బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100కు చేరిన మృతుల సంఖ్య
సోమాలియా రాజధాని మొగదిషులో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ షేక్ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించడంతో మరో 300 మంది గాయపడినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా మొగదిషులోని విద్యాశాఖ కార్యాలయం బయట రద్దీగా ఉండే జోబ్ కూడలి వద్ద శనివారం(ఆక్టోబర్ 29) రెండు కారు బాంబులు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే.
సోమాలియా అధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని, ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ను ఎదుర్కోవడంపై చర్చిస్తుండగానే రాజధానిలో రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించింది. అంతేగాక గత ఐదేళ్లకాలంలో సోమాలియాలో జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. విద్యాశాఖ కార్యాలయం గోడ వద్ద తొలి పేలుడు జరగ్గా, రద్దీగా ఉన్న ఒక రెస్టారెంట్ ముందు మరో కారు బాంబు పేలింది.
సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మొహమూద్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పేలుడు ధాటికి వాహనాలు తుక్కుతుక్కైనట్లున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి. అల్ ఖైదా ప్రోద్భలంతో పనిచేసే అల్సబాబ్ ఉగ్ర సంస్థే ఈ పేలుళ్లు జరిపి ఉంటుందని అధ్యక్షుడు ఆరోపించారు. రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. గతంలో చాలా సార్లు మొగదిషులో అల్సబాబ్ సంస్థే పేలుళ్లకు తెగబడింది. అయితే అల్ షబాబ్ దీనిపై స్పందించలేదు.
మరోవైపు సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన ఉగ్రదాడులను భారత్ ఖండించింది. ఉగ్రదాడి తర్వాత సోమాలియాలో మరణించిన వారి కుటుంబాలకు భారత్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఇదిలా ఉండగా పేలుళ్లపై తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఇదిలా ఉండగా ఇదే జంక్షన్లో ఐదేళ్ల క్రితం(2017) ట్రక్ బాంబ్ పేలిన ఘటనలో 500 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉగ్ర సంస్థ అల్ షబాబ్ పనేనని తేలింది.
చదవండి: హిజాబ్ ఆందోళనల వేళ పోలీసు కస్టడీలో సెలబ్రిటీ చెఫ్ మృతి.. అంత్యక్రియలకు వేలాది మంది హాజరు