న్యూఢిల్లీ: టీవీ షోలో సరదాగా మాట్లాడే ప్రయత్నంలో నోరు జారడం ఎంత తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఊహించలేకపోయారు. నిషేధం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన వీరిద్దరు మళ్లీ ఎప్పుడు క్రికెట్‌లో అడుగు పెడతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్‌మన్‌కే ఉంది. ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్‌మన్‌కే ఇవ్వాలి. అయితే ఇప్పటికిప్పుడు అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
లోధా కమిటీ సిఫారసుల అమలు, బీసీసీఐ ఎన్నికలు తదితర అంశాలతో పాటు పాండ్యా–రాహుల్‌ల అంశంపై కూడా సుప్రీం కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) తరఫు న్యాయవాదులు పరాగ్ త్రిపాఠి, సీయూ సింగ్ దీనికి హాజరయ్యారు. బోర్డులో పలు సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే అంబుడ్స్‌మన్‌ను నియమించాల్సిందిగా వారు కోరారు. అయితే బీసీసీఐ గుర్తింపు ఉన్న ప్రభుత్వ సంస్థల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మాత్రం అంబుడ్స్‌మన్‌ను నియమించే అధికారం కేవలం బోర్డుకే ఉందని...అది ఎన్నికలు నిర్వహించి కార్యవర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే సాధ్యమని వాదించారు.
అనంతరం జస్టిస్ ఎస్‌ఏ బోబ్డె, ఏఎం సప్రే సభ్యులుగా గల ద్విసభ్య బెంచ్ మొత్తం కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అసలు దీనిపై వాదనలు కూడా కనీసం వారం రోజుల తర్వాత, అమికస్ క్యూరీ (కోర్టు సహాయకారి) బాధ్యతలు స్వీకరించిన తర్వాతే వింటామని తేల్చి చెప్పింది. ఇటీవలే గోపాల సుబ్రమణ్యం రాజీనామా చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి పీఎస్ నర్సింహను అమికస్ క్యూరీగా ఎంపిక చేసింది. అయితే ఆయన ఎప్పుడు బాధ్యతలు చేపడతారో తెలీదు. ఆయన లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని సుప్రీం స్పష్టం చేసింది.
వాదనల తర్వాత తేదీ ఏమిటో కూడా కోర్టు ప్రకటించలేదు. దాంతో క్రికెటర్ల భవిష్యత్తు గందరగోళంలో పడింది. ‘నిజానికి వినోద్ రాయ్ సూచన మేరకు 2 మ్యాచ్‌ల నిషేధంతో పని అయిపోయేది. కానీ దానికి ఒప్పుకోని డయానా ఎడుల్జీ లీగల్ టీమ్ సూచన అడగడం, వారు అంబుడ్స్‌మన్ తప్పనిసరి అని చెప్పడంతో విషయం కోర్టు దాకా వెళ్లిపోయింది. ఇప్పుడు ఎవరూ ఏమీ చేయడానికి లేదు. క్రికెటర్ల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు’ అని బీసీసీఐ సీనియర్ సభ్యుడొకరు అభిప్రాయ పడ్డారు.
తప్పులు మానవసహజం!
ముంబై: హార్దిక్, రాహుల్‌ల వివాదంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పరోక్షంగా స్పందించాడు. నేరుగా వారి పేర్లు చెప్పకపోయినా తప్పులు చేయడం మానవ సహజమని, ఇక దానిని వదిలేయాలని అభిప్రాయ పడ్డాడు. ‘నేను టీవీ షో చూడలేదు. అయితే అందరూ తప్పులు చేస్తారు. వాటి గురించి ఇంకా అతి అనవసరం. తప్పు చేసినవారు దానిని తెలుసుకొని సరిదిద్దుకుంటారని భావిస్తున్నా.
అన్నీ పక్కాగా ఉండటానికి మనం యంత్రాలం కాదు మనుషులం. గతం వదిలి మళ్లీ అలాంటి తప్పు జరగకుండా మాత్రమే చూసుకోవాలి. ఎవరో ఒకరిద్దరు తప్ప నిజానికి క్రికెటర్లంతా మంచివాళ్లే. మధ్యతరగతినుంచి వచ్చి జీవితంలో ఎదిగేందుకు ఎంతో శ్రమిస్తారు కాబట్టి మంచితనం వచ్చేస్తుంది. కోట్లాది మందినుంచి 11 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక కావడం మామూలు విషయం కాదు’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
14 ఏళ్ల కుర్రాడిపై వేటు!
లైంగికపరమైన ఆరోపణలు ఎదుర్కొన్న తమ ఆటగాడిపై ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) చర్య తీసుకుంది. ముంబై అండర్–16 జట్టు కెప్టెన్, 14 ఏళ్ల ముషీర్ ఖాన్‌పై మూడేళ్ల నిషేధం విధించింది. డిసెంబర్‌లో జాతీయ అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా కడపలో ముంబై–యూపీ మధ్య క్వార్టర్ ఫైనల్ జరిగిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అద్భుత ప్రతిభాపాటవాలు కలిగి భవిష్యత్తులో స్టార్ కాగలడని ముంబై క్రికెట్ వర్గాల్లో ముషీర్‌పై అంచనాలు ఉన్నాయి. స్కూల్‌నుంచి లీగ్ క్రికెట్ వరకు అన్ని దశల్లో పరుగుల వరద పారించడంతో త్వరలోనే అతను అండర్–19 టీమ్‌కు ఎంపికయ్యే అవకాశాలు కనిపించాయి. మరో యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్‌కు ముషీర్ సొంత తమ్ముడు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment