huge salaries
-
స్టార్టప్ ధమాకా..!
⇒ కొత్త కంపెనీల కోసం తిరిగి వస్తున్న ఎన్నారైలు ⇒ భారీ వేతనాలు, వాటా ఆఫర్లతో మరికొందరు ⇒ వేతనాల పెంపులో మన స్టార్టప్‌లే మేటి ⇒ కొత్త కంపెనీల ఏర్పాటులో ముందున్న హైదరాబాదీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అప్పుడెప్పుడో డాట్‌కామ్ బూమ్. అంతా ఆ మత్తులో ఉండగానే బుడగ బద్దలయింది. ఎన్నెన్నో కంపెనీలు... కొన్ని లక్షల కోట్లు నష్టపోయాయి. లక్షల మంది రోడ్డునపడ్డారు. కాకపోతే ఈ చెడులోనూ ఓ మంచి జరిగింది. అదేంటంటే... ఆ డాట్ కామ్ల వల్ల వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం చాలామందికి అందుబాటులోకి వచ్చింది. తరవాత ఆ ఇంటర్నెట్ చేసిన మాయాజాలం అంతా ఇంతా కాదు. యావత్ ప్రపంచ గతినే మార్చేసిన ఐటీ బూమ్‌కు బాటలు వేసింది. ఇదేమీ బద్దలయ్యే బూమ్ కాదని రోజురోజుకూ అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానమే స్పష్టంగా చెబుతోంది. ఇపుడు ఆ ఐటీ నుంచి పుట్టుకొచ్చిందే స్టార్టప్ బూమ్. చేతిలో ఏమీ లేకున్నా బుర్రకు పదును పెట్టి కంపెనీలు ఆరంభించేస్తున్నారు. అదే స్టార్టప్ బూమ్. దీంతో జరుగుతున్న మరో మేలేమిటంటే... ఉద్యోగాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయ యువత తిరిగి వస్తున్నారు. అదే అతిపెద్ద న్యూస్. సొంత కంపెనీ పెట్టడం... వేరొకరు పెట్టిన కొత్త కంపెనీలో భారీ వేతనంతో చేరటం... కారణాలేమైనా ప్రవాసం వెళ్లిన భారతీయ ఇంజనీర్లిప్పుడు స్వదేశానికి తిరిగొస్తున్నారు. ఇండియాకు తిరిగి వచ్చి తమ నైపుణ్యాన్ని, సేవలను దేశానికందించే ప్రవాసులకు తగిన గుర్తింపు ఇస్తామని, వారి ఆదాయానికి ఎలాంటి దిగులూ ఉండదని సాక్షాత్తూ భారత ప్రధానే ప్రకటించటంతో ఈ సీన్ రివర్స్ మరింత ఉత్సాహాన్ని నింపుతోందనేది నిపుణుల మాట. ‘‘ప్రస్తుతం దేశంలో 30,000 నుంచి 35,000 వరకు స్టార్టప్స్ సంస్థలున్నాయి. ఇందులో 2,000 నుంచి 3,000 కంపెనీలు మాత్రమే భారీ పెట్టుబడులతో స్థిరపడ్డాయి. మరో 1,000 కంపెనీలు నిధుల సమీకరణలో ఉన్నాయి. స్టార్టప్స్‌లో అధికభాగం ఈ కామర్స్ రంగానివే. 25-30% ఈ విభాగానివే కాగా సేవా రంగంలో 22%, టెక్నాలజీ విభాగంలో 20%, విద్యా రంగంలో 18%, వైద్య రంగంలో 10-15% వరకు కార్యకలాపాలు సాగిస్తున్నాయి’’ అని లెమన్ ఐడియాస్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఐడియా ఫార్మర్ దీపక్ మొనారియా చెప్పారు. స్టార్టప్స్ కంపెనీల స్థాపన, నిర్వహణ, నిధుల సమీకరణ వంటి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు తొలిసారిగా శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది లెమన్ సంస్థ. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో మాట్లాడారు. నాగ్‌పూర్‌లో 9 నెలల పాటు సాగే ఈ శిక్షణ రుసుము రూ.2.95 లక్షలు. ఇంక్రిమొంట్లు, విదేశీ టూర్లు... స్టార్టప్ కంపెనీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే ఉద్యోగులకు ఆకాశమే హద్దు. ఉద్యోగులను ఎంత బాగా చూసుకుంటే వారు అంత ఉత్సాహంగా పనిచేస్తారని స్టార్టప్ సంస్థలు నమ్ముతున్నాయి. దీంతో తమ ఉద్యోగులకు వేతనాల పెంపు మాత్రమే కాదు... ఇంక్రిమెంట్లు, ఫారిన్ ట్రిప్పులను కూడా అందిస్తున్నాయి. స్టార్టప్స్ కంపెనీల్లో ప్రత్యేకించి టెక్నికల్, ప్రొఫిషనల్ ఉద్యోగులకే జీతాల పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు ఇటీవలి సర్వేలో తేలింది. ప్రొఫెషనల్/టెక్నికల్స్ ఉద్యోగులకు 12.1% వేతనాలు పెరిగితే.. సీనియర్స్/టాప్ మేనేజ్మెంట్కు 9.6%, మిడిల్ మేనేజ్మెంట్కు 10.5%, క్లరికల్ సిబ్బందికి 10.6%, ఇతరులకు 9.1% మేర వేతనాలు పెరిగాయి. ఈ ఏడాది కొన్ని స్టార్టప్‌లు ఉద్యోగులకిచ్చిన ఆఫర్లు ఇవీ... ⇒ బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ‘ఊకర్’... తమ ఉద్యోగులకు 120% ఇంక్రిమెంట్లను, ఉత్తమ పనితీరును కనబర్చిన మొదటి 7 గురు ఉద్యోగులకు మాల్దీవుల ట్రిప్‌ను ఆఫర్ చేసింది. ⇒ మొబైల్ కామర్స్‌లో వేగంగా ఎదుగుతున్న ‘పేటీఎం’... ఉత్తమ పనితీరు కనబర్చిన ఉద్యోగులకు గతేడాది 20-25 శాతం బోనస్‌లను ఇస్తే... ఈ ఏడాది ఆ శాతాన్ని 50కి పెంచింది. ⇒ షాప్‌క్లూస్ సంస్థ ఉత్తమ పనితీరుకనబర్చిన వారికి 40%వరకూ వేతనాలు పెంచడమే కాకుండా ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ) కింద వాటాలు, బోనస్‌లను కూడా అందిస్తోంది. ⇒ ‘మైరిఫర్స్’ సంస్థ జీతాల్లో ఆర్థ సంవత్సరానికి 15-25 శాతం పెరుగుదలను ప్రకటించింది. ⇒ వింగిఫై, టాలెంట్ప్యాడ్లు 40-50% వేతనాలను పెంచాయి. హైదరాబాదీలు ఎక్కువే.. స్వదేశానికి తిరిగొస్తున్న ప్రవాసుల జాబితాలో హైదరాబాదీలు తక్కువేమీ కాదు. హలోకర్రీ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజు భూపతి... సీఎస్సీలో డెరైక్టర్ హోదాలో పనిచేశారు. యూఎస్, యూకేల్లో కూడా విధులు నిర్వర్తించారు. ఉద్యోగం వదిలే సమయానికి ఆయన వార్షిక వేతనం రూ.1.5 కోట్లు. 2013లో ఉద్యోగానికి రాజీనామా చేసి హలోకర్రీని ఏర్పాటు చేశారు. ఇక అమెరికాలో పేటెంట్ ఆఫీసర్‌గా పనిచేసిన క్రిస్పి లారెన్స్.. స్వదేశానికి తిరిగొచ్చి హైదరాబాద్‌లో డుకెర్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. లేచల్ బ్రాండ్‌తో జీపీఎస్ టెక్నాలజీతో పనిచేసే బూట్లను ఉత్పత్తి చేస్తున్నారు. అమెరికన్ టెలికం కంపెనీలో నార్త్ అమెరికా మేనేజర్‌గా పనిచేసిన కిరణ్ కలకుంట్ల ఉద్యోగానికి టాటా చెప్పేసి... ఇక్కడికొచ్చి ‘ఈకిన్ కేర్’ సంస్థను ఆరంభించారు. అమెరికాలోని నాలెడ్జ్ యూనివర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న హరివర్మదీ ఇదే దారి. ఇక్కడికొచ్చేసి క్రియాలెర్నింగ్ సంస్థను స్థాపించి విద్యా రంగంలో పెనుమార్పులకు కృషి చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది స్టార్టప్స్‌లో వేతనాల పెరుగుదల విషయంలో మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలను ఇండియా దాటేసే అవకాశముందని అయాన్ హెవిట్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశీయ స్టార్టప్స్ కంపెనీల్లో 13.6% మేర వేతనాలు పెరిగే అవకాశముందని దీన్లో తేలింది. -
ఏడోసారీ రూ.15 కోట్లే
రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ వార్షిక జీతభత్యాలు న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ వరుసగా ఏడో ఏడాది తన జీతభత్యాలను రూ. 15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన అంబానీ 2008-09 నుంచి ఈ విధానం పాటిస్తున్నారు. అప్పట్లో సీఈవోల భారీ వేతనాలపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల అంబానీ ఏటా రూ. 24 కోట్లు వదులుకుంటున్నట్లవుతోంది. రూ. 38.86 కోట్ల మేర జీతభత్యాలు, కమీషన్ కింద అందుకునేందుకు అనుమతులు ఉన్నప్పటికీ .. ఒక మోస్తరు స్థాయికే కట్టుబడి ఉండటానికి ఆయన మొగ్గు చూపుతున్నారని 2014-15 ఆర్థిక సంవత్సర ఫలితాల వెల్లడిలో కంపెనీ పేర్కొంది. జీతం కింద రూ. 4.16 కోట్లు, ఇతర భత్యాల కింద రూ. 60 లక్షలు, రిటైర్మెంట్ ప్రయోజనాల కింద రూ. 82 లక్షలు, లాభాలపై కమీషన్లు రూ. 9.42 కోట్లు అంబానీ అందుకున్నారు. మరోవైపు, ముఖ్య అధికార్లలో ఒకరైన ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పీఎంఎస్ ప్రసాద్ వేతనం ఎలాంటి మార్పులు లేకుండా రూ. 6.03 కోట్లుగా ఉంది. ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ.. నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ హోదాలో రూ. 5 లక్షలు సిట్టింగ్ ఫీజు కింద, రూ. 78.64 లక్షలు కమీషన్ కింద అందుకున్నారు. -
ప్రచార వ్యూహకర్త.. మీడియా ప్లానర్
ఏదైనా ఉత్పత్తి గురించి వినియోగదారులకు తెలియాలంటే ఏకైక మార్గం.. ప్రచారం. సరైన పబ్లిసిటీ లేకపోతే ఎంతగొప్ప వస్తువుకైనా మార్కెట్లో ఆదరణ లభించదు. తమ ఉత్పత్తుల అమ్మకాలు పెరగడానికి, తద్వారా లాభాలు ఆర్జించడానికి కంపెనీలు ప్రచారాన్నే నమ్ముకుంటాయి. అయితే, ఏ వస్తువు వినియోగదారులు ఎక్కడున్నారు? టార్గెట్ గ్రూప్‌ను ఆకర్షించడం ఎలా? ఏయే మాధ్యమాల ద్వారా వారికి చేరువ కావాలి? అనే విషయాలు అందరికీ తెలియవు. తమ పరిశోధనతో వీటిని తెలియజేసి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసే నిపుణులే.. మీడియా ప్లానర్లు. ప్రచార సంస్థ(అడ్వర్టైజింగ్ ఏజెన్సీ)కు వెన్నెముకలాంటివారు మీడియా ప్లానర్లు. ప్రపంచవ్యాప్తంగా వస్తూత్పత్తుల మార్కెటింగ్ విస్తరిస్తుండడంతో వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్లానర్లకు భారీ వేతనాలు పబ్లిసిటీకి ఒకప్పుడు పత్రికలు, టీవీలు, రేడియోలు, హోర్డింగ్‌లే ప్రధాన మార్గం. ఆధునిక కాలంలో ఇది కొత్తపుంతలు తొక్కుతోంది. కంప్యూటర్లు, సెల్ఫోన్లలో ఉత్పత్తుల ప్రచారం సాగుతోంది. ఏ వస్తువును ఏ మాధ్యమం ద్వారా పబ్లిసిటీ చేస్తే ప్రజలకు చేరుతుందో మీడియా ప్లానర్ పసిగట్టాలి. తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం జరిగేలా చూడాలి. మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలిస్తూ ప్రచారం ద్వారా ఉత్పత్తుల అమ్మకాలు పెరగడానికి వ్యూహాలు రూపొందించాలి. సృజనాత్మకతతో కూడిన పబ్లిసిటీతో వినియోగదారుల ఆలోచనలను మార్చగలిగే శక్తి మీడియా ప్లానర్‌కు ఉండాలి. వీరికి ప్రస్తుతం మార్కెటింగ్ కంపెనీలు, మీడియా ఏజెన్సీలు, టీవీ ఛానళ్లు, వెబ్సైట్లు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో వేతనాలు భారీగానే ఉంటాయి. వృత్తిలో తగిన నైపుణ్యం, అనుభవం సంపాదిస్తే నెలకు రూ.లక్షల్లోనే అందుకోవచ్చు. సొంతంగా కమ్యూనికేషన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ అధిక ఆదాయం ఆర్జించొచ్చు. కావాల్సిన స్కిల్స్: మీడియా ప్లానింగ్‌లో ఒత్తిళ్లు, సవాళ్లు ఎక్కువగా ఉంటాయి. పనిలో డెడ్లైన్లు ఉంటాయి కాబట్టి వాటిని చేరుకోవడానికి అధికంగా శ్రమించాలి. ప్లానర్లకు ఆర్గనైజేషనల్, ఇంటర్‌పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. నాయకత్వ లక్షణాలు అవసరం. రిపోర్ట్లు, ప్రజంటేషన్లను రూపొందించడంలో నైపుణ్యం ఉండాలి. ఆధునిక సమాచార సాంకేతిక విజ్ఞానంపై అవగాహన ముఖ్యం. అర్హతలు: మీడియా ప్లానింగ్ స్పెషలైజేషన్‌గా అడ్వర్టైజింగ్ కోర్సులు పూర్తిచేసినవారు ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. ఇంటర్మీడియెట్ అర్హతతో ఈ కోర్సుల్లో చేరొచ్చు. మార్కెటింగ్ స్పెషలైజేషన్‌గా ఎంబీఏ చదివినవారు కూడా మీడియా ప్లానర్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. వేతనాలు: మీడియా ట్రైనీకి ప్రారంభంలో రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభిస్తుంది. మీడియా ప్లానర్‌గా ఈ రంగంలో ఎనిమిదేళ్ల అనుభవం సంపాదిస్తే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షిక ప్యాకేజీ అందుతుంది. 15 ఏళ్ల తర్వాత ఇది రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెరుగుతుంది. సూపర్ సీనియర్/టాప్ మేనేజ్మెంట్ స్థాయికి చేరుకుంటే ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.కోటి అందుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.iimc.nic.in ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ -అహ్మదాబాద్ వెబ్సైట్: www.mica.ac.in సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ వెబ్సైట్: ఠీఠీఠీ.టజీఝఛి.్ఛఛీఠ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వర్టైజింగ్-ఢిల్లీ వెబ్సైట్: www.niaindia.org జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ వెబ్సైట్: www.xaviercomm.org నార్సీమోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వెబ్సైట్: www.nmims.edu కంపెనీకి, మీడియాకు మధ్య వారధి! ‘‘సంస్థలు చేపట్టే నూతన కార్యక్రమాల సమాచారం, కంపెనీ సాధించిన విజయాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చేరవేస్తూ మీడియా ప్లానర్స్ వారధిలా పనిచేస్తున్నారు. సంస్థల సేవలు, ఉత్పత్తుల పబ్లిసిటీలోనూ వీరిదే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో మీడియా ప్లానర్స్‌గా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. కంపెనీ చైర్మన్, ఎండీ, సీఈఓ, బోర్డు సభ్యులతో నిత్యం సంప్రదిస్తూ కంపెనీ తరఫున మీడియాకు సమాచారాన్ని అందిస్తారు. సంస్థకు సంబంధించిన వార్తల ప్రచురణను పర్యవేక్షిస్తారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు మీడియా మేనేజ్మెంట్ కోర్సులో భాగంగా మీడియా ప్లానింగ్‌ను అభ్యసించొచ్చు. మాస్ కమ్యూనికేషన్, అడ్వర్టైజింగ్, ఎంబీఏ కోర్సులు అభ్యసించిన వారు కూడా మీడియా ప్లానర్‌గా కెరీర్ ఎంచుకోవచ్చు. మీడియా ప్లానర్‌గా రాణించాలంటే మార్కెట్ అధ్యయనం, బిజినెస్ డెవలప్మెంట్, ఆర్గనైజేషన్ ఆర్థిక వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలి. మీడియా ప్లానర్‌కు మంచి నెట్వర్కింగ్ నైపుణ్యాలు తప్పనిసరి. అలాగే మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు వివిధ భాషల్లో అనర్గళంగా మాట్లాడే నేర్పు ఉండాలి’’ - ప్రమోద్ మిట్టా, మేనేజర్, మీడియా రిలేషన్స్, ఎయిర్ కోస్టా కాంపిటీటివ్ కౌన్సెలింగ్ పోటీపరీక్షల్లో ‘విద్యుత్’ నుంచి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతారు? - పి.నాగరాజు, అశోక్‌నగర్ భౌతిక శాస్త్రంలో ‘విద్యుత్’ పాఠ్యాంశం చాలా విస్తృతమైంది. దీన్ని ప్రణాళికా బద్ధంగా చదవాలి. ముఖ్యంగా విద్యుత్ పొటెన్షియల్, నిరోధాల శ్రేణి, సమాంతర సంధానాలపై సమస్యలను సాధన చేయాలి. కానిస్టేబుల్ పరీక్షల కోసం 6 నుంచి పదోతరగతి వరకు భౌతికశాస్త్ర పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఓమ్ నియమం, నిరోధ నియమాలు, విద్యుదయస్కాంత ఫలితాలు, వాటి అనువర్తనాలు, విద్యుదయస్కాంత ప్రేరణ అనువర్తనాలు ప్రధానమైనవి. ఓమ్ నియమం, లెంజ్ నియమం, ఫ్లెమింగ్ కుడిచేతి నిబంధన, ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధన, ఫారడే విద్యుద్విశ్లేషణ తదితర నియమాలను నేర్చుకోవాలి. విద్యుత్ మోటారు, విద్యుత్ జనరేటర్ వంటి వాటి నిర్మాణం, అవి పనిచేసే విధానంలోని సూత్రాలపై కూడా ప్రశ్నలు ఇస్తారు. ముఖ్యమైన సూత్రాలను గుర్తుంచుకోవాలి. రాశుల ప్రమాణాలను నేర్చుకోవాలి. ఉదా: కరెంటు- ఆంపియర్; పొటెన్షియల్ భేదం- వోల్ట్; నిరోధం- ఓమ్; విశిష్ట నిరోధం- ఓమ్.మీటర్; విద్యుత్ సామర్థ్యం- వాట్; విద్యుత్ రసాయన తుల్యాంకం-గ్రామ్ / కూలుంబ్. ఇన్పుట్స్: ఎ.నాగరాజ శేఖర్, సీనియర్ ఫ్యాకల్టీ