hate speach
-
‘బీజేపీ నేతపై చర్యలు తీసుకోకపోతే’.. బీఎస్పీ ఎంపీ కన్నీటి పర్యంతం
న్యూఢిల్లీ: తనపై మతపరమైన దూషణలు చేసిన బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్యలు చేపట్టకపోతే లోక్సభకు రాజీనామా చేసేందుకు సిద్ధమని బీఎస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీ స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధి అయిన తనకే ఇంత అవమానం జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు బీఎస్పీ ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. తన మైండ్ బద్దలు అయ్యేలా ఉందని, ఈరోజు రాత్రి నిద్ర కూడా పట్టేలా లేదని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. బిధురి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశానని బీఎస్పీ ఎంపీ తెలిపారు. స్పీకర్గా మీ నేతృత్వంలో నూతన పార్లమెంట్ భవనంలో ఇలా జరగడం దురదృష్టకరమని లేఖలో ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. బిధూరిపై చర్యలు తీసుకుని తన హక్కులను కాపాడనిపక్షంలో లోక్సభ సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమవుతానని పేర్కొన్నారు. చదవండి: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం ‘ప్రజలు ఎన్నుకున్న ఎంపీలను వారి మతాలతో ముడిపెట్టి దాడి చేయడానికే ఈ ప్రత్యేక సమావేశాలకు పిలిచారా?. ఇది మొత్తం దేశానికే సిగ్గుచేటు. సొంత పార్టీ ఎంపీపై బీజేపీ ఏదైనా చర్య తీసుకుంటుందో లేదా అతన్ని వెనకేసుకొస్తుందో చుద్దాం.. ఇదొక ద్వేషపూరిత ప్రసంగం’ అని పేర్కొన్నారు. మరోవైపు బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ ఎంపీ రమేష్ బిధురికి బీజేపీ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు 25 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ కోరింది. అదే విధంగా ముస్లిం ఎంపీని కించపరిచేలా మాట్లాడిన రమేష్ బిధురిని స్పీకర్ ఓంబిర్లా తీవ్రంగా మందలించారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కాగా చంద్రయాన్ విజయంపై లోక్సభలో జరిగిన చర్చలో భాగంగా బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీని ఉద్ధేశిస్తూ.. సౌత్ ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డానిష్ అలీని ఉగ్రవాదిగా చిత్రీకరిస్తూ అభ్యంతరకర పదాలు ఉపయోగించారు. మైనార్టీ ఎంపీపై బీజేపీ లోక్సభ సభ్యుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయపరంగా తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీ సభ్యుడి ప్రవర్తనపై విపక్షాలు భగ్గుమన్నాయి. బిధూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. చదవండి: చంద్రయాన్ -3: ఇస్రో కీలక అప్డేట్ -
‘రేపు స్కైప్ ద్వారా వస్తాడంట’
ముంబయి: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ రేపు మీడియా ముందుకు వస్తానని చెప్పాడు. స్కైప్ ద్వారా తాను మీడియాతో మాట్లాడతానని బుధవారం ఒక ప్రకటనలో తెలిపాడు. జాతి విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించిన ఆయనపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల కన్నుపెట్టారు. ఆయన చేసిన ప్రసంగాలన్నింటిని కూడా కేంద్ర, రాష్ట్ర అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అతడు భారత్ కు రాగానే వెంటనే అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావించగా ప్రస్తుతం ఇండియాకు రాకుండా జకీర్ ఆగిపోయాడు. అయితే, తనకు ఆఫ్రికా పర్యటన ఖరారైందని, తానేం పారిపోవడం లేదని, తప్పకుండా విచారణకు హాజరవుతానని చెప్పాడు. గురువారం నాటి ప్రెస్ కాన్ఫెరెన్స్ ద్వారా బాలీవుడ్, న్యాయ, ఎన్జీవోవంటి ఆయా విభాగాల్లో ప్రముఖులైన వారితో కూడా మాట్లాడతానని మరోమాటగా చెప్పాడు.