నా భార్య వయసు 36 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా?
రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ.
లక్షణాలు : నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తం పోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
దీనివల్ల సంతానం కలగక పోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు.
డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ,
హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
బాబుకు ఏడీహెచ్‌డీ అంటున్నారు... చికిత్స ఉందా?
మా బాబు వయసు ఏడేళ్లు. ఒక చోట కుదురుగా ఉండడు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్ నుంచి ఎవరో ఒక టీచర్ మావాడి ప్రవర్తన గురించి ఏదో ఒక కంప్లయింట్ చేస్తుంటారు. డాక్టర్‌కు చూసిస్తే ఒకరు ఏడీహెచ్‌డీ అన్నారు. హోమియోలో మా వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా?
ఏడీహెచ్‌డీ అనేది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనే వ్యాధి పేరుకు సంక్షిప్త రూపం. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కూడా మీ బాబుకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివ్ డిజార్డర్ ( ఏడీహెచ్‌డీ) అనే సమస్యే ఉందని అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్‌డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధారణంగా ఏమీ గుర్తుండదు.
సమస్యకు కారణాలు :
►జన్యుపరమైన కారణాలు
►తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం
►తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు.
లక్షణాలు :
►మతిమరపు, తలనొప్పి
►ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు
►మానసిక స్థితి చక్కగా లేకపోవడం
►ఒక చోట స్థితిమితంగా ఉండలేకపోవడం.
►ఇతరులను ఇబ్బంది పెట్టడం.
నిర్ధారణ : రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారై
చికిత్స : హోమియోలో ఏడీహెచ్‌డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
పైల్స్‌కు శాశ్వత పరిష్కారం ఉందా?
నా వయసు 57 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా ఏదో బయటకు వస్తోంది. మల విసర్జనలో రక్తం పడుతోంది. సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అన్నారు. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?
అమితంగా ఇబ్బంది కలిగించే సమస్యల్లో మొలల సమస్య ఒకటి. ఈ సమస్యలో మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి అవి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి.
మొలల దశలు :
► గ్రేడ్–1 దశలో మొలలు పైకి కనిపించవు.నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది.
►గ్రేడ్–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి.
►గ్రేడ్–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి.
►గ్రేడ్–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు.
కారణాలు :
►మలబద్దకం
►మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి.
►సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం
►స్థూలకాయం (ఒబేసిటీ)
►చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ
►మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు
►మంచి పోషకాహారం తీసుకోకపోవడం
►నీరు తక్కువగా తాగడం
►ఎక్కువగా ప్రయాణాలు చేయడం
►అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం
►మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ.
లక్షణాఉల :
►నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి
►మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం.
నివారణ :
►మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం
►సమయానికి భోజనం చేయడం ముఖ్యం
►ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం
►నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం
►మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం
►మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు. హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులు ఇచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment