‘అది జుట్టా, కలుపు మొక్కా?’ అని ఒకరు, ‘గొర్రె బొచ్చుకు, వారి జుట్టుకు ఏమన్నా తేడా ఉందా?’ అని మరొకరు ‘నల్ల జుట్టుంటే ఉద్యోగానికేం పనికొస్తారు?’ జుట్టుపై అమెరికన్ల వివక్షాపూరిత వ్యాఖ్యలివి!
జాతి వివక్ష, మత వివక్ష, కుల వివక్ష గురించి విన్నాం. కానీ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో మాత్రం తలపై జుట్టు దగ్గర్నుంచి కాలి గోళ్ల దాకా అక్కడ అన్నింటా వివక్ష రాజ్యమేలుతోంది. నల్ల జుట్టుపై వివక్షను నిషేధిస్తూ టెక్సాస్ హౌస్ తాజాగా బిల్లును ఆమోదించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయంగా మారింది...
జుట్టు నల్లగా, పొడవుగా, రింగులు తిరిగి ఉంటే అమెరికన్లు సహించలేరు. కొప్పు బాగా కుదిరితే చక్కగా ఉంటుందంటాం. కానీ నల్లజాతి అమ్మాయిలు రకరకాల హెయిర్ స్టైల్స్‌తో కొప్పును గొప్పగా ప్రదర్శించడం కూడా అమెరికన్లకు కంటగింపు వ్యవహారమే. స్కూళ్లు, పని ప్రాంతాలు, నలుగురు కలిసే చోట... ఇలా అంతటా ఈ వివక్ష తీవ్ర రూపు దాల్చి కన్పిస్తుందక్కడ. ఆఫ్రో, బ్రయిడ్స్, డ్రెడ్‌లాక్స్, కార్న్‌రోస్ హెయిర్ స్టైల్స్ చేసుకునే వారిపై వివక్ష పెరిగిపోతుండటంతో టెక్సాస్‌లో ప్రతినిధుల సభ కల్పించుకోవాల్సి వచ్చింది.
నల్లజుట్టుపై వివక్ష పనికిరాదంటూ క్రౌన్ యాక్ట్ బిల్లును ఆమోదించింది. జుట్టుపై వివక్ష తగదంటూ డెమొక్రాట్ సభ్యురాలు రెట్టా బోవర్స్ తొలుత గళమెత్తారు. ఎవరి జుట్టు ఎలా ఉంటే అలానే ఉండనివ్వాలి. మార్చుకొమ్మని శాసించే హక్కు ఎవరికీ ఉండదు’’అన్నారామె. బోవర్స్ తొలిసారి ఈ బిల్లును ప్రతిపాదించినప్పుడు ఇదంత అవసరమా అని అంతా కొట్టిపారేసారు. కానీ ఇప్పుడది 143–5 ఓట్లతో నెగ్గడంతో ఆమె ఆనందం అవధులు దాటింది.
బిల్లు ఎలా వచ్చిందంటే..
హ్యూస్టన్‌లో బార్బర్స్ హిల్ హైస్కూలులో అధికారులు డెండ్రే ఆర్నాల్డ్ అనే విద్యార్థిపై చూపిన వివక్ష ఈ బిల్లుకు కారణమైంది. ఆర్నాల్డ్ ఏడో తరగతి నుంచి జుట్టు పెంచుకుంటున్నాడు. అది ట్రినిడాడియన్ల సంస్కృతిలో భాగం. కానీ జుట్టు కత్తిరించుకోకుంటే గ్రాడ్యుయేషన్ క్లాసులకు అనుమతించేది లేదని స్కూలు అధికారులు తేల్చి చెప్పారు. అబ్బాయి తల్లిదండ్రులు కాళ్లావేళ్లా పడ్డా లాభం లేకపోయింది.
ఇదంతా 2020లో జరిగింది. ఆర్నాల్డ్ కథ ఇంటర్నెట్‌లో వైరలైంది. అతనికి ప్రఖ్యాత టీవీ షో ది ఎలెన్ డిజెనరస్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. హెయిర్ లవ్ అనే షార్ట్ ఫిల్మ్ తీసిన దర్శకుడు మాథ్యూ ఎ చెర్రీ ఆ అబ్బాయిని ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌కు కూడా ఆహ్వానించాడు. మరెందరో విద్యార్థులను జుట్టు పొడవుగా ఉందంటూ స్కూలు నుంచి తీసేసిన ఉదంతాలు వెలుగులోకి రావడంతో ఈ వివక్షను నిషేధిస్తూ చట్టం చేయాల్సి వచ్చింది.
ఈ వివక్ష ఇప్పటిది కాదు!
అమెరికాలో నల్ల జుట్టుపై వివక్ష 18వ శతాబ్దం నుంచీ ఉంది. ఆఫ్రికన్ల జుట్టు గొర్రె బొచ్చులా ఉంటుందని అప్పట్లోనే హేళన చేసేవారు. తర్వాత రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకునే నల్లజాతి మహిళలు ఉద్యోగాలకు పనికి రారన్న అభిప్రాయం అమెరికన్లలో పెరిగింది. జుట్టు ఎక్కువున్న వారికి వృత్తిపరమైన లక్షణాలేవీ ఉండవని, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే సామర్థ్యముండదని అడ్డమైన వాదనలు తెరపైకి తెచ్చారు. తెల్ల జుట్టు వాళ్లకే ఉద్యోగాల్లో ప్రాధాన్యమిచ్చేవారు.
ఇంటర్వ్యూ ఉంటే హెయిర్‌స్టైల్ మారాల్సిందే!
డోవ్, లింక్డిన్ సంస్థలు ఇటీవల జుట్టు వివక్షపై సంయుక్త అధ్యయనం చేశాయి. నల్లజాతి యువతుల్లో మూడింట రెండొంతుల మంది ఇంటర్వ్యూలకి వెళ్లినప్పడు హెయిర్ స్టైల్స్ మార్చుకుంటున్నట్టు తేలింది. నల్లటి కురులున్న 25–34 మధ్య వయసు వారిలో 20 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. టీవీ షోలు, సోషల్ మీడియాలోనూ నల్ల జుట్టుపై విషం కక్కడం పరిపాటిగా మారింది.
ఒబామా భార్యకూ తప్పలేదు!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మహిళ మిషెల్‌కు కూడా జుట్టు వివక్ష తిప్పలు తప్పలేదు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా ఆమె తన రింగుల జుట్టును సాఫీగా ఉండేలా చేయించుకున్నారట. ఈ విషయం గతేడాది ఓ కార్యక్రమంలో ఆమే స్వయంగా చెప్పారు. ‘‘వైట్‌హౌస్‌లో ఉండగా ఒబామా పాలనపై కాకుండా నా జుట్టుపై ఎక్కడ చర్చ జరుగుతుందోనని హెయిర్‌స్టైల్ మార్చుకున్నా. ఒక నల్లజాతి కుటుంబం శ్వేతసౌధంలో ఉండటాన్ని సగటు అమెరికన్లు అంతగా జీర్ణించుకోలేరు. దానికి తోడు నా జుట్టుపైనా వివాదం రేగడం ఎందుకని భావించా’’అన్నారు. అమెరికా సమాజంలో జుట్టు వివక్ష ఎంతలా వేళ్లూనుకుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment