నాయబ్‌సింగ్ సైనీ అనే నేను..
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని దసరా గ్రౌండ్లో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గురువారం వాలీ్మకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజును ముహూర్తంగా ఎంచుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్తోపాటు బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేంద్ర పటేల్, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మ, విష్ణుదేవ్ సాయి, పుష్కర్‌సింగ్ దామీ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కంటే ముందు సైనీ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇటీవల జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచి్చంది. మోదీ అభినందనలు హరియాణా సీఎం నాయబ్‌సింగ్ సైనీతోపాటు కొత్త మంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మంత్రివర్గం కూర్పు చక్కగా ఉందని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హరియాణా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతోపాటు సమాజంలోని ఇతర వర్గాల సంక్షేమం, సాధికారత విషయంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం బీజేపీ సీనియర్ సీనాయకుడు నాయబ్‌సింగ్ సైనీని మరోసారి అదృష్టం వరించింది. హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓబీసీల ఓట్లపై గురిపెట్టిన కమల దళం అదే వర్గానికి చెందిన సైనీని తెరపైకి తీసుకొచి్చంది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచి్చంది. హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. అనూహ్యంగా పార్టీని గెలిపించిన సైనీకే మళ్లీ సీఎం పీఠం దక్కింది. ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్ మాజ్రా గ్రామంలో జని్మంచారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్‌లాల్ ఖట్టర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌లో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఖట్టర్ ఈ ఏడాది మార్చి సీఎం పదవితోపాటు కర్నాల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఖట్టర్ స్థానంలో సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. మే నెలలో జరిగిన కర్నాల్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్టోబర్ 5న జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో లాడ్వా స్థానం నుంచి 16,054 ఓట్ల మెజారీ్టతో జయకేతనం ఎగురవేశారు.