నల్గొండ: మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఓ మహిళపై నోరు పారేసుకున్నారు. వివరాలు.. వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే భాస్కర్‌రావును గ్రామానికి చెందిన వనం విజయలక్ష్మి తనకు అన్ని అర్హతలు ఉన్నా గృహలక్ష్మి పథకంలో తన పేరును ఎందుకు తొలగించారంటూ అడిగింది.
దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఆమెను పరుష పదజాలంతో దూషిస్తూ.. ‘నీకు ఇల్లు పెట్టనుపో.. ఏం చేసుకుంటావో చేసుకో.. దానిని బయటికి నెట్టేయండి’ అంటూ పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు సదరు మహిళను బయటకు తీసుకెళ్తుండగా ఆమె ఎమ్మెల్యేను తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరికీ గృహలక్ష్మి పథకంలో ఇల్లు అందుతుందని, విజయలక్ష్మి అర్హురాలు అయితే తానే స్వయంగా ఆమెకు పథకం అందేలా చూస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీలో అర్హులకు కాకుండా బీఆర్‌ఎస్ కార్యకర్తల పేర్లే జాబితాలో పొందుపరిచారంటూ సల్కునూరు గ్రామానికి చెందిన యాదవులు నిరసన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేపై ఫిర్యాదు తీసుకోవడం లేదంటూ నిరసన..
కాగా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడానికి సాయంత్రం వేములపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు తన ఫిర్యాదును స్వీకరించలేదని బాధిత మహిళ వనం విజయ ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ నాయకులతో ఆమె పోలీస్ స్టేషన్‌లోనే బైఠాయించింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కనపర్తి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు.
మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించడం తదగన్నారు. ఇదే విషయమై స్థానిక ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఆమె ఇచ్చిన ఫిర్యాదును తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. నిరసన తెలిపిన వారిలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రతన్‌సింగ్‌నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర సాంబమూర్తి, పెదమాం వెంకన్న, చలమల్ల సీతారాంరెడ్డి, పందిరి భాగ్యమ్మ, జవ్వాజి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment