highspeed train
-
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా వస్తున్న ట్రైన్ 18
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి వారణాసి వరకూ నడిచే అత్యాధునిక హైస్పీడ్ ట్రైన్ 18 పేరును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నిర్ణయించినట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. దేశీయ పరిజ్ఞానంతో భారత ఇంజనీర్లు రూపొందించిన ఈ రైలు మేక్ ఇన్ ఇండియా కింద ప్రపంచ స్ధాయి రైళ్ల నిర్మాణం మనకు సాధ్యమవుతుందనేందుకు నిదర్శనమని ఈ సందర్భంగా పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 16 కోచ్‌ల ఈ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలును రూ 97 కోట్ల వ్యయంతో రాయ్‌బరేలిలోని మోడ్రన్ కోచ్ ఫ్యాకర్టీ 18 నెలల పాటు శ్రమించి పట్టాలపైకి ఎక్కించనుంది. 30 సంవత్సరాల కిందట ప్రారంభించిన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ వారసత్వానికి కొనసాగింపుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను భావిస్తున్నారు. పూర్తి ఏసీ సదుపాయం కలిగిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలోనే తొలి ఇంజన్ రహిత రైలుగా గుర్తింపు పొందనుంది. రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లుండే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాన్పూర్, అలహాబాద్లలో ఆగుతుంది. -
భారత్‌లో అత్యంత వేగవంతమైన రైలు ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో తొలి ఇంజన్ రహిత సెమీ హైస్పీడ్ రైలు ట్రైన్-18 గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది. ట్రయల్ రన్లో ఈ మేరకు ట్రైన్ 18 విజయవంతంగా ఈ వేగాన్ని అందుకుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ నిర్ధారిస్తూ ట్వీట్ చేశారు. ట్రైన్ 18 అధికారికంగా భారత్‌లోనే అత్యంత వేగవంతమైన రైలుగా నమోదైందని ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 29న తన నియోజకవర్గం వారణాసిలో ఈ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు ఢిల్లీ స్టేషన్లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు వారణాసి చేరుకుంటుంది. ఇక వారణాసి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాత్రి 10.30 గంటలకు దేశ రాజధానికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో ఈ రైలులో ఫ్లెక్సీ ఫేర్ విధానం ఉండదు. శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే ప్రయాణ చార్జీలు 20 నుంచి 25 శాతం అధికంగా ఉంటాయి. ఇక భోజనంతో పాటు, భోజనం లేకుండా చార్జీలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వేగంతో పాటు అత్యాధునిక, విలాసవంతమైన సదుపాయాలను ఈ రైలులో ఏర్పాటు చేశారు. పూర్తి ఏసీలో ఉండే రైలులో 16 చైర్‌కార్ తరహా కోచ్‌లుండగా, వీటిలో రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్స్ ఉంటాయి. ఆటోమేటిక్ డోర్స్, ఆన్‌బోర్డ్ వైఫై, జీపీఎస్ ఆధారిత సమాచార వ్యవస్థ, ఎల్ఈడీ లైటింగ్ సహా పలు సౌకర్యాలు ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. -
ఢిల్లీ - హర్యానా హైస్పీడ్ రైలు పరుగులు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని సరై కలే ఖాన్ (ఎస్‌కేకే) నుంచి హర్యానా-రాజస్థాన్ సరిహద్దులోని షాహజన్‌పూర్-నీమ్రానా-బెహ్రాద్ వరకూ పరుగులు పెట్టే హైస్పీడ్ రైల్ నెట్వర్క్ ప్రాజెక్టుకు హర్యానా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సగటున గంటకు వంద కిమీ వేగంతో హైస్పీడ్ రైలు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేస్తుంది. దక్షిణ హర్యానా నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణీకులకు ఈ రైలు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు తొలిదశ చేపట్టేందుకు రూ 25,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. కాగా, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థతో గుర్‌గ్రామ్ సహా దక్షిణ హర్యానాలో వృద్ధి అవకాశాలు మెరుగుపడి పెట్టుబడులకు సానుకూల వాతావరణం నెలకొంటుందని కేబినెట్ భేటీ అనంతరం హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) ప్రాజెక్టు హర్యానా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. -
ఒక్క కిలోమీటరు.. వందకోట్లు
న్యూఢిల్లీ: ఒక్క కిలోమీటర్ మార్గానికి వంద కోట్లు ఖర్చవుతాయట. ఇది దేనికని అనుకుంటున్నారా.. అదే నండి మన దేశంలో త్వరలో రూపకల్పన చేయాలనుకుంటున్న హైస్పీడ్ రైలు మార్గానికి. ఈ లెక్కన దేశంలోని అన్ని రైలు మార్గాలను హైస్పీడ్ రైలు పరుగులకు అనుగుణంగా మార్చాలంటే మొత్తం రూ.80 వేల కోట్లు ఖర్చుకానున్నాయి. సోమవారం నాటి ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా లేవనెత్తిన ఓ ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు స్వయంగా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. సాధరణ రైల్వే మార్గానికన్నా పది నుంచి 14 రెట్లు సమర్ధమంతంగా హైస్పీడ్ రైల్వే లైన్లను వేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.