భక్తుల కురులూ సిరులే!
వెంకన్నకు భక్తులు సమర్పించే వెంట్రుకలతో విదేశీ వాణిజ్యమా? అనిఆశ్చర్యపోకండి. ఇది నిజం.. సాక్షాత్తు వెంకన్న సన్నిధిలో నిత్యం భక్తులు సమర్పించే తలనీలాలు టీటీడీకి ఏటా సుమారు రూ.200 కోట్లకుపైగా విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్నాయి. అనాదిగా వస్తున్న తలనీలాల మొక్కుల ఆచారానికి ఆధునిక కంప్యూటర్ యుగంలోనూ భక్తకోటి బ్రహ్మరథం పడుతున్నారు.
పురాణాల్లో తలనీలాల మొక్కుల ప్రస్తావన
* తీర్థక్షేత్రాల్లో విధిగా తలనీలాల మొక్కులు చెల్లించుకోవాలని పద్మ పురాణం చెబుతోంది. తలనీలాలు సమర్పించుకోవడం ద్వారా తెలిసో తెలియకో చేసిన కర్మలన్నీ తొలగి పోతాయి. మనిషిలో స్వతహాగా ఉండే అహం తొలగి సన్మార్గంలో నడిచేందుకు తలనీలాల మొక్కులు దోహద పడతాయి. అందుకే పిల్లల పుట్టువెంట్రుకల్ని పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాల్లోనే తీయిస్తారు.
* 1803కు ముందునుండే తిరుమలలో తలనీలాలు తీసే ఆచారం ఉండేది. చంటిబిడ్డలు, వృద్ధులు స్త్రీ- పురుష లింగ భేదం లేకుండా స్వామికి తలనీలాల మొక్కులు చెల్లిస్తారు.
ఏడాదిలో 1.16 కోట్ల మంది...
* ప్రపంచంలోనే అతిపెద్ద క్షౌరశాలగా ప్రసిద్ధి పొందిన తిరుమలలో రెండు ప్రధాన కల్యాణ కట్టలతోపాటు కాటేజీలు, అతిథి గృహాలు, యాత్రికుల వసతి సముదాయాల వద్ద మరో 9 చిన్న కల్యాణకట్టలు ఉన్నాయి.
* సాధారణ రోజుల్లో 30 వేలు, రద్దీ రోజుల్లో 60 వేలు పైబడి భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. ఇలా నెలకు సరాసరి 9.7 లక్షలు, ఏడాదికి 1.15 కోట్ల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 13వతేదిన రికార్డు స్థాయిలో 73వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించటం విశేషం. ఇలా ఏటా టీటీడీకి సుమారు 360 టన్నుల వెంట్రుకలు సమకూరుతున్నాయి.
* తిరుమలతోపాటు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పరిధిలో టీటీడీ కల్యాణ కట్టలు పనిచేస్తున్నాయి. ఇక్కడ రోజూవారీగా సుమారు 300 మంది తలనీలాలు సమర్పిస్తున్నారు.
తలనీలాల సేకరణ ఇలా...
గుండు కొట్టే సమయంలోనే వెంట్రుకల నాణ్యతను క్షురకులు గుర్తిస్తారు. గుండు కొట్టించుకునేందుకు స్త్రీలు వస్తే వారి జుట్టును ముడి వేస్తారు. కార్యక్రమం పూర్తయినతర్వాత భక్తుల చేతనే ఆ వెంట్రుకల్ని హుండీలో వేయిస్తారు. మిగిలినవాటిని కూడా మరోహుండీలో వేస్తారు. తర్వాత వాటిని తిరుమలలోనే ప్రధాన కల్యాణకట్టపై ఉండే గిడ్డంగులకు తరలిస్తారు. అక్కడ వెంట్రుకల్లో తేమ లేకుండా ఆరబెడతారు. తర్వాత రంగు, పొడవు, నాణ్యత లెక్కన ఆరు రకాలుగా విభజిస్తారు.
ఈ-వేలంతో పెరిగిన ఆదాయం
* 1933లో టీటీడీ ఏర్పడక ముందు ఆలయ నిర్వాహకులతోపాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా కల్యాణకట్టలను నిర్వహించేవారు.
* తర్వాత 1985, ఏప్రిల్ 6న తలనీలాల కోసం టీటీడీ అధికారికం గా కల్యాణకట్టలు ప్రారంభించింది. ఈ సందర్భంగా సమకూరే తలనీలాలను సాధారణ టెండర్ ప్రక్రియలో విక్రయించే వారు. దీనిద్వారా టీటీడీకి ఆదాయం అంతగా వచ్చేది కాదు. దాంతో 2011లో అప్పటి టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం, తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పారదర్శకంగా అంతర్జాతీయ స్థాయిలో తలనీలాలు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన మెటీరియల్ ట్రేడ్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎస్టీసీ)తో సంప్రదింపులు జరిపారు.
రూ.810 కోట్ల విదేశీ మారకద్రవ్యం
తొలిసారిగా సెప్టెంబరు 22, 2011 టీటీడీ ఈ-వేలంలో తలనీలాలు విక్రయించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రతి నెల మొదటి గురువారం ఈ-వేలం ప్రక్రియలో వెంట్రుకలను విక్రయిస్తున్నారు. 2015 ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు మొత్తం 15 విడతల ఈ వేలం ద్వారా టీటీడీకి రూ.810 కోట్లు ఆదాయం సమకూరింది.
తమిళులే టాప్!
తిరుమలేశునికి తలనీలాల మొక్కు చెల్లించే విషయంలో పక్కనే ఉన్న తమిళనాడు వాసులే టాప్‌గా నిలుస్తున్నారు. రెండోస్థానంలో రెండు తెలుగు రాష్ట్రాలు, తర్వాత వరుసగా కర్ణాటక, మహారాష్ర్ట (నాండేడ్, శిరిడీ) భక్తులు అధికంగా వస్తూ స్వామికి తలనీలాల మొక్కులు చెల్లిస్తుంటారు. ఇక ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాజ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోని భక్తులు అధికంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్నా వారిలో తలనీలాలు సమర్పించే భక్తులు తక్కువనే చెప్పవచ్చు.
విశ్వ విపణిలో వెంట్రుకలతో వాణిజ్యం
* వెంట్రుకలు ప్రధానంగా వ్యవసాయం, మందుల తయారీ, నిర్మాణ రంగం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో వాడతారు. ఇక ఫ్యాషన్ ప్రపంచంలో రారాజుగా వెంట్రుకల్ని డిజైన్లు, కాస్మొటిక్స్‌లో వినియోగిస్తున్నారు. ఫ్యాషన్ డిజైన్లలో సాటిలేని దేశాలైన ఇటలీ, ఫ్రాన్స్‌తోపాటు నైజీరియా వంటి చిన్న దేశాలు కూడా వెంట్రుకలు కొనుగోలు చేసే దేశాల్లో ముందు వరుసలో ఉన్నాయి.
చారిత్రక నేపథ్యం
* క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల కాలంలోనే ఈజిప్టులో నాటక రంగాల్లో వెంట్రుకలతో తయారు చేసిన విగ్గులు వాడినట్టు చరిత్ర. ఆనాడు వాడిన విగ్గులు నేటికీ చెక్కు చెదరకపోవటం వెంట్రుకల నాణ్యత, వాటిలోని ఔషధగుణాలకు నిదర్శనమని తెలుస్తోంది.
వ్యవసాయ రంగంలో...
* వెంట్రుకలు భూమిలో కలసి పోవటం వల్ల రసాయనిక వాయువులైన కార్బన్, నైట్రోజన్, సల్ఫర్‌తోపాటు టాక్సిక్ వాయువులైన అమ్మోలియా, కార్బన్ సల్ఫేట్, హైడ్రోజన్ సల్ఫేట్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయువుల విడుదలకు కారణమవుతుంది.
* బయో డీగ్రేడబుల్ వస్తువుగా, వర్మీ కంపోస్టుగా వాడటానికి వెంట్రుకలు చాలా ఉపయోగం. పొట్టిరకం, ముడి రకానికి సంబంధించిన వెంట్రుకలతో ఎరువులు తయారు చేస్తారు.
* జంతువుల పేడలో నైట్రోజన్ 0.2 శాతం మాత్రమే ఉండగా, మనుషుల వెంట్రుకల్లో మాత్రం అత్యధికంగా 16 శాతం నైట్రోజన్ ఉంటుంది. దాంతోపాటు సల్ఫర్, కార్బన్, చెట్లు ఎదగడానికి దోహదపడే మరో 20 రకాల పోషక పదార్థాలుంటాయి.
వెంట్రుకల ఎరువుతో అధిక దిగుబడి
* చైనా వ్యవ సాయంలో జంతువుల పేడతోపాటు వెంట్రుకల్ని కూడా కలిపి వాడటం వల్ల ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి సాధించారు. ఒక్కసారి వెంట్రుకల ఎరువు వేస్తే కనీసం మూడేళ్లపాటు ఇతర ఎరువుల అవసరం లేకుండానే పంటలు పండించి మంచి దిగుబడి సాధించవచ్చని చైనా వ్యవసాయ శాస్త్రవేత్తలు నిరూపించారు.
* పెట్రోల్ బావులు, చమురు శుద్ధి కర్మాగారాల్లో వాడకం
* వెంట్రుకలకు ఉండే పటిష్టత, మన్నిక దృష్ట్యా వాటితో తయారు చేసిన పరికరాలనే పెట్రోల్ బావుల్లోనూ, చమురు శుద్ధి కర్మాగారాల్లోనూ వాడతుంటారు. నూనె శుద్ధిచేయడానికి ఫిల్టర్‌గా వాడతారు. నీటిని శుభ్రం చేసే పరిశ్రమల్లోనూ వాడతారు.
* అంతరిక్ష పరిశోధనలకు వాడే క్రయోజెనిక్ ఇంజన్లలో ఇంక్యులేషన్ (పైపొర)గా వాడతారు. గ్లాస్ ఫైబర్ కంపోజిట్ కంటే వెంట్రుకలతో తయారు చేసిన ఇంక్యులేషన్ చాలా చవకగాను, మన్నికగా ఉండటం వల్ల క్రయోజనిక్ ఇంజన్ల విడిభాగాల్లో వాడుతుంటారు.
* అమెరికా, ఫిలిఫైన్స్ వంటి దేశాల్లో నూనె కర్మాగారాల్లో వెంట్రుకలతో తయారు చేసిన పరికరాలనే వాడతారు. మన్నికతోపాటు నూనె పీల్చే గుణం లేకపోవటం, ఫినాల్, పాదరసం, రాగి, కాడ్మియం, వెండి వంటి రసాయన పదార్థాలను ఒడిసి పట్టుకునే గుణం కూడా ఉండటమే ఇందుకు కారణం.
కీలకమైనా ఫార్మా పరిశ్రమల్లోనూ...
* వెంట్రుకల్లో 20 రకాల పోషక విలువల గల అమినో ఆమ్లాలు ఉన్నాయి. సిస్టైన్, లిజైన్, ఇసోలిసిన్, వాలిన్ మొదలగు పోషకాలున్నాయి. హైడ్రాలసిస్ పద్దతి ద్వారా వెలికి తీయవచ్చు.
* ఈ సిస్టైన్ పోషకాన్ని కాస్మొటిక్స్, ఫార్మారంగాల్లో (మందుల తయారీ) ప్రధానంగా గాయాలు మాన్పడానికి యాంటీసెప్టిక్‌గా వాడతారు.
* చత్తీస్‌ఘడ్‌లో గాయాలకు వెంట్రుకలతో కాల్చిన బూడిదను ఔషదంగా వాడతారు. తద్వారా శాశ్వతంగా గాయం మానటం, రక్తస్రావాన్ని నిలిపివేయటం జరుగుతుంది.
* సర్జరీలో కుట్లు వేయడానికి మానవ శరీరానికి బాగా సూట్ అవుతుంది. ఎలాంటి ప్రతిచర్యలు ఉండవు, మన్నికతోపాటు ముడి వేయడానికి అనుకూలత ఉన్న కారణంగా వైద్యరంగంలో విరివిగా వాడతారు.
* పశువుల రక్తస్రావాన్ని నిరోధించటంలోనూ, మూత్ర విసర్జన సమస్యల పరిష్కారంలోనూ వాడతారు.
* శతాబ్దాల కిందట యూరప్ దేశాల్లో సూక్ష్మసర్జరీల్లో కూడా, చాలా సున్నితమైన వాటిల్లో కూడా వెంట్రుకల వాడకం ఉంది.
* కణ ఉత్పత్తి, ప్రొటీన్, కెరాటిన్ ఉత్పత్తి మొదలగు జీవ ఉత్పత్తులు తయారు చేయడానికి కణ పునరుజ్జీవనా నికి, వెంట్రుకలతో తయారు చేసిన ప్రొటీన్నే ఉపయోగిస్తారు.
* ఆసియా ఖండం వారి వెంట్రుకలు నల్లగా ఉండటం వల్ల సిస్టైన్ ఆమ్లం సమృద్ధిగా లభిస్తుంది.
* హైడ్రాలసిస్ అనే ప్రక్రియ ద్వారా కెరాటిన్ అనే ప్రొటీన్‌ను వెంట్రుకల నుంచి తయారు చేయవచ్చు.
వివిధ దేశాల్లో ...
* మారిషస్‌లో ఎలుకల నివారణకు, అమెరికాలో జింకల కట్టడికి, ఇండియాలో ఎలుగుబంట్ల నివారణకు వెంట్రుకలతో చేసిన వస్తువులు వాడుతుంటారు.
* విగ్గులు, జుత్తు అతికించే ఫ్యాషన్ పరిశ్రమల్లోనూ ...
* వెంట్రుకలతో విగ్గుల తయారీ పరిశ్రమ, జుత్తు అతికించే పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.
* 1970 కాలంలో సింథటిక్ ఫైబర్‌తో తయారు చేసిన విగ్గులను ప్రత్యామ్నాయంగా వాడారు. కానీ, నాణ్యత, మన్నిక, సహజత్వం దృష్ట్యా తర్వాత కాలంలో వెంట్రుకలే విగ్గులుగా వాడతారు.
* చైనా, హాంకాంగ్, ఇండోనేషియా, ఇటలీ వంటి దేశాలు విగ్గులు ఎగుమతి చేస్తాయి అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, కొరియా దేశాల్లో విగ్గులు అధికంగా కొనుగోలు చేస్తారు.
* మనదేశంలోని ఢిల్లీ నగరంలో జ్యాలాపురి పరిశ్రమ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. దేశంలో ఇదే అతిపెద్ద వెంట్రుకల పరిశ్రమ. పర్యావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీ శివారు ప్రాంతంలోకి తరలించారు.
* పొడవు వెంట్రుకలతో కాస్మొటిక్స్ (విగ్గులు, జుత్తు అతికించే వస్తువులు), దారాలు అల్లుతారు.
* 2010 సంవత్సరంలో భారత దేశం ఒక మిలియన్ కిలోల తలనీలాలు ఎగుమతి చేసి రూ.238 మిలియన్ డాలర్లు సంపాదించింది.
* వెంట్రుకల్లో ‘రెమి’ అనేరకం నాణ్యైమైంది. దాని రంగు, మన్నిక, తత్వం వంటి గుణాల కారణంగా రెమీ వెంట్రుకలకు డిమాండ్ ఎక్కువ. పరిశోధకులు, వివిధ హెయిర్ డై పరిశ్రమలలో కాస్మొటిక్ బ్రష్‌లు తయారు చేయడానికి ఇదే రకం వెంట్రుకలే వాడుతుంటారు.
నిర్దిష్ట విధానాల అమలుతోనే ఆదాయం
* తలనీలాలకు అంతర్జాతీయ మార్కెట్ ఉందని గుర్తించాము. అందుకు తగ్గట్టుగా టెండర్ విధానంలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చాం. సాధారణ టెండర్ విధానాన్ని మార్పు చేశాం. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ అయిన ఎంఎస్టీసీ ద్వారా వెంట్రుకల అమ్మకానికి ఈ-వేలం విధానాన్ని అమలు చేశాం. ఈ- వేలంలో అమ్ముడైన వెంట్రుకల్ని అప్పగించేంతవరకు ప్రత్యేక జాగ్రత్తలు అమలు చేశాం. గతంలో ఏటా రూ.40 కోట్లు వచ్చే ఆదాయం పారదర్శకత అమలు చేయటం వల్ల రూ.240 కోట్లు దాటింది. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది.
- కేఎస్ శ్రీనివాసరాజు, జేఈవో, తిరుమల
భక్తకోటికి బోలెడంత భద్రత
* ఒళ్లు తెలియని భక్తిపారవశ్యంతో దూరాభారమూ, వ్యయప్రయాసలూ అలుపూసొలుపూ వేళాపాళా ఎరుగకుండా నిత్యం పరవళ్లు తొక్కుతుండే భక్తజనానికి టీటీడీ విజిలెన్స్, పోలీసు బలగాలు భద్రతను కల్పించాయి. భక్తులు ఎలాంటి చీకూ చింతాలేకుండా తీర్థయాత్రను పరిపూర్ణం చేసుకునే సౌలభ్యం కల్పించాయి.
* టీటీడీ ముఖ్య భద్రత, నిఘా అధికారి నేతృత్వంలో ఆలయానికి ఆర్మ్డ్ ఫోర్సు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, టీటీడీ విజిలెన్స్ విభాగాలు కాపలాగా పనిచేస్తాయి. మహాద్వారం నుండి ఆనంద నిలయ ప్రాకారం వరకు విజిలెన్స్ తప్ప మిగిలిన సిబ్బంది అధునాతన ఆయుధాలతో 24 గంటలూ షిఫ్టుల పద్ధతిలో పహారా కాస్తారు. ఇక ఆలయానికి నాలుగు దిశల్లోనూ గస్తీ (ఔట్‌పోస్టు)ల్లో ఉంటారు. పోలీసు ఔట్‌పోస్టులను కూడా ఆలయ సంస్కృతి ఉట్టిపడేలా ప్రత్యేకంగా తయారు చేసారు. ఆలయం ముందు గొల్ల మండపం వద్ద కూడా భద్రత సిబ్బంది విధుల్లో ఉంటారు.
* స్వామి దర్శనానికి వెళ్లే భక్తులను భద్రతా సిబ్బంది వైకుంఠం నుంచి ఆలయం వరకు పలు దశల్లో తనిఖీ చేస్తారు. భక్తులు వెంట తీసుకెళ్లే చిన్న చేతిసంచులను సైతం వదలకుండా పరిశీలించేందుకు అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు.
* వైకుంఠం నుంచి ఆలయం వరకు అడుగడుగునా అధునాతన సీసీ కెమెరా వ్యవస్థ ద్వారా నిఘా సిబ్బంది ఆలయంలోకి వెళ్లేవారి కదలికల్ని నిశితంగా పరికిస్తారు. ఆలయంలోకి వెళ్లే సరుకులను కూడా తనిఖీ చేసిన తర్వాతే ఆలయంలోకి తరలిస్తారు.
* ఆలయంలో విధుల్లో ఉండే భద్రతా సిబ్బంది ఆలయ సంప్రదాయాలను అనుసరించి జంతుచర్మాలతో కాకుండా నూలుదారంతో తయారు చేసిన బెల్ట్‌లు ధరిస్తారు. ఆలయ పరిసరాల్లో పాదరక్షలు ధరించరు. అశుభ కార్యాలు జరిగిన సందర్భాల్లో ఆలయంలో విధినిర్వహణకు వెళ్లరు.
* సాధారణ పోలీసు విభాగాలు, నేర పరిశోధన విభాగాలు, నిఘా, భద్రతా విభాగాలు కూడా భక్తులకు, ఆలయానికి అదనంగా భద్రత కల్పిస్తాయి.
* ఇక దేశంలో ఉగ్రవాద చర్యల నేపథ్యంలో సుమారు 40 మంది మెరికల్లాంటి యువ కమాండోల అక్టోపస్ దళం ఎల్లప్పుడూ ఆలయాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. వీరంతా సాధారణ దుస్తుల్లో భక్తుల మధ్య సంచరిస్తుంటారు.
* తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలను, ప్రయాణీకులను, లగేజీని తనిఖీ చేసేందుకు తిరుపతిలోని అలిపిరి, తిరుమలలోని గరుడాద్రినగర్ తనిఖీ కేంద్రాల్లోనూ, అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటల్లో వచ్చే దారుల్లోనూ తనిఖీ వ్యవస్థ ఉంది. కాలిబాటల్లో 24 గంటలూ పనిచేసే గూర్ఖా వ్యవస్థ కూడా ఉంది.
* ఇక బ్రహ్మోత్సవాల సమయంలో సాధారణ బలగాలతోపాటు జాతీయ విపత్తుల నివారణ సంస్థ తరపు సిబ్బంది కూడా తమవంతు సేవలందిస్తారు.