ప్రచార వ్యూహకర్త.. మీడియా ప్లానర్ | MBA students can be learned as Media planner | Sakshi
Sakshi News home page

ప్రచార వ్యూహకర్త.. మీడియా ప్లానర్

Published Sun, Sep 21 2014 1:18 AM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM

ప్రచార వ్యూహకర్త.. మీడియా ప్లానర్ - Sakshi

ప్రచార వ్యూహకర్త.. మీడియా ప్లానర్

ఏదైనా ఉత్పత్తి గురించి వినియోగదారులకు తెలియాలంటే ఏకైక మార్గం.. ప్రచారం. సరైన పబ్లిసిటీ లేకపోతే ఎంతగొప్ప వస్తువుకైనా మార్కెట్‌లో ఆదరణ లభించదు. తమ ఉత్పత్తుల అమ్మకాలు పెరగడానికి, తద్వారా లాభాలు ఆర్జించడానికి కంపెనీలు ప్రచారాన్నే నమ్ముకుంటాయి. అయితే, ఏ వస్తువు వినియోగదారులు ఎక్కడున్నారు? టార్గెట్ గ్రూప్‌ను ఆకర్షించడం ఎలా? ఏయే మాధ్యమాల ద్వారా వారికి చేరువ కావాలి? అనే విషయాలు అందరికీ తెలియవు. తమ పరిశోధనతో వీటిని తెలియజేసి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసే నిపుణులే.. మీడియా ప్లానర్లు. ప్రచార సంస్థ(అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీ)కు వెన్నెముకలాంటివారు మీడియా ప్లానర్లు. ప్రపంచవ్యాప్తంగా వస్తూత్పత్తుల మార్కెటింగ్ విస్తరిస్తుండడంతో వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.
 
 ప్లానర్లకు భారీ వేతనాలు
 పబ్లిసిటీకి ఒకప్పుడు పత్రికలు, టీవీలు, రేడియోలు, హోర్డింగ్‌లే ప్రధాన మార్గం. ఆధునిక కాలంలో ఇది కొత్తపుంతలు తొక్కుతోంది. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లలో ఉత్పత్తుల ప్రచారం సాగుతోంది. ఏ వస్తువును ఏ మాధ్యమం ద్వారా పబ్లిసిటీ చేస్తే ప్రజలకు చేరుతుందో మీడియా ప్లానర్ పసిగట్టాలి. తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం జరిగేలా చూడాలి. మార్కెట్ ట్రెండ్‌ను పరిశీలిస్తూ ప్రచారం ద్వారా ఉత్పత్తుల అమ్మకాలు పెరగడానికి వ్యూహాలు రూపొందించాలి. సృజనాత్మకతతో కూడిన పబ్లిసిటీతో వినియోగదారుల ఆలోచనలను మార్చగలిగే శక్తి మీడియా ప్లానర్‌కు ఉండాలి. వీరికి ప్రస్తుతం మార్కెటింగ్ కంపెనీలు, మీడియా ఏజెన్సీలు, టీవీ ఛానళ్లు, వెబ్‌సైట్లు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో వేతనాలు భారీగానే ఉంటాయి. వృత్తిలో తగిన నైపుణ్యం, అనుభవం సంపాదిస్తే నెలకు రూ.లక్షల్లోనే అందుకోవచ్చు. సొంతంగా కమ్యూనికేషన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ అధిక ఆదాయం ఆర్జించొచ్చు.
 
 కావాల్సిన స్కిల్స్: మీడియా ప్లానింగ్‌లో ఒత్తిళ్లు, సవాళ్లు ఎక్కువగా ఉంటాయి. పనిలో డెడ్‌లైన్లు ఉంటాయి కాబట్టి వాటిని చేరుకోవడానికి అధికంగా శ్రమించాలి. ప్లానర్లకు ఆర్గనైజేషనల్, ఇంటర్‌పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. నాయకత్వ లక్షణాలు అవసరం. రిపోర్ట్‌లు, ప్రజంటేషన్లను రూపొందించడంలో నైపుణ్యం ఉండాలి.  ఆధునిక సమాచార సాంకేతిక విజ్ఞానంపై అవగాహన ముఖ్యం.
 
 అర్హతలు: మీడియా ప్లానింగ్ స్పెషలైజేషన్‌గా అడ్వర్‌టైజింగ్ కోర్సులు పూర్తిచేసినవారు ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. ఇంటర్మీడియెట్ అర్హతతో ఈ కోర్సుల్లో చేరొచ్చు. మార్కెటింగ్ స్పెషలైజేషన్‌గా ఎంబీఏ చదివినవారు కూడా మీడియా ప్లానర్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు.
 
 వేతనాలు: మీడియా ట్రైనీకి ప్రారంభంలో రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభిస్తుంది. మీడియా ప్లానర్‌గా ఈ రంగంలో ఎనిమిదేళ్ల అనుభవం సంపాదిస్తే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షిక ప్యాకేజీ అందుతుంది. 15 ఏళ్ల తర్వాత ఇది రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెరుగుతుంది. సూపర్ సీనియర్/టాప్ మేనేజ్‌మెంట్ స్థాయికి చేరుకుంటే ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.కోటి అందుకోవచ్చు.
 
 కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-న్యూఢిల్లీ
     వెబ్‌సైట్: www.iimc.nic.in
     ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్
     -అహ్మదాబాద్ వెబ్‌సైట్: www.mica.ac.in
     సింబయోసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్  వెబ్‌సైట్: ఠీఠీఠీ.టజీఝఛి.్ఛఛీఠ
     నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వర్‌టైజింగ్-ఢిల్లీ
     వెబ్‌సైట్: www.niaindia.org
     జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్
     వెబ్‌సైట్: www.xaviercomm.org
     నార్సీమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్
     వెబ్‌సైట్: www.nmims.edu
 
 కంపెనీకి, మీడియాకు మధ్య వారధి!
 ‘‘సంస్థలు చేపట్టే నూతన కార్యక్రమాల సమాచారం, కంపెనీ సాధించిన విజయాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చేరవేస్తూ మీడియా ప్లానర్స్ వారధిలా పనిచేస్తున్నారు. సంస్థల సేవలు, ఉత్పత్తుల పబ్లిసిటీలోనూ వీరిదే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో మీడియా ప్లానర్స్‌గా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. కంపెనీ చైర్మన్, ఎండీ, సీఈఓ, బోర్డు సభ్యులతో నిత్యం సంప్రదిస్తూ కంపెనీ తరఫున మీడియాకు సమాచారాన్ని అందిస్తారు. సంస్థకు సంబంధించిన వార్తల ప్రచురణను పర్యవేక్షిస్తారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు మీడియా మేనేజ్‌మెంట్ కోర్సులో భాగంగా మీడియా ప్లానింగ్‌ను అభ్యసించొచ్చు. మాస్ కమ్యూనికేషన్, అడ్వర్‌టైజింగ్, ఎంబీఏ కోర్సులు అభ్యసించిన వారు కూడా మీడియా ప్లానర్‌గా కెరీర్ ఎంచుకోవచ్చు. మీడియా ప్లానర్‌గా రాణించాలంటే మార్కెట్ అధ్యయనం, బిజినెస్ డెవలప్‌మెంట్, ఆర్గనైజేషన్ ఆర్థిక వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలి. మీడియా ప్లానర్‌కు మంచి నెట్‌వర్కింగ్ నైపుణ్యాలు తప్పనిసరి. అలాగే మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు వివిధ భాషల్లో అనర్గళంగా మాట్లాడే నేర్పు ఉండాలి’’
 - ప్రమోద్ మిట్టా, మేనేజర్,
 మీడియా రిలేషన్స్, ఎయిర్ కోస్టా
 
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 పోటీపరీక్షల్లో ‘విద్యుత్’ నుంచి ఏయే
 అంశాలపై ప్రశ్నలు అడుగుతారు?      - పి.నాగరాజు, అశోక్‌నగర్
 
 భౌతిక శాస్త్రంలో ‘విద్యుత్’ పాఠ్యాంశం చాలా విస్తృతమైంది. దీన్ని ప్రణాళికా బద్ధంగా చదవాలి. ముఖ్యంగా విద్యుత్ పొటెన్షియల్, నిరోధాల శ్రేణి, సమాంతర సంధానాలపై సమస్యలను సాధన చేయాలి. కానిస్టేబుల్ పరీక్షల కోసం 6 నుంచి పదోతరగతి వరకు భౌతికశాస్త్ర పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఓమ్ నియమం, నిరోధ నియమాలు, విద్యుదయస్కాంత ఫలితాలు, వాటి అనువర్తనాలు, విద్యుదయస్కాంత ప్రేరణ అనువర్తనాలు ప్రధానమైనవి. ఓమ్ నియమం, లెంజ్ నియమం, ఫ్లెమింగ్ కుడిచేతి నిబంధన, ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధన, ఫారడే విద్యుద్విశ్లేషణ తదితర నియమాలను నేర్చుకోవాలి. విద్యుత్ మోటారు, విద్యుత్ జనరేటర్ వంటి వాటి నిర్మాణం, అవి పనిచేసే విధానంలోని సూత్రాలపై కూడా ప్రశ్నలు ఇస్తారు. ముఖ్యమైన సూత్రాలను గుర్తుంచుకోవాలి. రాశుల ప్రమాణాలను నేర్చుకోవాలి. ఉదా: కరెంటు- ఆంపియర్;  పొటెన్షియల్ భేదం- వోల్ట్; నిరోధం- ఓమ్; విశిష్ట నిరోధం- ఓమ్.మీటర్; విద్యుత్ సామర్థ్యం- వాట్; విద్యుత్ రసాయన తుల్యాంకం-గ్రామ్ / కూలుంబ్.
 ఇన్‌పుట్స్: ఎ.నాగరాజ శేఖర్,
 సీనియర్ ఫ్యాకల్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement