hit-and-run attack
-
పోలీసుల్ని ఢీకొట్టి.. 20 మీటర్లు ఈడ్చుకెళ్లి!
న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులను ఢీకొట్టిన కారు, వారిని 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలోని వేదాంత్ దేశికా మార్గ్‌లోని బెర్ సరాయ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శనివారం రాత్రి 7.45 గంటల సమయంలో చోటుచేసుకుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్ఐ) ప్రమోద్, హెడ్ కానిస్టేబుల్ శైలేశ్ చౌహాన్ ట్రాఫిక్ ఉల్లంఘనుల వాహనాలకు చలాన్లు రాస్తున్నారు. అదే సమయంలో ఓ కారు రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా వేగంగా దూసుకువచి్చంది. దాంతో శైలేశ్, ప్రమోద్ ఆ కారును ఆపారు. అయితే అది ఒక్కసారిగా స్పీడందుకుని ఇద్దరినీ 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లి మాయమైంది. గాయపడ్డ పోలీసులను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. వారు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారని అధికారులు తెలిపారు. కారు యజమానిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. -
కశ్మీర్లో ఉగ్రదాడి: జవాన్లకు గాయాలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ పట్టణ శివారులో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన హిట్ అండ్ రన్ దాడిలో నలుగురు జవాన్లు గాయపడ్డారు. విధులు నిర్వహిస్తున్న జవాన్లను వాహనంలో ప్రయాణిస్తున్న ఉగ్రవాదులు ఢీకొట్టి పారిపోయారని సైనిక వర్గాలు ప్రకటించారు. గాయపడ్డ నలుగురూ సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్ బీ) విభాగానికి చెందినవారని పేర్కొన్నారు. పారిపోయిన ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భావిస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు అణువణువూ తనిఖీ చేస్తున్నాయి. పాక్ ఆక్రమిత్ కశ్మీర్ లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన తర్వాత ఇప్పటికే భారత్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కశ్మీర్ సహా పాక్ సరిహద్దులోని నాలుగు రాష్ట్రాల్లో బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.