మెట్రో గాలితో కరెంట్
ఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణ చేశారు. జీనుగాలి(వాహనం ప్రయాణించేటప్పుడు వచ్చే వేగమైన గాలి) సాయంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా గొప్ప ప్రయోగం చేసి విజయం సాధించారు. ఈ ప్రయోగాన్ని ఢిల్లీ మెట్రో రైలు సాయంతో చేశారు. ఢిల్లీ వర్సిటీకి చెందిన కాలింది కాలేజీలో భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ శాఖల్లో చదువుతున్న విద్యార్థులు ఢిల్లీ మెట్రో అధికారులను సంప్రదించారు. మెట్రో రైలు వెళ్లే భూఅంతర్భాగ మార్గంలో టర్బైన్లు పెట్టాలనుకుంటున్నామని, రైలు వెళ్లే సమయంలో వచ్చే గాలి వేగం ద్వారా అవి పనిచేసి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఈ ప్రయోగానికి తమకు అనుమతివ్వాల్సిందిగా కోరారు.
దీనిపట్ల ఆసక్తి చూపిన అధికారులు అందుకు సమ్మతించారు. దీంతో ఢిల్లీలో సొరంగ మార్గాల్లో రైలు వెళ్లే చోట్ల ప్రవేశ ద్వారం వద్ద ముందుగా మూడు బ్లేడ్ల టర్బైన్లను, అనంతరం ఐదు బ్లేడ్ల టర్బైన్లను ఏర్పాటు చేశారు. అది మెట్రో సర్వీసులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం రైలు వెళ్లే వేగానికి వస్తున్న గాలి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి చూపించి అందరి మన్ననలు పొందారు. 'ఒక రోజు మెట్రో స్టేషన్లో నిలుచున్న విద్యార్థులు మెట్రో వేగానికి టన్నెల్లోకి చొచ్చుకొచ్చేగాలి వృధా అయిపోతుంది కదా అని ఆలోచించారు. దానిని ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచించి ఈ ఆవిష్కరణ చేశారు' అని కళాశాల ప్రిన్సిపాల్ పునితా వర్మ తెలిపారు. ఈ ప్రయోగం చేసేందుకు సదరు విద్యార్థులకు 2013లో విశ్వవిద్యాలయం రూ.15లక్షలు కేటాయించింది.