Hardy Pandya
-
హార్దిక్ పాండ్యా ఫిట్
ముంబై: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ ఫిట్నెస్ అందుకున్నాడు. న్యూజిలాండ్ పర్యటననుంచి తిరిగొచ్చిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో టి20, వన్డే సిరీస్‌లకు దూరమైన అతను వెన్ను గాయంనుంచి కోలుకొని ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నాడు. గురువారం అతను ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. మరో వైపు కోల్‌కతా నైట్ రైడర్స్ పేస్ బౌలర్ కమలేశ్ నాగర్కోటి వరుసగా రెండో ఏడాది గాయం కారణంగా ఐపీఎల్ మొత్తం సీజన్‌కు దూరం కానున్నాడు. 2018లో కూడా కమలేశ్ గాయంతో చివరి నిమిషంలో ఐపీఎల్‌నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతని స్థానంలో కోల్‌కతా కేరళ పేసర్ సందీప్ వారియర్‌ను తీసుకుంది. ఈ ఏడాది రంజీల్లో 44 వికెట్లు తీసి కేరళ విజయాల్లో కీలక పాత్ర పోషించిన వారియర్... 2013–15 మధ్య ఐపీఎల్లో ఆర్సీబీ జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. -
హార్దిక్ పాండ్యా ఔట్
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్‌నకు వంద రోజుల సమయం కూడా లేని నేపథ్యంలో టీమిండియాకు అనుకోని దెబ్బ. పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఆస్ట్రేలియాతో టి20, వన్డే సిరీస్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న పాండ్యాను వైద్యుల బృందం సూచన మేరకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు పంపుతున్నట్లు బీసీసీఐ గురువారం తెలిపింది. వచ్చే వారం అతడికి ఎన్సీఏలో ప్రత్యేక చికిత్స ఉంటుంది. ఆసీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు పాండ్యా స్థానాన్ని స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో భర్తీ చేయనున్నారు. టి20 జట్టులో మాత్రం పాండ్యా స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. స్పిన్నర్లే కీలకం సాక్షి, హైదరాబాద్: రానున్న వన్డే సిరీస్‌లో స్పిన్నర్లే గెలుపోటములను నిర్దేశిస్తారని ఆస్ట్రేలియా స్పిన్ కన్సల్టెంట్ శ్రీధరన్ శ్రీరామ్ అన్నా డు. గురువారం హైదరాబాద్‌లో ఆస్ట్రేలియా ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. భారత్‌కు తగ్గట్లు తమకూ స్పిన్ బలం ఉన్న నేపథ్యంలో సిరీస్ హోరాహోరీగా జరుగనుందని శ్రీరామ్ పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్న భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై అతడు ప్రశంసలు కురిపించాడు. ప్రధాన పేసర్లు లేకున్నా కమిన్స్, కూల్టర్‌నైల్ రూపంలో ఆసీస్‌కు మెరుగైన వనరులున్నాయని అతడు అన్నాడు. భారత కెప్టెన్ కోహ్లిని అడ్డుకోవడానికి తమవద్ద ప్రణాళికలు ఉన్నాయని శ్రీరామ్ వివరించాడు. -
సస్పెన్షన్ ఎత్తివేత
న్యూఢిల్లీ: టీవీ షోలో మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలపై విధించిన నిరవధిక నిషేధాన్ని క్రికెట్ పరిపాలక కమిటీ (సీవోఏ) గురువారం ఎత్తివేసింది. దీంతో వీరిద్దరు మళ్లీ క్రికెట్ మైదానంలోకి దిగే అవకాశం లభించింది. నిషేధం తొలగించడంతో హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్ వెళ్లి జట్టుతో కలుస్తాడని... రాహుల్ భారత ‘ఎ’జట్టు తరఫున బరిలోకి దిగుతాడని బీసీసీఐ ప్రకటించింది. ‘కోర్టు సహాయకుడి (అమికస్ క్యూరీ)గా నియమితులైన పీఎస్ నర్సింహ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నాం. దీని ప్రకారం ఇద్దరు క్రికెటర్లపై నిషేధం విధిస్తూ ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేస్తున్నాం. సుప్రీం కోర్టు అంబుడ్స్‌మన్‌ను నియమించిన తర్వాత వీరిద్దరిపై విచారణ కొనసాగుతుంది’ అని సీవోఏ తరఫున బీసీసీఐ అధికారి ఒకరు ప్రకటించారు. రెండు వారాల ఉత్కంఠకు తెర... మహిళలతో సంబంధాలపై టీవీ షోలో సరదాగా మాట్లాడే క్రమంలో మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో రాహుల్, పాండ్యాలను ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఈ నెల మొదట్లో అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించారు. తొలుత సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ రెండు మ్యాచ్‌ల నిషేధంతో సరిపెట్టాలని భావించినా, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టారు. దీంతో ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ ముందు యువ క్రికెటర్ల కెరీర్ సందిగ్ధంలో పడింది. అయితే, సీవోఏ అతిగా స్పందించి తీవ్ర చర్యలు తీసుకుందని విమర్శలు వచ్చాయి. దిగ్గజ ఆటగాళ్లు గంగూలీ, ద్రవిడ్ సైతం కుర్రాళ్లు తప్పులు తెలుసుకుని ముందుకుసాగే అవకాశం ఇవ్వాలని సూచించారు. ఇదే సమయంలో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సైతం విచారణ కొనసాగిస్తూనే రాహుల్, పాండ్యాలపై నిషేధాన్ని తొలగించాలని కోరారు. మొత్తానికి కోర్టు సహాయకుడి బాధ్యతల స్వీకారంతో కథ సుఖాంతమైంది. దీనిపై ఖన్నా మాట్లాడుతూ..‘రాహుల్, పాండ్యా ఇప్పటికే తగినంత శిక్ష అనుభవించారు. ఈ పరిణామంతో పరిణతి చెందుతారు. ఇకపై ప్రపంచకప్ సన్నాహం మీద దృష్టిపెడతారు. అక్కడ హార్దిక్ కీలకం కానున్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కోర్టు కేసు ఎదుర్కొంటూ కూడా దేశానికి ఆడుతున్నాడు. దీనినే మన క్రికెటర్లకు ఎందుకు వర్తింపచేయకూడదు.’ అని పేర్కొన్నారు. -
త్రిశంకు స్వర్గంలో...
న్యూఢిల్లీ: టీవీ షోలో సరదాగా మాట్లాడే ప్రయత్నంలో నోరు జారడం ఎంత తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఊహించలేకపోయారు. నిషేధం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన వీరిద్దరు మళ్లీ ఎప్పుడు క్రికెట్లో అడుగు పెడతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్‌మన్‌కే ఉంది. ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్‌మన్‌కే ఇవ్వాలి. అయితే ఇప్పటికిప్పుడు అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. లోధా కమిటీ సిఫారసుల అమలు, బీసీసీఐ ఎన్నికలు తదితర అంశాలతో పాటు పాండ్యా–రాహుల్‌ల అంశంపై కూడా సుప్రీం కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) తరఫు న్యాయవాదులు పరాగ్ త్రిపాఠి, సీయూ సింగ్ దీనికి హాజరయ్యారు. బోర్డులో పలు సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే అంబుడ్స్‌మన్‌ను నియమించాల్సిందిగా వారు కోరారు. అయితే బీసీసీఐ గుర్తింపు ఉన్న ప్రభుత్వ సంస్థల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మాత్రం అంబుడ్స్‌మన్‌ను నియమించే అధికారం కేవలం బోర్డుకే ఉందని...అది ఎన్నికలు నిర్వహించి కార్యవర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే సాధ్యమని వాదించారు. అనంతరం జస్టిస్ ఎస్ఏ బోబ్డె, ఏఎం సప్రే సభ్యులుగా గల ద్విసభ్య బెంచ్ మొత్తం కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అసలు దీనిపై వాదనలు కూడా కనీసం వారం రోజుల తర్వాత, అమికస్ క్యూరీ (కోర్టు సహాయకారి) బాధ్యతలు స్వీకరించిన తర్వాతే వింటామని తేల్చి చెప్పింది. ఇటీవలే గోపాల సుబ్రమణ్యం రాజీనామా చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి పీఎస్ నర్సింహను అమికస్ క్యూరీగా ఎంపిక చేసింది. అయితే ఆయన ఎప్పుడు బాధ్యతలు చేపడతారో తెలీదు. ఆయన లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని సుప్రీం స్పష్టం చేసింది. వాదనల తర్వాత తేదీ ఏమిటో కూడా కోర్టు ప్రకటించలేదు. దాంతో క్రికెటర్ల భవిష్యత్తు గందరగోళంలో పడింది. ‘నిజానికి వినోద్ రాయ్ సూచన మేరకు 2 మ్యాచ్‌ల నిషేధంతో పని అయిపోయేది. కానీ దానికి ఒప్పుకోని డయానా ఎడుల్జీ లీగల్ టీమ్ సూచన అడగడం, వారు అంబుడ్స్‌మన్ తప్పనిసరి అని చెప్పడంతో విషయం కోర్టు దాకా వెళ్లిపోయింది. ఇప్పుడు ఎవరూ ఏమీ చేయడానికి లేదు. క్రికెటర్ల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు’ అని బీసీసీఐ సీనియర్ సభ్యుడొకరు అభిప్రాయ పడ్డారు. తప్పులు మానవసహజం! ముంబై: హార్దిక్, రాహుల్‌ల వివాదంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పరోక్షంగా స్పందించాడు. నేరుగా వారి పేర్లు చెప్పకపోయినా తప్పులు చేయడం మానవ సహజమని, ఇక దానిని వదిలేయాలని అభిప్రాయ పడ్డాడు. ‘నేను టీవీ షో చూడలేదు. అయితే అందరూ తప్పులు చేస్తారు. వాటి గురించి ఇంకా అతి అనవసరం. తప్పు చేసినవారు దానిని తెలుసుకొని సరిదిద్దుకుంటారని భావిస్తున్నా. అన్నీ పక్కాగా ఉండటానికి మనం యంత్రాలం కాదు మనుషులం. గతం వదిలి మళ్లీ అలాంటి తప్పు జరగకుండా మాత్రమే చూసుకోవాలి. ఎవరో ఒకరిద్దరు తప్ప నిజానికి క్రికెటర్లంతా మంచివాళ్లే. మధ్యతరగతినుంచి వచ్చి జీవితంలో ఎదిగేందుకు ఎంతో శ్రమిస్తారు కాబట్టి మంచితనం వచ్చేస్తుంది. కోట్లాది మందినుంచి 11 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక కావడం మామూలు విషయం కాదు’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. 14 ఏళ్ల కుర్రాడిపై వేటు! లైంగికపరమైన ఆరోపణలు ఎదుర్కొన్న తమ ఆటగాడిపై ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) చర్య తీసుకుంది. ముంబై అండర్–16 జట్టు కెప్టెన్, 14 ఏళ్ల ముషీర్ ఖాన్‌పై మూడేళ్ల నిషేధం విధించింది. డిసెంబర్లో జాతీయ అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా కడపలో ముంబై–యూపీ మధ్య క్వార్టర్ ఫైనల్ జరిగిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అద్భుత ప్రతిభాపాటవాలు కలిగి భవిష్యత్తులో స్టార్ కాగలడని ముంబై క్రికెట్ వర్గాల్లో ముషీర్‌పై అంచనాలు ఉన్నాయి. స్కూల్నుంచి లీగ్ క్రికెట్ వరకు అన్ని దశల్లో పరుగుల వరద పారించడంతో త్వరలోనే అతను అండర్–19 టీమ్‌కు ఎంపికయ్యే అవకాశాలు కనిపించాయి. మరో యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్‌కు ముషీర్ సొంత తమ్ముడు కావడం విశేషం. -
మమ్మల్ని మన్నించండి!
న్యూఢిల్లీ: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తమకు కొత్తగా జారీ చేసిన రెండో షోకాజ్ నోటీసులకు బదులిస్తూ తమను మన్నించాలని వీరిద్దరు విజ్ఞప్తి చేశారు. అయితే సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ ఆదేశాలను అనుసరించి బోర్డు నిబంధన 41 (సి) ప్రకారం వీరిద్దరిపై సీఈఓ రాహుల్ జోహ్రి విచారణ కొనసాగిస్తారు. అయితే ఇటీవలే అమ్మాయిలను వేధించిన ఆరోపణలు ఎదుర్కొన్న జోహ్రితోనే విచారణ జరిపించడంపై సీఓఏ మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే విచారణ ‘కంటితుడుపు’గానే భావించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. దీనిపై వినోద్ రాయ్ వివరణ ఇస్తూ...ఎడుల్జీకి లేఖ రాశారు. ‘పాండ్యా, రాహుల్‌ను సరిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది. వారి కెరీర్‌ను నాశనం చేయాలనుకోవడం లేదు. బోర్డు నియమావళి ప్రకారమే సీఈఓ విచారణ చేస్తున్నారు తప్ప అది కంటితుడుపు కాదు’ అని రాయ్ స్పష్టం చేశారు. -
విచారణ వేగవంతం... అంత తొందరేలా!
న్యూఢిల్లీ: క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కె.ఎల్ రాహుల్‌లపై విచారణ విషయంలో బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ)లో భేదాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ టీమిండియా జట్టు కూర్పు పటిష్టత కోసం క్రికెటర్లపై చేపట్టిన విచారణను వేగవంతం చేయాలని సూచిస్తుంటే... కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం అంత తొందరెందుకని మండిపడుతున్నారు. తూతూమంత్రం విచారణతో ఏదో రకంగా ఈ వివాదాన్ని ముగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఒక టీవీ షోలో క్రికెటర్లిద్దరు మహి ళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెను విమర్శలకు దారితీసింది. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పాండ్యా, రాహుల్‌లపై వేటు వేసింది. ఆ వెంటనే ఇద్దరు క్రికెటర్లు ఆసీస్ నుంచి అర్ధంతరంగా స్వదేశం పయనమయ్యారు. జట్టు బలం ఇప్పుడు 15 సభ్యుల నుంచి 13కు పడిపోవడంతో వెంటనే విచారణ పూర్తిచేసి వారి స్థానాలను భర్తీచేయాలని సీఓఏ చీఫ్ రాయ్ భావిస్తున్నారు. దీన్ని ఎడుల్జీ విభేదించారు. లోగడ బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి ఎదుర్కొన్న లైంగిక వేధింపుల అరోపణలపై ఇలా తొందరపడే త్వరగా ముగించారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు హార్దిక్ పాండ్యా, రాహుల్ స్థానాల్లో మయాంక్ అగర్వాల్, విజయ్ శంకర్లను జట్టులోకి ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు. -
పాండ్యా, రాహుల్‌లపై చర్యలు!
న్యూఢిల్లీ: టీవీ షోలో మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కె.ఎల్.రాహుల్‌లపై రెండు వన్డేల నిషేధం విధించే అవకాశాలున్నాయి. వీరిద్దరి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిపాలక కమిటీ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ 2 మ్యాచ్‌ల నిషేధం విధించాలని బీసీసీఐకి సిఫారసు చేశారు. అయితే మరో సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం వివాదాన్ని బీసీసీఐ లీగల్ సెల్ పరిశీలించాలని సూచించారు. ‘వారి మాటలు ఆమోదయోగ్యం కాదు. క్షమాపణలు కోరుతూ పాండ్యా ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి చెందడం లేదు. దీనిపై శిక్ష తీసుకోవాలని నేను, ఎడుల్జీ గట్టిగా భావిస్తున్నాం. వారిద్దరిపై చర్యలు తీసుకునే విషయంలో ఆమె ఇప్పటికే బోర్డు లీగల్ సెల్‌ను సంప్రదించింది’ అని రాయ్ పేర్కొన్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో పాండ్యా, రాహుల్ ఇద్దరు అశ్లీల రీతిలో మహిళల్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు పెను విమర్శలకు దారితీశాయి. ఇదిలావుండగా... ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్ ఈ శనివారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హార్ధిక్ పాండ్యా, లోకేశ్ రాహుల్ బరిలోకి దిగే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఫిక్సింగ్‌కు దారి తీయవచ్చు! పాండ్యా తరహాలో నోరు అదుపులో పెట్టుకోకుండా ప్రవర్తించేవారిని మ్యాచ్ ఫిక్సర్లు సునాయాసంగా తమ వలలో వేసుకోగలరని బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌదరి అభిప్రాయ పడ్డారు. అమ్మాయిలను ఎరగా చూపించే ‘హనీ ట్రాప్’లో ఇరుక్కుపోతారని ఆయన అన్నారు. పాండ్యా, రాహుల్‌లపై వెంటనే నిషేధం విధించాలని కోరిన అనిరుధ్ అసలు వారిని టీవీ కార్యక్రమానికి ఎవరు అనుమతించారని ప్రశ్నించారు. ‘బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న ఈ ఆటగాళ్లు టీవీ షోకు హాజరయ్యేందుకు అనుమతి తీసుకోనవసరం లేదా. వారు తీసుకుంటే ఎవరు అనుమతి ఇచ్చారు. అనేక సందర్భాల్లో క్రీడా పాత్రికేయులకే ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఆటగాళ్లను దూరం పెడుతుంటారు. అలాంటిది ఒక ఎంటర్టైన్మెంట్ షోకు ఎలా వెళ్లనిచ్చారు’ అని చౌదరి ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు నలుగురు సభ్యుల బీసీసీఐ అంతర్గత ఫిర్యాదుల కమిటీ హెడ్‌గా రాజలక్ష్మి అరోరాను నియమించారు. లైంగిక వేధింపులకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై ఈ కమిటీ విచారిస్తుంది. -
టీవీ ‘షో’లో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు
సిడ్నీ/న్యూఢిల్లీ: టెలివిజన్ ‘షో’లో మహిళల్ని కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, లోకేశ్ రాహుల్‌లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆ నోటీసుల్లో బోర్డు పేర్కొంది. ప్రముఖ షో అయిన ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో వ్యాఖ్యాత కరణ్ జోహార్‌తో కలిసి ఈ ఇద్దరు క్రికెటర్లు పాల్గొన్నారు. ఇది ఇటీవలే ప్రసారమైంది. అందులో 25 ఏళ్ల ఆల్‌రౌండర్ పాండ్యా మాట్లా డుతూ ‘అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు. వాళ్లను అదోటైపుగా చూస్తా. క్లబ్‌లలో వారి ఒంపుసొంపులపై కైపుగా కన్నేస్తా. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే ‘ఆజ్ మై కర్ కే ఆయా’ (నేను ఈ రోజు ...ఆ పని చేసొచ్చా) అని తల్లిదండ్రులతో చెప్పేస్తా’ అని వ్యాఖ్యానించాడు. 18 ఏళ్ల వయసప్పుడే తన ప్యాంట్ జేబులో కండోమ్ లభించడాన్ని వాళ్ల అమ్మ తండ్రి దృష్టికి తీసుకెళ్లిందని, మొదట మందలించినా... తర్వాత ‘పర్లేదు...రక్షణ కవచం వాడావు’ అని తండ్రి తనతో అన్నట్లు షోలో రాహుల్ చెప్పుకొచ్చాడు. కాంట్రాక్టు క్రికెటర్లయి ఉండి ఇలా అశ్లీల రీతిలో విచ్చలవిడితనంతో వ్యాఖ్యానించిన సదరు క్రికెటర్లకు పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ నోటీసులు పంపారు. ఈ నోటీసులు రాగానే పాండ్యా ట్విట్టర్ వేదికగా మహిళలను క్షమాపణలు కోరాడు. ‘ఆ ఊపులో చెప్పేశాను. ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. ఈ వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలి’ అని అన్నాడు. అయితే మరో క్రికెటర్ రాహుల్ మాత్రం ఇంకా స్పందించలేదు. -
నిలిపాడు బ్యాట్‌తో... బంతితో...
తొలుత బ్యాటుతో నిలిచాడు. భీకర పేస్‌ను కాచుకున్నాడు. ప్రత్యర్థి సహనాన్ని పరీక్షించాడు. వీలుచిక్కితే ఎదురుదాడికి దిగాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అనంతరం బంతితోనూ ప్రతాపం చూపాడు. రెండు వికెట్లు తీసి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. కేప్‌టౌన్ టెస్టులో శనివారం హార్దిక్ పాండ్యా ప్రతాపమిది. బ్యాట్స్‌మన్‌గా వీరోచిత పోరాటం చేసి, బౌలర్‌గా సఫారీ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపి రెండో రోజు ఆటనంతా తనచుట్టూనే తిప్పుకొన్నాడీ యువ ఆల్‌రౌండర్. పాండ్యా తెగువతో టీమిండియా తలెత్తుకోగలిగింది. ఇక చేయాల్సింది సమష్టిగా పోరాడి అతడి ఆటకు మరింత విలువ చేకూర్చడమే. కేప్‌టౌన్: ప్రత్యర్థి ధాటికి బెంబేలెత్తి, ఒక దశలో పూర్తిగా తేలిపోతుందనుకున్న భారత్ పర్వాలేదనిపించే ప్రదర్శనతో పరువు దక్కించుకుంది. పేసర్ భువనేశ్వర్ (86 బంతుల్లో 25; 4 ఫోర్లు) అండగా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (95 బంతుల్లో 93; 14 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన ఆట కనబర్చడంతో కేప్‌టౌన్ టెస్టుపై టీమిండియాకు ఆశలు మిగిలాయి. వీరిద్దరి పోరాటం కారణంగా భారత్ 209 పరుగులు చేయగలిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన దక్షిణాఫ్రికాను హార్దిక్ 2 వికెట్లు తీసి దెబ్బతీశాడు. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 65 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆమ్లా (4 బ్యాటింగ్), నైట్‌వాచ్‌మన్ రబడ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా సఫారీ జట్టు 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ప్రత్యర్థిని సాధ్యమైనంత తక్కువకు కట్టడి చేయడంపైనే ఈ మ్యాచ్‌లో భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అతి నిదానంగా... ఓవర్‌నైట్ స్కోరు 28/3తో ఆట ప్రారంభించిన భారత ఇన్నింగ్స్ తొలి సెషన్ అతి నెమ్మదిగా సాగింది. పుజారా (26), రోహిత్ శర్మ (59 బంతుల్లో 11) పరుగులు చేయడం కంటే వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఫిలాండర్ వరుసగా అయి దు ఓవర్లు మెయిడిన్లు వేశాడు. అతడు, రబడ కలిసి రోహిత్‌ను తీవ్రంగా పరీక్షించారు. నిలదొక్కుకునేందుకు గంటపాటు శ్రమించిన రోహిత్ చివరకు రబడకే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ నిర్ణయంపై సమీక్షకు వెళ్లినా ఫలి తం లేకపోయింది. అనంతరం వచ్చిన అశ్విన్ రెండు ఫోర్లు కొట్టి స్కోరును కొంత ముందు కు కదిలించాడు. ఈ సెషన్లో 25 ఓవర్లలో కేవలం 48 పరుగులు మాత్రమే వచ్చాయి. 76/4తో భారత్ లంచ్‌కు వెళ్లింది. అందరూ వెంటవెంటనే... లంచ్ తర్వాతి ఓవర్ తొలి బంతికే భారీ షాక్ తగిలింది. ఫిలాండర్ బౌలింగ్‌లో స్లిప్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పుజారా నిష్క్రమించాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ అంతా అవుటై... 200 పరుగులపైగా వెనుకబడి... ప్రతిదాడి తప్ప మరో అవకాశం లేని ఈ స్థితిలో వచ్చిన పాండ్యా తొలి బంతినే బౌండరీకి తరలించాడు. స్టెయిన్ బౌలింగ్‌లో అంపైర్ అవుటిచ్చినా సమీక్ష కోరి మరీ బయటపడ్డాడు. అయితే కొద్దిసేపటికే ఫిలాండర్ బౌలింగ్‌లో డికాక్ పట్టిన డైవింగ్ క్యాచ్‌కు అశ్విన్ (12) వెనుదిరిగాడు. సాహాను అద్భుత బంతితో స్టెయిన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీనిపై రివ్యూ కోరినా నిరాశే ఎదురైంది. టీ అనంతరం మోర్కెల్... భువీని వెనక్కు పంపి 99 పరుగుల 8వ వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. దీంతో పాండ్యా మరింత దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు రబడ ముగింపు పలికాడు. భారీ షాట్ కొట్టే యత్నంలో టాప్ ఎడ్జ్ తాకిన బంతిని డికాక్ ఒడిసి పట్టాడు. బుమ్రా (2)నూ అతడే అవుట్ చేయడంతో 209 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది. దక్షిణాఫ్రికాకు 77 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌ను సఫారీ ఓపెనర్లు మర్క్రమ్ (43 బంతుల్లో 34; 7 ఫోర్లు), ఎల్గర్ (54 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఆశావహంగా ప్రారంభించారు. నిలకడగా ఆడుతూ 52 పరుగులు జోడించారు. కాసేపట్లో రోజు ముగుస్తుందనగా బౌలింగ్‌కు వచ్చిన పాండ్యా (2/17) వీరిద్దరినీ అవుట్ చేశాడు. భువీ అండగా... 92/7... మిగిలింది హార్దిక్ ఒక్కడే. మహా అయితే మరో 20, 30 పరుగులు చేయగలదేమోనన్న స్థితి నుంచి భారత్ తేరుకుందంటే పాండ్యా, భువనేశ్వర్‌ల విలువైన భాగస్వామ్యమే కారణం. పరిస్థితిని గ్రహించి ఓవైపు పాండ్యా బ్యాట్ ఝళిపిస్తూ అర్ధశతకం పూర్తి చేసుకోగా... భువీ అతడికి పూర్తి అండగా నిలిచాడు. స్టెయిన్, రబడ, మోర్కెల్‌లను ఎదుర్కొంటూ 34వ బంతికి సింగిల్‌తో పరుగుల ఖాతా తెరిచాడు. కొద్దిసేపటికి వీరిద్దరి మధ్య 50 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అందులో పాండ్యావే 47 పరుగులుండటం విశేషం. పేసర్లతో కావడం లేదని 56వ ఓవర్లో స్పిన్నర్ మహరాజ్‌ను బౌలింగ్‌కు దింపగా సిక్స్, ఫోర్‌తో హార్దిక్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో డికాక్ స్టంపింగ్ అవకాశాన్ని చేజార్చాడు. మరోవైపు భువీ కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు. రబడ, స్టెయిన్ల బౌలింగ్‌లో నాలుగు ఫోర్లు కొట్టాడు. 185/7తో భారత్ టీ విరామానికి వెళ్లింది. స్టెయిన్‌కు గాయం దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ మడమ గాయం కారణంగా రెండో రోజు టీ విరామం అనంతరం బౌలింగ్‌కు దిగలేదు. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు స్కానింగ్ చేయగా... అతనికి నాలుగు నుంచి ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దాంతో అతను ఈ టెస్టులో మళ్లీ బౌలింగ్ చేసే అవకాశం లేదు. సిరీస్‌లోని మిగతా రెండు టెస్టుల్లోనూ అతను ఆడేది అనుమానమే. -
లంక అంతర్జాతీయ జట్టేనా?
తొలి రెండు టెస్టుల మాదిరిగానే మూడో మ్యాచ్‌లోనూ శ్రీలంక తేలిపోయింది. ప్రదర్శన పరంగా భారత్‌తో ఏ విభాగంలోనూ లంక పోటీనివ్వడంలేదు. ఒక టెస్టు మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో ఓ జట్టు 38 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోతే ఆ జట్టును అంతర్జాతీయ జట్టుగా పరిగణించాల్సిన అవసరం లేదు. మందకొడిగా ఉన్న ఫ్లాట్ పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఎన్ని పరుగులు చేస్తుందనేది అప్రస్తుతం. ఆ జట్టులో అసలు పోరాట పటిమనే కనిపించడంలేదు. వారి ఆటతీరు చూస్తుంటే ఈ పోటీని టెస్టు మ్యాచ్ అనాలనిపించడంలేదు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు కనిపించలేదు. అయితే ఇక్కడ లంక బ్యాట్స్‌మెన్ ఆటతీరు తీసికట్టుగా ఉంది. వారి బౌలింగ్ అయితే ప్లేట్ గ్రూప్‌లోని రంజీ జట్టుతో కూడా పోల్చలేం. మరోవైపు శిఖర్ ధావన్ మరోసారి సెంచరీ సాధించి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా మెరుపు సెంచరీ సాధించి టెస్టుల్లో ఇంత అలవోకగా కూడా శతకం కొట్టొచ్చని నిరూపించాడు. లంక బౌలింగ్‌లో పదును లేకపోయినా పాండ్యా సెంచరీని తక్కువ చేసి చూడలేం. బంతితో కూడా పాండ్యా ఆకట్టుకున్నాడు. మాథ్యూస్ వికెట్‌ను తీయడంతోపాటు ఓ క్యాచ్ కూడా తీసుకొని రెండో రోజు ఆటలో హైలైట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా సస్పెండ్ కావడంతో అతని స్థానంలో తుది జట్టులో స్థానం పొందిన కుల్దీప్ యాదవ్ తన ఎంపికకు న్యాయం చేశాడు. రెండేళ్ల క్రితం స్వాతంత్య్ర దినోత్సవం రోజున శ్రీలంక చేతిలో తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. ఈసారి మాత్రం టీమిండియా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. సునీల్ గావస్కర్ -
క్లీన్‌స్వీప్ ఇక ఖాయమే!
►మూడో టెస్టులోనూ భారత్ జోరు ►హార్దిక్ పాండ్యా మెరుపు సెంచరీ ►శ్రీలంకకు ఫాలోఆన్ ►భారత్ తొలి ఇన్నింగ్స్ 487 సిరీస్‌లో తొలిసారి మెరుగ్గా ఆడుతున్నట్టు కనిపించిన శ్రీలంక రెండో రోజే చేతులెత్తేసింది. టి20 తరహాలో చెలరేగిన హార్దిక్ పాండ్యా వీరోచిత సెంచరీతో భారత్‌కు భారీ స్కోరును అందించగా... ‘చైనామన్’ కుల్దీప్ యాదవ్ (4/40) స్పిన్ మ్యాజిక్‌తో లంకనుచుట్టేశాడు.ప్రస్తుతం మరో 333 పరుగులు వెనకబడిన దశలో లంక పోరాడుతుందా? లేక మూడో రోజే వైట్‌వాష్‌కు గురవుతుందా? అనేది వేచి చూడాలి. పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేయడం ఇక లాంఛనమే అనుకోవాలి. కెరీర్లో మూడో టెస్టు ఆడుతున్న యువ బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్యా (96 బంతుల్లో 108; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) లంక స్పిన్నర్లపై విరుచుకుపడి తన తొలి శతకాన్ని అందుకున్నాడు. దీంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 122.3 ఓవర్లలో 487 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 37.4 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. భారత్‌కు 352 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ దశలో ఫాలోఆన్ కోసం బరిలోకి దిగిన లంక ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండగా... లంక ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకునేందుకు మరో 333 పరుగులు చేయాల్సి ఉంది.ఆకాశమే హద్దుగా: రెండో రోజు భారత్ ఆటలో హార్దిక్ పాండ్యా టెయిలెండర్లను అండగా చేసుకుని వీరవిహారం చేశాడు. లంచ్ సెషన్‌లోపే సెంచరీ చేశాడు. 329/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ సాహా (16) రూపంలో త్వరగానే వికెట్ కోల్పోయింది. అయితే కుల్దీప్తో(26; 2 ఫోర్లు) కలిసి పాండ్యా ఎనిమిదో వికెట్‌కు 62 పరుగులు జత చేశాడు. తన తొలి అర్ధ సెంచరీని 61 బంతు ల్లో చేసిన పాండ్యా... ఆ తర్వాత 25 బంతుల్లోనే మరో 50 పరుగులు చేసి తొలి సెంచరీని అందుకున్నాడు. పుష్ప కుమార వేసిన ఇన్నింగ్స్ 116వ ఓవర్లో పాండ్యా వరుసగా 2 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టి 26 పరుగులు సాధించాడు. దీంతో భారత్ తరఫున టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. చివర్లో ఉమేశ్‌తో కలిసి 26 బంతుల్లోనే 50 పరుగులు జత చేసిన పాండ్యా... సందకన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. టప టపా వికెట్లు: తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లంక వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. చండిమాల్ (48; 6 ఫోర్లు), డిక్వెలా (29; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు.ఓపెనర్లను షమీ పెవిలియన్‌కు చేర్చగా... కుల్దీప్, అశ్విన్ స్పిన్ ఉచ్చులో మిగతా వారు విలవిల్లాడారు. -
ఫాలోఆన్ దిశగా శ్రీలంక
-
పట్టు బిగించారు
►ఫాలోఆన్ దిశగా శ్రీలంక ►భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 600 ఆలౌట్ ►శ్రీలంక 154/5 గాలే టెస్టులో లంక విలవిలలాడుతోంది. భారత్ జోరు రెండో రోజూ కొనసాగింది. మొదట బ్యాట్‌తో తర్వాత బంతితో ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించింది. అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా, పేసర్ షమీ బ్యాటింగ్‌లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. బౌలింగ్‌లోనూ షమీ కీలక వికెట్లు పడగొట్టడంతో లంక జట్టు ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. రెండో రోజు తరంగ రనౌట్ హైలైట్. రెప్పపాటు కాలంలోనే ఫీల్డర్ ముకుంద్, కీపర్ సాహా సమన్వయం ఆతిథ్య జట్టును పెద్ద దెబ్బ తీసింది. గాలే: కోహ్లి సేన ఆల్‌రౌండ్ జోరు చూస్తుంటే తొలి టెస్టు చేతిలోకి వచ్చినట్టే కనబడుతోంది. మొదటి రోజు బ్యాటింగ్‌లో భారీస్కోరు చేసిన భారత్... రెండోరోజు బౌలింగ్‌లో లంకను చావుదెబ్బ తీసింది. దీంతో ఇప్పుడు శ్రీలంక ఫలితం కోసం కాకుండా ‘ఫాలోఆన్’ను తప్పించుకునేందుకే పోరాడుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 133.1 ఓవర్లలో 600 పరుగులు చేసి ఆలౌటైంది. సెంచరీ హీరో చతేశ్వర్ పుజారా (265 బంతుల్లో 153; 13 ఫోర్లు) త్వరగానే ఔటైనా... రహానే (130 బంతుల్లో 57; 3 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (49 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. లంక బౌలర్ నువాన్ ప్రదీప్ 6, లాహిరు కుమార 3 వికెట్లు తీశారు. తర్వాత శ్రీలంక ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఉపుల్ తరంగ (93 బంతుల్లో 64; 10 ఫోర్లు), మాథ్యూస్ (91 బంతుల్లో 54 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. షమీకి 2 వికెట్లు దక్కాయి. ఇప్పుడు రనౌట్... అక్టోబర్ నుంచి నాటౌట్! చివరి సెషన్లో కుదురుగా ఆడుతున్న తరంగ రనౌట్ అనూహ్యం... అద్భుతం! ఫీల్డర్ ముకుంద్, కీపర్ సాహా మెరుపు సమన్వయానికి నిదర్శనం. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్ చివరి బంతిని తరంగ సిల్లీ పాయింట్ వైపు ఆడాడు. అక్కడే ఉన్న ముకుంద్ ఆలస్యం చేయకుండా కీపర్‌కు అం దించగా... సాహా బెయిల్స్‌ను పడగొట్టాడు. అప్పటికే తరంగ బ్యాట్ క్రీజ్‌లోకి చేరినా... సాహా బెయిల్స్ పడేసే సమయానికి బ్యాట్ గాల్లోకి లేచింది. దీంతో తరంగ అవుట య్యాడు. అక్టోబర్ 1 నుంచి మారే కొత్త నిబంధనల ప్రకారం బంతి వికెట్లను తాకే సమయానికి బ్యాట్ క్రీజ్‌లోకి చేరితే చాలు. బెయిల్స్ పడే సమయంలో బ్యాట్ గాల్లో ఉన్నా నాటౌట్‌గానే పరిగణిస్తారు. సెషన్–1 రాణించిన అశ్విన్ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ పుజారా, రహానేలను లంక బౌలర్లు నిలువరించారు. ఆట ఆరంభంలోనే పుజారాను ప్రదీప్ అవుట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే అర్ధసెంచరీ తర్వాత రహానే... లాహిరు బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఈ దశలో అశ్విన్ (60 బంతుల్లో 47; 7 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (16) జట్టు స్కోరును 500 పరుగులకు చేర్చారు. లంచ్ విరామానికి ముందు వీరిద్దరూ నిష్క్రమించడంతో భారత్ 503/7 స్కోరుతో సెషన్‌ను ముగించింది. ఓవర్లు: 27, పరుగులు: 104, వికెట్లు: 4 సెషన్–2 పాండ్యా దూకుడు ఈ సెషన్ మొదలైన కాసేపటికే రవీంద్ర జడేజా అవుటయ్యాడు. ఈ దశలో హార్దిక్ పాండ్యాకు జతయిన షమీ ఆతిథ్య బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. హెరాత్ బౌలింగ్‌లో షమీ, ప్రదీప్ బౌలింగ్‌లో పాండ్యా చెరో 3 సిక్సర్లు బాదారు. వేగంగా తొమ్మిదో వికెట్‌కు 8.3 ఓవర్లలోనే 62 పరుగులు జతచేరాయి. పాండ్యా 48 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తర్వాతి బంతికే అతను ఔటవ్వడంతో 600 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఓవర్లు: 16.1, పరుగులు: 97, వికెట్లు: 3 (భారత్) ఓవర్లు: 7, పరుగులు: 38, వికెట్లు: 1 (శ్రీలంక) సెషన్–3 షమీ జోరు చివరి సెషన్లో ఈ సారి షమీ బంతితో దెబ్బ తీశాడు. తొలుత గుణతిలక (16)ను, మెండిస్ (0)ను నాలుగు బంతుల వ్యవధిలో పెవిలియన్ చేర్చాడు. ఈ ఇద్దరి క్యాచ్‌లు ధావన్ చేతికి చిక్కాయి. 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను మాథ్యూస్, తరంగ ఆదుకున్నారు. వీరిద్దరూ నిలదొక్కుకుంటున్న తరుణంలో అర్ధసెంచరీ పూర్తయ్యాక తరంగ రనౌటయ్యాడు. ఓవర్లు: 37, పరుగులు: 116, వికెట్లు: 4 -
సిగ్గు పడాల్సిందేమీ లేదు
♦ ఫైనల్లో పరాజయంపై కోహ్లి వ్యాఖ్య ∙ ♦ జట్టుగా మేం గర్వపడుతున్నామన్న కెప్టెన్ లండన్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడినా టోర్నీలో తమ ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. ఒక జట్టుగా తమపై ఉండే అంచనాలు, ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుంటే ఫైనల్ చేరడం కూడా చెప్పుకోదగ్గ ఘనతగా అతను అభివర్ణించాడు. ‘జట్టుగా మేమంతా గర్వించే ప్రదర్శన కనబర్చాం. మేం ఠీవిగా తలెత్తుకొని నిలబడగలం. ఫైనల్ దాకా వచ్చేందుకు ప్రతీ ఒక్కరు శ్రమించారు. తుది పోరులో ప్రత్యర్థి అన్ని రంగాల్లో మమ్మల్ని వెనక్కి నెట్టింది. ఈ మ్యాచ్‌లో మా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించలేదని అంగీకరించేందుకు మేమేమీ సిగ్గు పడటం లేదు’ అని కోహ్లి అన్నాడు. ఛేదనలో తాము సమష్టిగా విఫలమయ్యామన్న విరాట్... హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. గత కొన్నాళ్లుగా పాండ్యా పదే పదే విఫలమైనా కెప్టెన్ అతనిపై నమ్మకాన్ని కోల్పోలేదు. ‘హార్దిక్ బ్యాటింగ్ కళ్లు తిప్పుకోలేని విధంగా సాగింది. ఆ సమయంలో మేం లక్ష్యానికి చేరువ కాగలమని కూడా అనిపించింది. అయితే అలాంటి సమయాల్లో రనౌట్లాంటి పొరపాట్లు సహజం. అవుటయ్యాక పాండ్యా తన భావోద్వేగాలు ప్రదర్శించడంలో తప్పు లేదు. అలాంటి ప్రత్యేకమైన ఇన్నింగ్స్ తర్వాత నిరాశ పడటం సహజమే. పట్టుదలగా ఆడుతున్న సమయంలో తన ప్రమేయం లేకుండా అవుట్ కావడంతో అసహనం చెందడం సహజమే’ అని కోహ్లి తన సహచరుడికి మద్దతు పలికాడు. అశ్విన్‌పై భరోసా... చాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా విఫలమైన భారత ఆటగాళ్ల జాబితాలో స్పిన్నర్ అశ్విన్ కూడా ఉన్నాడు. 3 మ్యాచ్‌లలో కలిపి అతను 167 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఫైనల్లో అయితే ఫఖర్ జమాన్ చెలరేగిపోయాడు. అశ్విన్ బౌలింగ్‌లోనే అతను ఏకంగా 45 పరుగులు బాదాడు. మరో స్పిన్నర్ జడేజా కూడా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఫైనల్లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించిన తన నిర్ణయంలో తప్పు లేదని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘ఇలాంటి బ్యాటింగ్ పిచ్‌పై స్పిన్నర్లకు సహజంగానే పెద్ద సవాల్ ఎదురవుతుంది. ఇక బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయి అడ్డంగా షాట్లు ఆడుతున్న సమయంలో అయితే స్పిన్నర్లు ఏమీ చేయలేరు. బౌండరీలు ఇవ్వకుండా ఉండటం మానవమాత్రులకు సాధ్యం కాదు. శ్రీలంకతో పరాజయం తర్వాత జట్టులో మార్పులు చేశాం. అదే వ్యూహానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇద్దరు స్పిన్నర్లతో ఆడాం’ అని కోహ్లి వివరణ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో కూడా దాదాపు ఇదే జట్టు ఉంటుంది కాబట్టి తప్పులను సరిదిద్దుకొని మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తామని విరాట్ స్పష్టం చేశాడు. కుంబ్లేతో సయోధ్య మిథ్యేనా! మరోవైపు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లే మధ్య విభేదాలు సమసిపోయేలా కనిపించడం లేదు. సర్దుకుపొమ్మంటూ వీరిద్దరిని కలిపి ఉంచేందుకు బీసీసీఐ, మాజీ క్రికెటర్లు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు సమాచారం. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులు సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతోపాటు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి, సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్ ఫైనల్‌కు ముందు శనివారం కోహ్లితో గంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఇక కోహ్లి, కుంబ్లే కలిసి పని చేయడం కష్టమనే నిర్ణయానికి వీరు వచ్చారు. ‘కుంబ్లే గురించి తన ఆలోచనలు ఏమిటో కోహ్లి స్పష్టంగా చెప్పేశాడు. అతని లెక్కలు అతనికున్నాయి. కోహ్లి వైపు నుంచి చూస్తే ఇరువురి మధ్య సంబంధం సరిదిద్దలేని విధంగా చేయి దాటిపోయింది. ఇక సీఏసీ సభ్యులు కుంబ్లేతో మాట్లాడి ఏదైనా సయోధ్యకు అవకాశం ఉంటుందేమో ప్రయత్నిస్తారు’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. అయితే తాజా పరిణామాలు భారత క్రికెట్‌కు చెడు చేస్తాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘కోచ్‌గా కుంబ్లే రికార్డు అద్భుతంగా ఉంది. అసలు ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఆయనను తొలగిస్తాం? ఈ విషయంలో కెప్టెన్ మాటకు ఎంతవరకు విలువ ఇవ్వాలి? అతను ఎంత అద్భుతమైన ఆటగాడు అయినా మొత్తం అతనికే అప్పగించేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు. తర్వాత వచ్చే కోచ్‌తో కూడా కొద్ది రోజులకే కోహ్లికి విభేదాలు వస్తే అప్పుడు ఏం చేస్తారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. భారత్ ఓటమితో బంగ్లా యువకుడి ఆత్మహత్య ఢాకా: భారత క్రికెట్‌కు వీరాభిమాని అయిన 25 ఏళ్ల బంగ్లాదేశ్ యువకుడు బిద్యుత్ ... చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో భారత్ ఓడటాన్ని జీర్ణించుకోలేక నడుస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. టీమిండియా ఓటమిని తట్టుకోలేకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక పోలీసు అధికారి ఇస్లామ్ తెలిపారు.