Hotel Management Course
-
ఆగని బతుకు చక్రం
జీవితం ఎప్పుడూ పచ్చగా ఉండాలి. జీవితాన్ని మోడువార్చే వైపరీత్యాలు ఎన్ని ఎదురైనా వాటిని ఎదుర్కొని కొత్త దారులు వేసుకుంటూ ఎప్పటికప్పుడు జీవితాన్ని కొత్తగా చిగురింప చేసుకుంటూ ఉండాలి. కోవిడ్ 19 జీవితాలను అతలాకుతలం చేసింది. జీవికలనే ప్రశ్నార్థకం చేసింది. ఎన్ని ప్రశ్నార్థకాలు ఎదురైనా వెనుకడుగు వేయాల్సిన పని లేదని నిరూపిస్తున్నారు కేరళవాసులు. పనిని గౌరవించే సంస్కృతే వారిని నిలబెడుతోంది. ముందుంది మంచికాలం అజ్మల్‌కి 28 ఏళ్లు. అతడిది కేరళలోని కొట్టాయం. కోస్టా క్రూయిజ్‌లో షెఫ్‌గా ఉద్యోగం చేయాలనేది అతడి కల. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరినప్పటి నుంచి కన్న కల అది. అతడి ఫ్రెండ్స్‌కి అందులో ఉద్యోగం వచ్చింది. అజ్మల్‌కి రాలేదు. దాంతో కొట్టాయంలోనే ఒక స్టార్ హోటల్లో ఉద్యోగం చేస్తూ మళ్లీ ప్రయత్నించాడు. గత ఏడాది చివరిలో సెలెక్ట్ అయ్యాడు. కొట్టాయంలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది మార్చిలో విదేశాల బాట పట్టాల్సిన వాడు. ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కానీ కోవిడ్ మహమ్మారి అతడి రెక్కలను కట్టేసింది. కోస్టా కంపెనీ నుంచి ఈ మెయిల్ వచ్చింది. కోవిడ్ కారణంగా తలెత్తిన పరిస్థితిని వివరిస్తూ తమ నిస్సహాయతను వ్యక్తం చేసింది. కనీసం ఏడాదిపాటు ఎదురు చూడాలని సూచించింది కోస్టా క్రూయిజ్ కంపెనీ. ఖాళీగా ఉండడంతో పిచ్చిపట్టినట్లయిందతడికి. దాంతో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. తోపుడు బండి మీద కూరగాయలమ్ముతున్నాడు. ‘‘పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం ఉంది. అప్పటి వరకు ఊరికే ఉండకూడదు. ఏదో ఒక పని చేయాలి’’ అని ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నాడు అజ్మల్. హాస్టల్‌కి లాక్డౌన్ కోళికోద్‌కు చెందిన ప్రీతి సంతోష్‌కి ఇది తొలి కష్టం కాదు. ఆమె భర్త ఐదేళ్ల కిందట యాక్సిడెంట్లో పోయాడు. అప్పటి నుంచి నలుగురున్న ఆ కుటుంబ భారం ఆమెదే. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టింది. తొంభై మందితో హాస్టల్ సజావుగానే నడుస్తోంది. జీవిత నావ కూడా ఒడిదొడుకులు లేకుండా నడుస్తుందనే నమ్మకం ఏర్పడింది ఆమెకి. ఇంతలో 2020 వచ్చింది, కోవిడ్ ఇండియాకి వచ్చి విస్తరించింది. లాక్‌డౌన్‌తో హాస్టల్‌కు లాక్ పడింది. ఏదో ఒకటి చేసి బతుకును కొనసాగించాలనుకున్నాడు. అప్పటికే రైతులు పండించిన కూరగాయలు పెద్ద మార్కెట్లకు తరలించడానికి వీలు లేకుండా రవాణా స్తంభించి పోయి ఉంది. అప్పుడు ప్రీతి తన ఇంటి ముందు కూరగాయల దుకాణం పెట్టింది. సమీపంలో ఉన్న రైతులు కూరగాయలను స్వయంగా తెచ్చి ఇస్తారు. ఆ తాజా కూరగాయలే ఆమె జీవితాన్ని చిగురింపచేస్తున్నాయి. ఏసీ షోరూమ్‌ల ధరలతో పోలిస్తే ప్రీతి దగ్గర కూరగాయల ధర బాగా తక్కువగా ఉండడంతో ఆమె వ్యాపారం బాగా సాగుతోంది. చేదెక్కిన దుబాయ్ కాఫీ కరీమ్ తన స్నేహితుడితో కలిసి 2019 మొదట్లో దుబాయ్‌లో చిన్న కాఫీ షాప్ పెట్టాడు. కొద్ది నెలల్లోనే కాఫీ వ్యాపారం గాడిన పడింది. ఒకసారి ఇండియాకి వచ్చి వెళ్దామనుకున్నాడు. గత ఏడాది చివర్లో ఇండియాకి వచ్చాడు. ఈ ఏడాది జనవరిలో తిరిగి వెళ్లాలనుకున్నాడు. కానీ అమ్మ అనారోగ్యం వల్ల మరికొన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. ఇంతలో కోవిడ్ వచ్చింది. ఇక దుబాయ్‌కి వెళ్లేదెప్పుడో చెప్పగలిగిన వాళ్లెవరూ లేరిప్పుడు. కరీమ్ ఇప్పుడు చేపల వ్యాపారం చేస్తున్నాడు. బైక్ మీద చేపల ట్యాంక్ పెట్టుకుని వీథి వీథి తిరిగి తాజా చేపలను అమ్ముతున్నాడు. ఆదుకుంటున్న అప్పడాలు కృష్ణదాస్ ఎనిమిదేళ్లుగా కోళికోద్లో ఆటో నడిపేవాడు. లాక్‌డౌన్‌తో ఆటో ఆగిపోయింది. అతడు వెంటనే అప్పడాల తయారీ చేపట్టాడు. ఇప్పుడు రోజుకు ఐదు వందల అప్పడాలు అమ్ముతున్నాడు. లాక్డౌన్ సడలించిన తర్వాత తిరిగి ఆటో బయటకు తీశాడు. కానీ ఆటో ఎక్కేవాళ్లు లేక రోజుకు వంద రూపాయలు రావడమే గగనమైంది. దాంతో తిరిగి ఆటోను పక్కన పెట్టేశాడు. ఆటో చక్రం ఆగినా సరే బతుకు చక్రం ఆగకూడదు. ఒకదారి మూసుకుపోతే మరోదారిని వెతుక్కోవాలి. ఇప్పుడతడికి అప్పడాలే అన్నం పెడుతున్నాయి. దాంతో అప్పడాల తయారీని మరింతగా విస్తరించే ఆలోచనలో ఉన్నాడు కృష్ణదాస్. -
బుల్లెట్‌పై వంటలు.. రుచి చూడాల్సిందే!
సాక్షి, నిజామాబాద్: నగరానికి చెందిన వినయ్ హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందాడు. అనంతరం ఉద్యోగం కాకుండా వినూత్న ఆలోచనతో స్వయం ఉపాధి పొందుతున్నాడు. బుల్లెట్ బైక్‌పై పొయ్యిని అమర్చి దానిపై చికెన్‌టిక్కా, లెగ్‌పీస్, బ్రేరీబ్రేరి స్టిప్స్, గ్రీల్ పైనాపిల్, క్రిస్పీకార్న్, చికెన్‌కాసాడీయా వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేస్తున్నాడు. ఈ వంటకాలు రూ.30 నుంచి 90 వరకు లభిస్తాయని వినయ్ తెలిపారు. నగరంలోని ఎల్లమ్మ గుట్టపై తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. బుల్లెట్ బైక్‌ను తన జీవనాధారంగా మార్చుకొని, పసందైన వంటకాలను అందిస్తు ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. (బుల్లితెర ‘గుండన్న’ మనోడే) –సాక్షి ఫొటోగ్రాఫర్–నిజామాబాద్ -
కెరీర్ కౌన్సెలింగ్
హోటల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి? - సాగర్, విజయవాడ హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్.. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఎస్సీ అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్ లేదా 10+2 ప్రవేశం: ప్రవేశపరీక్ష ఆధారంగా. వెబ్సైట్: www.ihmhyd.org హైదరాబాద్‌లోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా.. హోటల్ మేనేజ్మెంట్లో వివిధ కోర్సులను అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్/10+2 ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా వెబ్సైట్: iactchefacademy.com యానిమేషన్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి? - రాంమోహన్,విజయవాడ జేఎన్టీయూహెచ్కు అనుబంధంగా ఉన్న హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్.. యానిమేషన్లో డిగ్రీని అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్/10+2 వెబ్సైట్: www.iacg.co.in హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా.. యానిమేషన్, వీఎఫ్ఎక్స్లో డిగ్రీని అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్/10+2 వెబ్సైట్: www.aisfm.edu.in ఐఐఎస్సీ (బెంగళూరు) నుంచి పీహెచ్డీ చేయడం ఎలా? - ధరణి, సికింద్రాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు.. నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్డీ, ఇంటిగ్రే టెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తోంది. పీహెచ్డీ కోర్సులకు సీఎస్ఐఆర్-నెట్ జేఆర్ఎఫ్/డీబీటీ జేఆర్ఎఫ్/ ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్; జెస్ట్, ఎన్బీహెచ్ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్/ గేట్లో స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు వివరాలకు: www.iisc.ernet.in మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన ఈ-మెయిల్: sakshieducation@gmail.com -
‘తీహార్’లో రెస్టారెంట్
న్యూఢిల్లీ:తీహార్ సెమీ ఓపెన్ కారాగారంలో రెస్టారెంట్ ఏర్పాటైంది. కారాగారం అధికారులు ఇప్పటికే కొందరు ఖైదీలకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు నేర్పారు. ప్రస్తుతం వారితోనే వంట తదితర కార్యకలాపాలను లాంఛనంగా నిర్వహిస్తున్నారు. ఖైదీలే మున్ముందు భోజనం వడ్డించనున్నారు. ఈ రెస్టారెంట్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే దీనిని పూర్తిస్థాయిలో ప్రారంభించాల్సి ఉంది. ఈ విషయమై తీహార్ కారాగారం ప్రజాసంబంధాల అధికారి సునీల్‌గుప్తా మాట్లాడుతూ ‘చవక ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందించాలనేది మా లక్ష్యం. పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొందరు ఖైదీలకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో శిక్షణ ఇచ్చాం. దీంతో వారంతా తమ నైపుణాన్ని, ప్రతిభాపాటవాలను వినియోగిస్తూ ఇందులో పనిచేస్తున్నారు. హేయమైన నేరాలకు పాల్పడకపోవడంతోపాటు సత్పప్రవర్తన కలిగిన ఖైదీలకే ఈ కోర్సు నేర్పించామన్నారు. దీంతోపాటు మానసికంగా సరిగా ఉన్నవారినే ఇందుకు ఎంపిక చేశామని, వారికే శిక్షణ ఇచ్చి హోటల్ విధుల్లోకి తీసుకున్నామన్నారు. 12 సంవత్సరాలకంటే తక్కువ శిక్ష పడిన వారినే ఈ హోటల్ కార్యకలాపాలకు ఎంపిక చేశామన్నారు. అంతకంటే ఎక్కువ ఉన్నవారిని తీసుకోలేదన్నారు. ఈ రెస్టారెంట్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని, నాణ్యమైన ఆహారం లభిస్తుండడంతో కొనుగోలుదారుల సంఖ్య నానాటికీ పెరుగు కుంటామన్నారు. ఈ రెస్టారెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖైదీల సంక్షేమం కోసం వినియోగిస్తామన్నారు. ఈ రెస్టారెంట్లో 50 మంది కూర్చునేందుకు వెసులుబాటు ఉందన్నారు. కాగా ఈ రెస్టారెంట్ ఉదయం పది గంటలనుంచి రాత్రి పది గంటలవరకూ తెరిచేఉంటుంది. కిలోమీటర్ పరిధిలో కొనుగోలుదారులకు డె లివరీ సదుపాయం కూడా ఉంది. శిక్షణ పొందిన మహిళలు టిఫిన్లతోపాటు భోజనం తయారుచేస్తారన్నారు. వీటి కనీస ధర రూ. 40గా నిర్ణయించామన్నారు. దీంతోపాటు చపాతీలు కూడా తయారు చేస్తారన్నారు. నాణ్యతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. పౌష్టికాహారానికే ప్రాధాన్యమిస్తామన్నారు. మహిళలకు శిక్షణ కోసం స్థానిక లజ్‌పత్‌నగర్‌లోని ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ సంస్థ సహకారం తీసుకున్నామన్నారు. ఈ సంస్థ సభ్యులు ఇందులో పనిచేసే మహిళలకు నాణ్యమైన ఆహార పదార్థాల తయారీలో శిక్షణ ఇస్తారన్నారు. ప్రవర్తనలో మార్పుకోసం హేపీనెస్ ప్రోగ్రాం ఖైదీల్లో పరివర్తన కోసం తీహార్ కారాగారం అధికారులు సరికొత్త యోచన చేశారు. ఇందుకోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సహకారం తీసుకుని శిక్షణా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఢిల్లీ కారాగార విభాగం డెరైక్టర్ జనరల్ విమలా మెహ్రా వెల్లడించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ శిక్షణ కార్యక్రమానికి సమ్మతించిందన్నారు. ఆధ్యాత్మిక గురువులతో ఖైదీలకు ప్రవచనాలు కూడా బోధింపజేస్తామన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమానికి ఖైదీలను సన్నద్ధం చేయాల్సిందిగా కారాగార విభాగం సూపరింటెండెంట్‌ను ఆదేశించామన్నారు. మరోసారి నేరాలపై వీరి మనసు మరలకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. అదేవిధంగా నేరాలు చేయాలంటూ ఇతరులను వీరు ప్రేరేపించకుండా చేయడంపైకూడా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఎయిమ్స్‌కు చెందిన సైక్రియాటిస్టులు కూడా హాజరవుతారన్నారు. గత ఏడాది డిసెంబర్లో కూడా ఇదేవిధంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థతో కలసి ఖైదీల్లో మానసిక పరివర్తన కోసం కౌన్సిలింగ్ తదితర కార్యక్రమాలను కూడా పెద్దఎత్తున నిర్వహించామని ఆయన మీడియాకు వివరించారు.