ఆయన మెదడులో ఏమీ లేదు!
న్యూఢిల్లీ: తమ పార్టీ పంజాబ్లో అధికారంలోకి వస్తే అమృత్సర్ను 'పవిత్ర నగరం'గా ప్రకటిస్తామంటూ ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తీవ్రంగా తప్పుబట్టారు. ఓట్ల కోసం తాను ఎంతకైనా దిగుజారుతానని కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలతో నిరూపించుకున్నారని కట్జూ తాజా ఫేస్బుక్ పోస్టులో మండిపడ్డారు. కేజ్రీవాల్ వట్టి వాక్శూరుడని, ఆయన మెదడులో ఏమీ లేదని, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారేందుకు ఆయన సిద్ధంగా ఉంటారని ఈ వ్యాఖ్యలతో రుజువైందని జస్టిస్ కట్జూ విమర్శించారు.
పంజాబ్లో ఆప్ అధికారంలోకి వస్తే అమృత్సర్, ఆనందపూర్ సాహిబ్ నగరాలను 'పవిత్ర నగరాలు'గా ప్రకటిస్తామని, అంతేకాకుండా అమృత్సర్ నగర పరిధిలో మద్యం, మాంసం, ధూమపానం సేవనాన్ని నిషేధిస్తామని కేజ్రీవాల్ తాజాగా హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ ఇచ్చిన ఇలాంటి హామీల వల్ల అలహాబాద్ (ప్రయాగ), వారణాసి, అయోధ్య, మధుర, పూరి, అజ్మీర్, హరిద్వార్ వంటి నగరాల నుంచి ఇలాంటి డిమాండ్లు వచ్చే అవకాశముందని, ఇది ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీయవచ్చునని ఆయన పేర్కొన్నారు. మతం పేరిట ఇలాంటి హామీలు ఇవ్వడం చక్కగా ఓట్లు రాబట్టుకోవడానికి ఉపయోగపడతాయేమో కానీ, ఇవి దేశ లౌకిక స్వభావాన్నిదెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.