చండ్ర సెగలకు నూలుపోగు
వసంతగాలికోసం కోయిలలు తొందరపడుతున్నా.. ఆపై వచ్చే వడగాలులను తలుచుకుని కోనంగులు మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. వేసవిలో వరుస కట్టే వేడుకలకు ఎలా ముస్తాబవ్వాలో తెలియక తికమకపడుతున్నారు. ఒకప్పుడు మేలో ఎండలు మెండు అని చదువుకున్నాం. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో మార్చి నుంచే భానుడు భగభగమంటున్నాడు. దీంతో హెవీ డ్రెస్సింగ్‌కు బె దురుతున్న మగువల కోసం ష్యాషన్ డిజైనర్లు సరికొత్త ఆప్షన్స్ తీసుకొస్తున్నారు. చంద్రునికో నూలుపోగన్నట్టు.. చండ్ర సెగలకూ నూలు పోగే కరెక్టని నయా డిజైన్స్ ఆవిష్కరిస్తున్నారు. ఫ్యాషన్ సూత్రాల కు లోబడి.. రిచ్ నెస్ ఏమాత్రం తగ్గకుండా.. సరికొత్త మోడల్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు.
ఏడాదంతా ఎలాంటి ఫ్యాషన్ ప్రపంచంలో విహరించినా.. వేసవి రాగానే నూరు విధాలా నూలే కరెక్టని అందరూ ఫిక్సవుతారు. దీన్ని బేస్ చేసుకునే సమ్మర్ కోసం కాటన్‌తో మ్యాజిక్ చేస్తున్నారు ష్యాషన్ డిజైనర్లు. వేసవిలో పార్టీలకు, ఫంక్షన్లకు, గెట్ టుగెదర్ ఈవెంట్లకు వెళ్లే అతివలకు అతికినట్టు నప్పే ఫ్యాషన్ వేర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నైలాన్, రాసిల్క్, బ్రోకెట్ వంటి ఫ్యాబ్రిక్స్‌తో మురిపించే వస్త్ర శ్రేణులు సమ్మర్ రాగానే బీరువాకే పరిమితం అవుతాయి. ఇక పట్టు చీరల సంగతి వేసవిలో మరచి పోవాల్సిందే. అందుకే నిండు ఎండాకాలంలో పెళ్లిసందడికైనా.. మరే వేడుకకైనా.. వెళ్లాల్సివస్తే నేత చీరలకే ఓటు వేస్తారు మహిళలు. నడి వయస్కులు, పెద్దమనుషులు నేత చీరలతో నెట్టుకొస్తారు.. మరి యువతుల సంగతో అంటే.. వారి కోసం సాఫ్ట్ స్పన్ అండ్ స్మూత్ కాటన్‌తో కంఫర్టబుల్ కాస్ట్యూమ్స్ ఉన్నాయంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.
ఇదే తరుణం..
చిట్టి పొట్టి ఫ్రాక్స్ నుంచి చుడీదార్స్, లాంగ్ స్కర్ట్స్, టాప్స్ ఇలా అన్నింటినీ కాటన్, స్పన్ కలగలిపి సమ్మర్ కాన్సెప్ట్‌లోకి షిఫ్ట్ చేస్తున్నారు. దీనికే నేచురల్ అందాలను జోడిస్తున్నారు. రకరకాల పూల డిజైన ్లను స్కర్ట్ మీద పూయించి అదిరిపోయేలా చేస్తున్నారు. నింగిలోని తారకల నమూనాలను ఫ్రాక్స్ మీద మెరిసేలా చేస్తున్నారు. అందుకే వేసవి వెదర్‌కు సెట్ అవుతూ.. కూల్‌గా ఉంచుతున్న ఈ డిజైనింగ్స్కు మంచి తరుణం మించిన దొరకదంటూ స్వాగతం పలుకుతున్నారు తరుణిలు.
- సిరి