మళ్లీ ‘హొగ్నెకల్’ రచ్చ
తమిళనాడుతో కయ్యానికి కర్ణాటక మళ్లీ కాలువు దువ్వతోంది. సమసిన హొగ్నెకల్ సరిహద్దు వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చే పనిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పడ్డారు. హొగ్నెకల్ తమదేనని, దీనిపై రీ సర్వే చేయాలని కేంద్రాన్ని కోరుతామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కల్పిస్తున్నాయి.
సాక్షి, చెన్నై : తమిళనాడు-కర్ణాటకల మధ్య వివాదాల కు కొదవ లేదు. అందులో ప్రధానమైనవి కావే రి నదీ జలాల సమస్య, హొగ్నెకల్ సరిహద్దు వ్యవహారమే. కావేరి వివాదంలో తమిళనాడుకు అనుకూలంగా తీర్పు రావడంతో అగ్గిమీద గుగ్గిలంలా కర్ణాటక ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కావేరి జలాల్ని అడ్డుకునే విధంగా తమ రాష్ట్రంలో రెండు డ్యాంల నిర్మాణానికి కసరత్తులు వేగవంతం చేసింది. ఈ వివాదం ఓ వైపు ఉంటే, మరో వివాదంగా సమసిన హొగ్నెకల్ సరిహద్దు రచ్చను మళ్లీ తెర మీదకు తెచ్చే పనిలో పడింది.
2006లో మొదలు
కావేరి నదీ తీరంలో ధర్మపురి జిల్లాలో ఉన్న భారత నయాగరగా పేరెన్నిక గన్న హొగ్నెకల్ జలపాతంపై పూర్తి హక్కుల్ని తమిళనాడు కలిగి ఉంది. కావేరి నదీ తీరాన్ని పరిగణనలోకి తీసుకుని 1998లో అటు కర్ణాటకలో బెంగళూరు తాగునీటి పథకానికి, ఇటు తమిళనాట హొగ్నెకల్ ఉమ్మడి తాగు నీటి పథకానికి చర్యలు చేపట్టారు. 2006లో ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల దాహార్తిని తీర్చే రీతిలో హొగ్నెకల్ పథకానికి శ్రీకారం చుట్టడంతో వివాదం మొదలైంది. హొగ్నెకల్ తమ రాష్ట్రానికి చెందిదంటూ వివాదానికి తెర మీదకు తీసుకురావడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. హొగ్నెకల్ తమదంటే, తమదంటూ రెండు రాష్ట్రాలు వాదులాడుకున్నాయి. చివరకు తమిళనాడు, కర్ణాటక అటవీ శాఖ, నీటి పారుదల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. సరిహద్దు వ్యవహారాన్ని తేల్చుకు నే పనిలో పడ్డారు. బ్రిటీషు పాలకుల హయూం లో రూపకల్పన చేసిన శాసనాల మేరకు సర్వేలు నిర్వహించారు. ఎట్టకేలకు ఈ సర్వేలో హొగ్నెకల్ తమిళనాడుకే చెందుతుందని తేల్చారు.
మళ్లీ తెరపైకి...
తాజాగా సరిహద్దు చర్చను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు క ర్ణాటక పావులు కదుపుతోంది. కర్ణాటకలో సాగుతున్న డ్యాం నిర్మాణ కసరత్తుల వ్యవహారాన్ని దారి మళ్లించే విధంగా హొగ్నెకల్ వివాదాన్ని మళ్లీ తెర మీదకు తెచ్చే పనిలో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య పడ్డట్టున్నారు. మీడియాతో మాట్లాడే క్రమంలో ఆయన హొగ్నెకల్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. హొగ్నెకల్ కర్ణాటక భూ భాగమేనని, సర్వేలు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించారు. రీసర్వేకు పట్టుబడుతూ కేంద్రాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు. ఇది కాస్త ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లోని తమిళ సంఘాల్లో, అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపుతోంది.
మళ్లీ ఉత్కంఠ
సమసి పోయిన వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి తమిళుల మనోభావాలతో చెలగాటం ఆడేం దుకు యత్నిస్తున్న కర్ణాటక చర్యల్ని ఎండగట్టేందుకు ఇక్కడి రాజకీయ పక్షాలూ సమాయత్తం అవుతోన్నాయి. దీంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ ఎక్కడ ఉద్రిక్తత రేగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.