తిరుమల పవిత్రతకు కార్యాచరణ
సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్ల తరబడి ఆలయాల్లో సంప్రదాయంగా కొనసాగుతున్న అనువంశిక వ్యవస్థలను కాపాడుకునేందుకు వివిధ పీఠాధిపతులు, స్వామీజీలు ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమయ్యారు. తిరుమల తిరుపతిలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆలయాల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యాన్ని నివారించాలంటూ హైదరాబాద్లో వారు సమావేశమయ్యారు. మీడియాకు దూరంగా ఉదయం నుండి సాయంత్రం వరకూ సుదీర్ఘంగా చర్చించారు.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ, శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు కమలానంద భారతి స్వామీజీతో పాటు పీఠాధిపతులు ప్రణవాత్మానంద సరస్వతి , మాతా నిర్మలా యోగి భారతి, స్వరూపానందగిరి, చిన్మయానందగిరి , స్థైర్యానంద సరస్వతి , విద్యా గణేషానందస్వామీజీలు పాల్గొన్నారు. ఈ మేరకు వీహెచ్పీ ప్రాంత కార్యదర్శి గాలిరెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.