వాగులు పొంగె.. గోదావరి ఉప్పొంగె..
సాక్షి,పోలవరం రూరల్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌డ్యామ్ ఎగువ భాగంలో రోజురోజుకూ గోదావరి నీరు ఎగపోటు తన్నుతోంది. ముంపు గ్రామాల సమీపంలోకి నీరు చేరుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షం నీరంతా గోదావరిలో కలుస్తోంది. ప్రాజెక్టు కాఫర్‌డ్యామ్ వద్ద మంగళవారం 27.549 మీటర్లకు నీటిమట్టం చేరింది. స్పిల్‌వేలోని 42 గేట్ల నుంచి దిగువకు నీరు చేరుతోంది. స్పిల్ ఛానల్ మీదుగా మహానందీశ్వరస్వామి ఆల య సమీపంలో సహజ ప్రవాహంలో కలుస్తోంది.
రంగుమారిన గోదారమ్మ
కొండవాగుల నీరు కలవడంతో గోదావరి కొద్దిగా రంగు మారి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు దిగువన కూడా నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. నక్కలగొయ్యి కాలువ, ఇసుక కాలువ, పేడ్రాల కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టిసీమ ఔట్‌ఫాల్ స్లూయిజ్ నుంచి కొవ్వాడ కాలువ అధిక జలాలు గోదావరిలోకి చేరుతున్నాయి.
నిండుకుండలా జలాశయాలు
బుట్టాయగూడెం: భారీ వర్షాలతో బుట్టాయగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. పోగొండ రిజర్వాయర్‌లో కూడా వరద నీరు పోటెత్తుతోంది. జల్లేరు జలాశయంలో 211.80 మీటర్లకు, పోగొండ రిజర్వాయర్‌లో 155.7 మీటర్లకు నీటిమట్టం చేరిందని అధికారులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు, పిల్ల కాలువలు పొంగుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు దిగువన రంగు మారి ప్రవహిస్తున్న గోదావరి
32.8 మి.మీ సగటు వర్షపాతం
జిల్లాలో గత 24 గంటల్లో 32.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా మంగళవారం ఉదయం వరకు పరిశీలిస్తే చా గల్లులో అత్యధికంగా 131.8, పాలకోడేరులో 108.4, జీలుగుమిల్లిలో 101.8 మి.మీ వర్షం కురిసింది. దేవరపల్లిలో 75, పోలవరంలో 74.2, కొవ్వూరులో 73.8, గణపవరంలో 69.4, బుట్టాయగూడెంలో 59.4, వీరవాసరంలో 53.2, నిడమర్రులో 48.6, కొయ్యలగూడెంలో 44.6, తాళ్లపూడిలో 41.2, టి.నర్సాపురంలో 40.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జంగారెడ్డిగూడెంలో 38.2, నిడదవోలులో 33.2, గోపాలపురంలో 31.2, ఉండ్రాజవరంలో 30.2, నరసాపురంలో 29.4, ఉండిలో 29.2, ఆకివీడులో 27.8, తణుకులో 28.8, అత్తిలిలో 26.6, కుక్కునూరులో 25.2, మొగల్తూరులో 23.6 మి.మీ వర్షం కురిసింది. చింతలపూడిలో 23.2, పాలకొల్లులో 22.4, ఉంగుటూరులో 22.2, పెంటపాడులో 20.4, పెరవలిలో 18, భీమడోలులో 17.8, కామవరపుకోటలో 17.2, భీమవరంలో 16.8, నల్లజర్లలో 16.0, ఆచంటలో 15.8, పెదపాడులో 15.2, పోడూరులో 14.6, కాళ్లలో 14.4, ఏలూరులో 13.4, వేలేరుపాడు, ద్వారకాతిరుమలలో 12.2 చొప్పున, దెందులూరులో 11.4, తాడేపల్లిగూడెంలో 11, పెనుగొండలో 10.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మూడు రోజులుగా సరాసరి 71.19 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
వరద భయంతో గ్రామాలు ఖాళీ
కుక్కునూరు: గోదావరి వరద పెరుగుతుండటంతో మండలంలోని నదీ పరీవాహక గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే తప్ప పట్టించుకోని గిరిజనులు గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరికకు కూడా చేరకుండానే గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి బ్యాక్ వాటర్ పెరగడం, గోదావరి పోటెత్తడంతో గొమ్ముగూడెం వద్ద అడుగు మేర నీరు పెరిగిందని అంటున్నారు.