hawk eye app
-
ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు
సాక్షి, హైదరాబాద్: పశువైద్యురాలు ప్రియాంకారెడ్డి బుధవారం రాత్రి తొండుపల్లి ఓఆర్ఆర్ టోల్గేట్ వద్ద ఇరుక్కుపోయారు. తన స్కూటీ పంక్చర్ కావడంతో రోడ్డుపై ఒంటరిగా మిగిలారు. ఆ సమయంలోనో లేదా ఈ ప్రయాణం ప్రారంభించడానికి ముందో ఆమె పోలీసు అధికారిక యాప్ హాక్–ఐ లేదా పోలీసు కంట్రోల్ రూం నంబర్ 100ను సంప్రదించి ఉంటే హత్యకు గురయ్యేవారు కాదు. అయితే ఈ యాప్‌ను లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నా కేవలం వందల మందే వాడుతున్నారు. ‘హాక్–ఐ’లో ఉన్న ఎస్ఓఎస్లో ముందు రిజిస్టర్ చేసుకోవాలి. ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ‘ఎస్ఓఎస్’ను నొక్కితే పోలీసులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. హాక్–ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్–100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా కాకపోయినా ఈ యాప్ ద్వారానైనా సంప్రదించే అవకాశం ఉంది. వేళకాని వేళల్లో లేదా ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన విభాగమే ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్. ప్రయాణ ప్రారంభానికి ముందు యాప్‌లోని ఈ విభాగంలోకి ప్రవేశించి సదరు మహిళ/యువతి ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారో (డెస్టినేషన్) ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నంబర్లను ఫొటో లేదా మ్యాన్యువల్‌గా నమోదు చేయాలి. జీపీఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ యాప్ ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కమిషనరేట్‌లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. నిర్దేశించిన డెస్టినేషన్ కాకుండా సదరు వాహనం వేరే మార్గంలో ప్రయాణిస్తే పోలీసులే గుర్తించి ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. అటు వైపు నుంచి స్పందన లేకుంటే అప్రమత్తం కావాలని భావించి వెంటనే రంగంలోకి దిగుతారు. మార్గమధ్యంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరి సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు చేరుకుంటారు. ఈ యాప్‌తోపాటు డయల్ ‘100’, వాట్సాప్ (హైదరాబాద్: 9490616555, సైబరా బాద్: 9490617444) రాచకొండ: 9490617111) ద్వారానూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పొందవచ్చు. నిరంతర పర్యవేక్షణ... పోలీసులకు సంబంధించిన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనల్ని నిరంతరం పర్యవేక్షి స్తుంటాం. మహిళల కోసం ఏర్పాటు చేసి న విభాగాలను ఐటీ సెల్లో ఉండే సిబ్బంది 24 గంటలూ గమనిస్తూ అందుబాటులో ఉంటా రు. ఈ యాప్ తెలంగాణవ్యాప్తంగా సేవలు అందిస్తోంది. – ఐటీ సెల్ అధికారులు -
మహిళల భద్రతకు ‘హక్ ఐ’
సాక్షి, కరీంనగర్: మహిళలు ఎక్కడైన ఇబ్బందులు పడుతున్నారా.. ప్రయాణ సమయంలో భద్రత లేదా..అత్యవసర సమయాల్లో ఎక్కడున్నా పోలీసులు స్పందించాలా..మన కళ్ల ముందు ఎదైనా సంఘటన జరిగిందా.. మనమెవరో తెలియకుండా ఆ సంఘటనను పోలీసులకు తెలియజేయాలా..వీటిన్నింటికీ ఒకటే సమాధానం హక్‌ఐ యాప్. యాప్ డౌన్లోడు చేసుకుని మరెన్నో పోలీస్ సేవలను పొందవచ్చు. హక్ ఐ.. కరీంనగర్ కమిషనరేట్ కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 2017 జనవరి 14న యాప్ సేవలను పోలీస్‌శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. మన ఇంటివద్దనే కూర్చుని పోలీసుల సేవలను పొందేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా హక్ ఐ రూపొందించామని సీపీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం యాప్‌పై ప్రజలకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. గతంలో ఎదైనా ఫిర్యాదు చేయాలంటే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీస్ అధికారి వచ్చే వరకూ ఉండి ఫిర్యాదు చేసే విదానం ఉండేది. కాని ఈ యాప్ ద్వారా ఎక్కడినుంచైనా తగిన ఆధారాలతో నేరుగా సంబంధిత ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయొచ్చు. ముఖ్యంగా మహిళలు, కాలేజీ విద్యార్థినులు ఠాణాకు వెళ్లకుండానే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. మనం చేసిన ఫిర్యాదుపై తీసుకుంటున్న చర్యలను యాప్‌లోనే చూసుకోవచ్చు. జిల్లాలో హక్‌ఐ అప్లికేషన్‌ను ఇప్పటి వరకూ 65 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ 2,736 ఫిర్యాదులు రాగా అన్నింటినీ పరిష్కరించారు. డౌన్లోడ్ ఇలా.. ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు గూగూల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ వినియోగదారులు ఆపిల్ స్టోర్ నుంచి హక్‌ఐ అని టైప్ చేసి అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ తర్వాత అందులో మన వివరాలు నమోదు చేస్తే అన్ని కమిషనరేట్ల వివరాలు వస్తాయి. అందులో కరీంనగర్ కమిషనరేట్ అని ఎంచుకోవాలి. హక్‌ఐ తెరపై ఎనిమిది ఐకాన్లు కనిపిస్తాయి. వాటిలో రిపోర్ట్ వాయిలేషన ఆఫ్ పోలీస్, ఉమెన్ ట్రావేల్ మోడ్ పేఫ్, రిజిస్ట్రర్ విత్ పోలీస్, ఎస్ఓఎస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, కమ్యూనిటీ పోలీసిం గ్, నో యువర్ రిపోర్ట్ స్టేటస్, వెహికల్ అండ్ నంబర్ సెర్చ్.. ఇవి వివిధ రకాల వినియోగదారులకు ఉపయోగపడుతాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు.. ఈ అప్లికేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై పోలీస్‌శాఖ ప్రత్యేక శ్రద్ధోతో చర్యలు తీసుకుంటుంది. ఫిర్యా దు అందగానే బాధితులతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో తొందరగా స్పందించడంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వరకు 2,736 ఫిర్యాదులు రాగా దాదాపు అన్నింటినీ పరిష్కరించారు. హక్ ఐకి వచ్చిన ఫిర్యాదుల వివరాలు ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు–759 అక్రమ కార్యకలాపాలకు సంబంధించినవి – 254, ఇతర నేరాలు, మహిళల వేధింపులకు సంబంధించినవి – 658 ఉమెన్ ట్రావెల్ సేవ్ మోడ్ వినియోగించుకున్న వారి సంఖ్య– 638 అత్యవసర పరిస్థితులపై ఫిర్యాదులు (ఎస్ఓఎస్) – 427. వీటిలో సుమారు 102 వరకూ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతీ పౌరుడు యూనిఫాం లేని పోలీసే.. ప్రతి ఒక్కరూ హక్‌ఐ యాప్‌ను వినియోగించుకోవాలి. ఈ యాప్‌తో పోలీస్‌స్టేషన్‌కు రాకుండానే ఫిర్యాదు చేయొచ్చు, అప్డేట్స్ తెలుసుకోవచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. దీనిపై కాలేజీల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ప్రజలు చేసిన ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం, తీసుకుంటున్న చర్యలను కూడా ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. – వీబీ కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అవగాహన కల్పిస్తున్నాం విద్యార్థినులకు, మహిళలకు హక్‌ఐ యాప్ ద్వారా లభించే సేవలపై అవగాహన కల్పిస్తున్నాం. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు దీనికి డౌన్లోడు చేసుకునేందుకు వీలుగా సేవలందిస్తున్నాం. యాప్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరిస్తున్నాం. – దామోదర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్, మహిళాపోలీస్స్టేషన్, షీటీం -
ఫీలింగ్.. ఫిర్యాదు
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించేందుకు, అత్యవసర వేళల్లో పోలీసుల సహాయం అందించేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘హాక్–ఐ’ యాప్ సరికొత్త రూపాన్ని సంతరించుకోనుంది. ఆ యాప్‌లో ‘పోలీసుల తీరు’పై ప్రజాభిప్రాయానికి చోటుకల్పిస్తున్నారు. ఎక్కడన్నా పోలీసు సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రవర్తన సరిగా లేకున్నా ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. ఇలా సంప్రదింపులు జరిపిన వారి వివరాలు సైతం పూర్తి గోప్యంగా ఉండేలా రాష్ట్ర పోలీసు విభాగం చర్యలు తీసుకుంటోంది. ఈ ‘ఫీడ్‌బ్యాడ్’ సదుపాయం మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. సాక్షి, హైదరాబాద్: ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా రాష్ట్ర పోలీసు విభాగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఫిర్యాదుదారులే కాకుండా ప్రతి ఒక్కరూ పోలీసులపై తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం ‘హాక్– ఐ’ యాప్ ద్వారా ఇవ్వనుంది. దీని ద్వారా సంప్రదింపులు జరిపిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ ఫీడ్‌బ్యాడ్ ఇచ్చే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఫిర్యాదుదారుల నుంచే.. అవినీతి నిరోధక, స్నేహపూర్వక పోలీసింగ్ విధానాలు చేపట్టిన హైదరాబాద్ పోలీసు విభాగం దాదాపు మూడేళ్ల క్రితమే ఫీడ్‌బ్యాక్ తీసుకునే ఏర్పాట్లు చేసింది. ఇది కేవలం ఫిర్యాదుదారులకే పరిమితమైంది. తమ సమస్యలు, సహాయం కోసం పోలీసుస్టేషన్‌కు వచ్చే వారు తామిచ్చే ఫిర్యాదులో వ్యక్తిగత వివరాలతో పాటు సెల్‌ఫోన్ నెంబర్ సైతం పొందుపరుస్తారు. ఈ వివరాలు పోలీసుస్టేషన్ నుంచి ఆన్లైన్ ద్వారా కమిషనరేట్‌లోని థర్డ్‌పార్టీ కాల్ సెంటర్‌కు చేరతాయి. ఇక్కడి సిబ్బంది ఈ డేటాబేస్ నుంచి కొన్ని ఫోన్ నెంబర్లను ఎంపిక చేసుకుని వారికి ఫోన్ చేస్తుంటారు. ఆశ్రయించిన పోలీసుల స్పందన, తీరుతెన్నులు తదితరాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. దీని ఆధారం ఆయా పోలీసుస్టేషన్లకు గ్రేడింగ్స్, అధికారుల పనితీరుకు మార్కులు సైతం ఇచ్చే ఏర్పాటు చేశారు. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే వారిపై విచారణ జరిపి చర్యలూ తీసుకుంటున్నారు. కనీసం రెండు శాతానికీచేరట్లేదని.. ఈ విధానం సిటీలో మంచి ఫలితాలను ఇచ్చింది. అధికారులు, సిబ్బంది తీరుతెన్నుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఎం.మహేందర్‌రెడ్డి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధానాన్ని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ రకంగా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్న వారి శాతం జనాభాలో రెండు శాతం కూడా ఉండట్లేదని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నగరాన్నే తీసుకుంటే ఇక్కడ జనాభా కోటిగా భావిస్తే.. మూడు కమిషనరేట్లలోనూ కలిపి గరిష్టంగా లక్ష దాటట్లేదు. దీంతో అనేక మంది పోలీసులపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేకపోతున్నారని తెలుసుకున్నారు. ఈ పరిస్థితుల్ని మార్చాలనే కృతనిశ్చయంతో పోలీసు అధికారిక యాప్ హాక్– ఐ యాప్‌ను వినియోగించుకోవాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. దీని అమలుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే చేపట్టారు. ‘బ్యాడ్’ అయితేనేసంప్రదించేలా.. ఈ యాప్‌లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కోసం ఓ లింకు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న వారు ఎవరైనా ఈ లింక్ ఓపెన్ చేయడం ద్వారా పోలీసుల ద్వారా తమకు ఎదురైన అనుభవం, తాము గమనించిన నెగెటివ్ అంశం తదితరాలను పొందుపరచవచ్చు. లింక్‌లో ఎక్స్లెంట్, గుడ్ తదితరాలతో పాటు బ్యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మిగిలిన ఆప్షన్ ఎంచుకుంటే కేవలం అది రికార్డు అవుతుంది. బ్యాడ్‌ను ఎంచుకుంటే మాత్రం ఓ ప్రత్యేక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఆ అభిప్రాయానికి కారణాన్ని సంక్షిప్తంగా రాసే అవకాశమూ ఉంటుంది. ఇలా చేసిన వారిని థర్డ్‌పార్టీ కాల్ సెంటర్ వారు సంప్రదిస్తారు. ఆ నెగెటివ్ అభిప్రాయానికి కారణం తెలుసుకుని, విచారణ జరిపి బాధ్యతలపై చర్యలు తీసుకుంటారు. ఈ విషయాన్ని తిరిగి ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన వారికీ వివరిస్తారు. ఈ విధానంలో ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెల్లడి కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. -
మహిళ భద్రత కోసం యాప్ విడుదల
వరంగల్: మహిళలు, పౌరుల భద్రత కోసం హాక్ఐ యాప్‌ను వరంగల్ పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌ను నగర కమిషనర్ సుధీర్‌బాబు శనివారం ఆవిష్కరించారు. భద్రతాపరమైన సమస్యలు ఎదురైన వెంటనే తక్షణం పోలీస్ సాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని కమిషనర్ తెలిపారు. -
పోలీస్ యాప్‌కు మరో అవార్డు
హైదరాబాద్ : నగర పోలీసులు రూపొందించిన మొబైల్ యాప్ 'హాక్-ఐ' మరో అవార్డు సాధించింది. బెంగళూరుకు చెందిన ఓ పత్రికా సంస్థ 2015 సంవత్సరానికిగాను డిజిటల్ సిటిజన్ సర్వీసు అవార్డ్ ప్రకటించింది. శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు) అంజనీకుమార్, ఐటీ సెల్ ఇన్చార్జ్ శ్రీనాథ్‌రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. ఈ యాప్‌కు సంబంధించి గురువారం ఢిల్లీలో సీఎస్ఐ నిహిలెంట్ ఈ-గవర్నెన్స్ అవార్డును నగర పోలీసులు అందుకున్న విషయం విదితమే. -
'హాక్ ఐ' యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి: స్వాతి లక్రా
ప్రతి విద్యార్థిని ఒక రక్షక భటురాలిగా వ్యవహరించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని 'షి' పోలీసు విభాగం డీసీపీ స్వాతిలక్రా అన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాంపల్లిలోని సరోజినీ నాయుడు వనితా కళాశాలలో 'మహిళా రక్షణ' పేరిట జరిగిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో ఈవ్‌టీజింగ్‌లు, వరకట్న వేధింపులు జరగడం దురదృష్టకరమన్నారు. వీటిని ఎదుర్కోవడానికి ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్లో 'హాక్-ఐ' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని... ఎటువంటి ఆపద ఎదురైనా 'షి' పోలీసుల సాయం లభిస్తుందని చెప్పారు.