. ఒకవేళ నేరచరిత్ర తెలపకపోతే నామినేషన్‌ను తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి.
మరికొన్ని ప్రత్యేకతలు..
అంధులకు బ్రెయిలీ లిపిలో ఉన్న ఓటరు గుర్తింపు కార్డులను అందించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా ఈవీఎంలపై బ్రెయిలీ చెక్కబడింది. ఎన్నికల సభలు, ప్రచార అనుమతులు పొందేందుకు ఎన్నికల సంఘం ‘సువిధ’ అప్లికేషన్‌ను రూపొందించింది. ఈ యాప్‌తో ఎన్నికలకు సంబంధించిన అనుమతులు సులభంగా పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో ఎన్నికల సంఘం నుంచి అనుమతులు వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment