higher prices
-
అధిక ధరల సెగ: జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022-23, జూలై-సెప్టెంబర్) నెమ్మదించింది. 2021-22 ఇదే కాలంతో పోల్చితే జీడీపీ విలువ 6.3 శాతం పెరిగింది. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు ఇందుకు ఒక కారణం. కాగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (క్యూ1) జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం, గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4 శాతం కన్నా వృద్ధి వేగం (2.1 శాతం మేర) మందగించడం గమనార్హం. అయితే, ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను మాత్రం భారత్ కొనసాగిస్తోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 3.9 శాతం. భారత్ సాధించిన వృద్ధి రేటుకు మరే దేశమూ చేరుకోకపోవడం గమనార్హం. ఇక మొదటి, రెండు త్రైమాసికాలు కలిపి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీడీపీ వృద్ధి రేటు 9.7శాతం, రెండవ త్రైమాసికంలో 6.1-6.3 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ అంచనాలకు అనుగుణంగానే బుధవారం విడుదల చేసిన గణాంకాలు ఉండడం గమనార్హం. 6.3 శాతం ఎలా అంటే.. 2011-12 స్థిర ధరల ప్రాతిపదిక, వాస్తవిక జీడీపీ విలువ 2021-22 క్యూ2లో రూ.35.89 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.38.17 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే వృద్ధి 6.3 శాతమన్నమాట. వివిధ రంగాల తీరిది స్థూల విలువ జోడింపు (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్- జీవీఏ) ప్రాతిపదికన క్యూ2 వృద్ధి రేటు మాత్రం 5.6శాతం పెరిగి రూ.35.05 లక్షల కోట్లుగా నమోదయ్యింది. వ్యవసాయం: ఆర్థిక వ్యవస్థలో 15శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.2శాతం . తయారీ: ఈ రంగం జీవీఏ మాత్రం 5.6 శాతం (2021 ఇదే కాలంలో) వృద్ధి నుంచి 4.3 శాతం పడిపోయింది. మైనింగ్: ఈ విభాగం కూడా 2.8 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2021 ఇదే కాలంలో ఈ రంగం వృద్ధి రేటు భారీగా 14.5 శాతంగా ఉంది. నిర్మాణం: వృద్ధి 8.1శాతం నుంచి 6.6శాతానికి తగ్గింది. యుటిలిటీ సేవలు: విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవల వృద్ధి రేటు 5.6 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.5 శాతంగా నమోదైంది. సేవలు: మొత్తం జీడీపీలో మెజారిటీ వాటా కలిగిన ఈ విభాగం చూస్తే (ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్) వృద్ధి రేటు 9.6 శాతం నుంచి 14.7 శాతానికి చేరింది.జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...ఎకానమీ పరుగుకు ఢోకా లేదు! అక్టోబర్‌లో 20 నెలల కనిష్టానికి మౌలికం అక్టోబర్‌లో ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం వృద్ధి రేటు 20 నెలల కనిష్టానికి పడిపోయింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే వృద్ధి కేవలం 0.1శాతం గా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, సిమెంట్ రంగాలు క్షీణతను నమోదు చేసుకున్నాయి. ఎరువుల రంగం మాత్రం 5.4శాతం పురోగతి సాధించింది. బొగ్గు విభాగంలో 3.6 శాతం, స్టీల్ రంగంలో 4శాతం వృద్ధి నమోదైతే, విద్యుత్ ఉత్పత్తి వృద్ధి కేవలం 0.4శాతంగా నమోదైంది. 7 శాతం వరకూ వృద్ధి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం 7 శాతం శ్రేణి బాటలో ఉంది. పలు రంగాల్లో రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పండుగల సీజన్లో అమ్మకాలు, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, బ్యాంక్ రుణ వృద్ధి, ఆటో అమ్మకాల గణాంకాలు ఆశావహంగా ఉన్నాయి. -వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
చిన్న ప్యాకెట్.. సూపర్‌హిట్!
న్యూఢిల్లీ: రకరకాల కారణాలతో ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నప్పటికీ ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆ స్థాయిలో ఉత్పత్తుల రేట్లు పెంచలేని పరిస్థితి నెలకొంది. అత్యంత ఆదరణ ఉండే చిన్న ప్యాకెట్ల ధరలను పెంచితే కొనుగోళ్లు తగ్గిపోతాయన్న ఆందోళనతో అవి కస్టమర్లను నిలబెట్టుకోవడానికి రకరకాల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రేట్లు పెంచే బదులు గ్రామేజీ (బరువు)ని తగ్గించి అదే ధరకు సదరు ఉత్పత్తులను అందిస్తున్నాయి. తక్కువ రేటు ఉండే చిన్న ప్యాకెట్లకు (ఎల్‌యూపీ) డిమాండ్ బాగానే ఉండటంతో ఆ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. పలు కంపెనీలు తమ సబ్బులు, నూడుల్స్ మొదలుకుని చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్ల వరకూ వివిధ ఉత్పత్తుల విషయంలో ఇదే వ్యూహం పాటిస్తున్నాయి. వీటితో పాటు మధ్యస్థ రేట్లతో బ్రిడ్జ్ ప్యాక్‌లు ప్రవేశపెట్టడం, పెద్ద ప్యాక్‌లపై ధరల పెంపును సింగిల్ డిజిట్ స్థాయికి పరిమితం చేయడం వంటి ప్రయత్నాలెన్నో చేస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ఒకవైపు ధరలపరమైన చర్యలతో పాటు మరోవైపు వ్యయాల నియంత్రణ కసరత్తుతో ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటోంది. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌యూపీ ప్యాక్‌లు ఎక్కువగా అమ్ముడవుతాయి. వీటి ధర శ్రేణి రూ. 1, రూ. 5, రూ. 10 స్థాయిలో ఉంటుంది. బండగుర్తుల్లాంటి ఈ రేట్లలో మార్పులు చేయలేని పరిస్థితి. అందుకే గ్రామేజీని తగ్గించి అదే రేట్లకు అందిస్తున్నాం. అదే పట్టణ ప్రాంతాల విషయానికొస్తే తలసరి ఆదాయం కాస్త ఎక్కువ. వినియోగదారులకు ఎక్కువ వెచ్చించగలిగే సామర్థ్యాలు ఉంటాయి. అందుకే పెద్ద ప్యాక్‌ల రేట్లను పెంచాము’’ అని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాస్త డబ్బు చేతిలో ఆడేలా చూసుకునేందుకు వినియోగదారులు ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా చౌక ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్న సంకేతాలు తాము గమనించినట్లు పార్లే ప్రోడక్ట్స్ వర్గాలు తెలిపాయి. ఎల్‌యూపీ ప్యాక్‌ల అమ్మకాల్లో పెరుగుదల ఇందుకు నిదర్శనమని వివరించాయి. మార్చి త్రైమాసికం నుంచి మారిన ట్రెండ్.. గతేడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చి క్వార్టర్లో ఇటు పట్టణ అటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరల్లో లభించే చిన్న ప్యాక్‌ల వినియోగం గణనీయంగా పెరిగినట్లు రిటైల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం బిజోమ్ తెలిపింది. వంట నూనెలు వంటి కమోడిటీల ధరలు, ద్రవ్యోల్బణం అసాధారణ స్థాయికి పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులు వీలైనంత వరకూ పర్సులపై భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఎక్కువ పరిమాణంలో సరుకులు కొనుక్కునే వారు కూడా ప్రస్తుతం బడ్జెట్‌కి కట్టుబడి ఉండే ప్రయత్నాల్లో భాగంగానే ఎల్‌యూపీ ప్యాక్‌లవైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నాయి. చాలా మటుకు ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో రూ. 1 నుంచి రూ. 10 వరకూ రేటుతో చిన్న ప్యాక్‌ల వాటా 25–35 శాతం మేర ఉంటోంది. హెచ్‌యూఎల్ వ్యాపారంలో ఇలాంటి చౌక ప్యాక్‌ల విక్రయాలు 30 శాతం వరకూ ఉంటాయి. ఇమామీ అమ్మకాల్లో వీటి వాటా 24 శాతం స్థాయిలో ఉంది. అటు బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో అమ్మకాల్లో రూ. 5, రూ. 10 స్థాయి ప్యాక్‌ల వాటా 50–55 శాతం వాటా ఉంటోంది. అమ్మకాల సంగతి అలా ఉంచితే చిన్న ప్యాక్‌ల విషయంలోనూ కంపెనీలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అబనీష్ రాయ్ వివరించారు. పెద్ద ప్యాక్‌ల రేట్లను పెంచగలిగినప్పటికీ .. తక్కువ ధర యూనిట్లలో నిర్దిష్ట స్థాయికన్నా గ్రామేజీని తగ్గించడానికి వీల్లేదు. దీంతో అవి ప్రత్యేకంగా బ్రిడ్జ్ ప్యాక్‌లు ప్రవేశపెడుతున్నాయి. హెచ్‌యూఎల్, ఇమామీ ఇలాంటి వాటిపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కాస్తంత ఎక్కువ ధరకు, ఎల్యూపీతో పోలిస్తే ఎక్కువ బరువు ఉండటం వల్ల, ఓ మోస్తరు అవసరాల కోసం వినియోగదారులు అనవసరంగా అధిక రేటు పెట్టి పెద్ద ప్యాక్‌లను కొనుక్కోవాల్సిన పరిస్థితి తప్పుతుందని రాయ్ పేర్కొన్నారు. ఇది ఇటు కొనుగోలుదారులు అటు కంపెనీలకూ ప్రయోజనకరంగా ఉంటోందని వివరించారు. -
అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలే: తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ అమల వుతున్న నేపథ్యంలో మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. మాంసం, కోడిగుడ్లు, చేపలను సక్రమంగా సరఫరా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గాను వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, ఇందుకోసం పశుసంవర్ధక, మత్స్య శాఖ, పోలీసు, రవాణా శాఖల అధికారులతో కలిపి జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు. ఈనెల 29న ఆదివారం వివిధ మార్కెట్లలో మాంసం, చికెన్, చేపలు సరిగా అందుబాటులో లేవని, ఉన్న మాంసాన్ని అధిక ధరలకు విక్రయించారనే ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలో మాంసం, చికెన్, చేపల లభ్యత, సరఫరాపై పశుసంవర్ధక శాఖ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన అత్యవసర సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకిల్, పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్, స్నేహ చికెన్ అధినేత రాంరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. లాక్డౌన్ నేపథ్యంలో గొర్రెలు, మేకల సరఫరా లేని కారణంగా మాంసం ధరలు పెరిగాయని చెప్పారు. గొర్రెలు, మేకల సరఫరాకు, విక్రయాలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మాంసం ధరలను నియంత్రిస్తామని, ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికావద్దని హామీ ఇచ్చారు. ప్రత్యేక అనుమతులు ఇస్తాం గొర్రెలు, మేకలను జంట నగరాలకు కానీ, జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాలకు కానీ తీసుకెళ్లి విక్రయించుకునేందుకు అన్ని అనుమతులు ఇస్తామని చెప్పారు. గొర్రెలు, మేకలను తరలించే వాహనాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ అన్ని జిల్లాల ఎస్పీలు, రవాణా శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాయాలని పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రను మంత్రి ఆదేశించారు. మటన్ విక్రయ దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గోశాలల్లో ఉన్న జీవాలకు పశుగ్రాసం కొరత ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే గోశాలల నిర్వాహకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అధికారులను మంత్రి కోరారు. వివిధ నీటి వనరులలో సైజుకు వచ్చిన చేపలను పట్టుకుని మత్స్యకారులు విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ సువర్ణను ఆదేశించారు. హైదరాబాద్‌కు చెందిన చేపల వ్యాపారులు ఎవరైనా ఇతర జిల్లాలకు వెళ్లి చేపలు తీసుకొచ్చి విక్రయించుకోవాలనుకుంటే వారికి కూడా అవసరమైన అనుమతులు ఇస్తామని, చికెన్ దుకాణాల్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు. -
‘సోలార్’కు ఆదిలోనే చుక్కెదురు!
ఎక్కువ ధరలు కోట్ చేయడంతో టెండర్ల రద్దుకు సీఎం ఆదేశం వ్యవసాయశాఖ అభ్యంతరంతో నిలిచిపోయిన ప్రక్రియ బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రయోగాత్మకంగా మంజూరు చేసిన సోలార్ పంప్సెట్ల కొనుగోలుకు ఆరంభంలోనే చుక్కెదురైంది. మార్కెట్లో దొరికే ధర కంటే కంపెనీలు ఎక్కువ రేట్ కోట్ చేసిన అభియోగాలపై టెండర్లను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే టెండర్లను నిలిపివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో టెండర్లకు బ్రేక్ పడింది. కేంద్రప్రభుత్వం జవహర్లాల్ నెరహూ నేషనల్ సోలార్ మిషన్ (జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం) పథకంలో భాగంగా రాష్ట్రానికి 2000 పంప్సెట్లు మంజూరీ చేసింది. ఇందులో వెయ్యి 5 హెచ్‌పీ, మరో వెయ్యి 3 హెచ్‌పీ పంప్ సెట్లున్నాయి. వీటికి 30 శాతం వ్యయాన్ని కేంద్రం సబ్సిడీగా అందిస్తుంది. ఇటీవలే కేంద్రం తమ వాటాగా రూ. 2.76 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు పిలిచి వీటిని కొనుగోలు చేసే బాధ్యతను తెలంగాణ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(టీ.ఎన్ఆర్ఈడీసీఎల్) చేపట్టింది. గత నెలలో ఓపెన్ టెండర్లు పిలవడంతో 69 కంపెనీలు బిడ్లు దాఖలు చేశా యి. 14 కంపెనీలను అర్హతలేనివిగా అధికారులు పక్కనబెట్టారు. 55 కంపెనీలు కోట్‌చేసిన రేట్లలో కనిష్ఠ ధరలను పరిగణనలోకి తీసుకున్న నెడ్‌క్యాప్ అధికారులు, 3 హెచ్‌పీ పంప్‌సెట్‌కు రూ. 3.20 లక్షలు, 5 హెచ్‌పీ పంప్‌సెట్‌కు రూ.4.90 లక్షల ధరలను నిర్ణయించారు. ఆ రేట్లకే పంప్సెట్లు సరఫరా చేసేందుకు సిద్ధపడే కంపెనీలను ఒప్పందానికి ఆహ్వానించింది. అయితే, మార్కెట్లో 5 హెచ్‌పీ పంప్‌సెట్ రేటు రూ.3.20 లక్షలకే లభ్యమవుతోందని వ్యవసాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు టెండర్లను ఆపాలని ఆదేశించింది. ఏపీలోనూ ప్రతిష్టంభన ఏపీలోనూ సోలార్ పంపుసెట్ల పంపిణీలో ప్రతిష్టంభన ఏర్పడింది. టెండర్ల ప్రక్రియ పూర్తికాకుండానే ఆరోపణలు వెల్తువెత్తడంతో ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్.. పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. టెండరుదారులు కోట్ చేసిన దానికన్నా మార్కెట్లో తక్కువ ధరకే సోలార్ పంపుసెట్లు లభిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ వర్గాలకు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో జరిగిన టెండర్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది. సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ(నెడ్‌క్యాప్) ఆధ్వర్యంలో ఇంధన పొదుపులో భాగంగా 2 వేల సోలార్ పంపుసెట్లను మంజూరు చేశారు. దీనికి ఇటీవల టెండర్లు పిలిచారు. దాదాపు 55 కంపెనీలు ఈ ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ ఎల్-1 హోదా పొందిన సంస్థను ఖరారు చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే, ఆ సంస్థ రూ. 4.95 లక్షలు కోట్ చేసినట్టు సమాచారం.