శ్రీనగర్ శివారులో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన హిట్ అండ్ రన్ దాడిలో నలుగురు జవాన్లు గాయపడ్డారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ పట్టణ శివారులో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన హిట్ అండ్ రన్ దాడిలో నలుగురు జవాన్లు గాయపడ్డారు. విధులు నిర్వహిస్తున్న జవాన్లను వాహనంలో ప్రయాణిస్తున్న ఉగ్రవాదులు ఢీకొట్టి పారిపోయారని సైనిక వర్గాలు ప్రకటించారు. గాయపడ్డ నలుగురూ సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్ బీ) విభాగానికి చెందినవారని పేర్కొన్నారు.
పారిపోయిన ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భావిస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు అణువణువూ తనిఖీ చేస్తున్నాయి. పాక్ ఆక్రమిత్ కశ్మీర్ లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన తర్వాత ఇప్పటికే భారత్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కశ్మీర్ సహా పాక్ సరిహద్దులోని నాలుగు రాష్ట్రాల్లో బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.