సృజనకు సరితూగే కెరీర్! | Creativity to play a key role for Media- entertainment | Sakshi
Sakshi News home page

సృజనకు సరితూగే కెరీర్!

Published Sun, Oct 12 2014 4:08 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

సృజనకు సరితూగే కెరీర్! - Sakshi

సృజనకు సరితూగే కెరీర్!

మీడియా - ఎంటర్‌టైన్‌మెంట్.. ప్రసార మాధ్యమాలు (మీడియా).. జాతి హృదయ స్పందనను కళ్లకు కట్టే అత్యుత్తమ సాధనాలు. సమాజానికి నిలువుటద్దంగా ఉంటూ సామాన్య ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని చూపే నిజమైన వేదికలు.. అదే విధంగా సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరికీ రోజంతా శ్రమించి కాస్త సేద తీరేందుకు వినోదం (ఎంటర్‌టైన్‌మెంట్) ఓ ఆహ్లాదకరమైన మార్గం. దేశంలో డిజిటల్ విప్లవానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా ప్రసారమాధ్యమాలు, వినోదరంగం (ఎం అండ్ ఈ)లో నిపుణులైన మానవవనరులకు డిమాండ్ తథ్యం. ఈ నేపథ్యంలో కెరీర్ అవకాశాలపై ఫోకస్..
 
 ఫిక్కీ-కేపీఎంజీ రిపోర్టు ప్రకారం 2013లో దేశంలో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ (ఎం అండ్ ఈ) మార్కెట్ విలువ రూ.91,800 కోట్లు. ఇది 2018 నాటికి రూ.2.27 లక్షల కోట్లకు చేరుతుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అంచనా వేసింది.
 
 ‘ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా అవుట్‌లుక్  2014’ ప్రకారం ఎం అండ్ ఈ పరిశ్రమ గతేడాది రూ.1.12 లక్షల కోట్ల రెవెన్యూ దక్కించుకుంది. ఇది అంతకు ముందు సంవత్సరం ఆర్జించిన దానికంటే 19 శాతం అధికం. టెలివిజన్, ఇంటర్నెట్ రంగాలు శరవేగంగా వృద్ధి సాధిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో టెలివిజన్, ఫిల్మ్, ప్రింట్, వైర్డ్ అండ్ మొబైల్ ఇంటర్నెట్ యాక్సెస్, వైర్డ్ అండ్ మొబైల్ ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్, గేమింగ్, రేడియో, మ్యూజిక్ వంటివి కీలక విభాగాలు.
 
 ఆనంద నగరం.. భాగ్య నగరం:
 హైదరాబాద్ మహానగరంలో ప్రసార మాధ్యమాలు, సినీ రంగం ఆవశ్యకత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా; చలనచిత్ర పరిశ్రమ; వీడియోగేమ్స్; ఎఫ్‌ఎం రేడియో వంటి వాటి అభివృద్ధికి భాగ్యనగరం మంచి వేదికగా నిలుస్తోంది. వీటితో పాటు గేమ్‌సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడం వినోద రంగం అభివృద్ధికి ఊతమిస్తోంది. ఇంతలా అభివృద్ధి చెందుతున్న ఎం అండ్ ఈ పరిశ్రమలో అందిపుచ్చుకోవాలేగానీ అవకాశాలకు కొదువలేదు! ‘‘కొత్త ఆలోచనలు, సృజనాత్మకత ఉంటే మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అద్భుత కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. మానవ సంబంధాలు, భావోద్వేగాలకు అద్దంపట్టేలా ఇటీవల టీవీ చానెళ్లలో పెరుగుతున్న వినోద కార్యక్రమాలు యువతరం ఆలోచనలకు కళాత్మక రూపాలే. సినిమా అంటే కేవలం నటన, దర్శకత్వం మాత్రమే కాదు.. అందులో 24 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉంటే టీవీ, సినిమా రెండింటిలోనూ రాణించవచ్చు’’ అంటున్నారు సినీ దర్శకుడు ప్రభాకర్‌రెడ్డి.
 
 మీడియాలో పెనుమార్పులు:        
 దేశంలోని మీడియా రంగంలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుండటంతో అనేక కొత్త సంస్థలు ప్రవేశిస్తున్నాయి. కొత్త పత్రికలు, చానళ్లు, మ్యాగజైన్లు, వెబ్ పోర్టల్స్ ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా 24 గంటల న్యూస్ చానళ్ల సంఖ్య అధికమవుతోంది. దీంతో సుశిక్షితులైన మానవ వనరులకు డిమాండ్ ఏర్పడుతోంది. అందువల్ల విశ్వవిద్యాలయాలు జర్నలిజంలో వివిధ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇదే సమయంలో ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉండటంతోపాటు ఆకర్షణీయ ఆదాయం, సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుండటంతో యువత జర్నలిజం కెరీర్ వైపు ఆకర్షితులవుతున్నారు. వీరు న్యూస్ రిపోర్టింగ్, ఎడిటింగ్, సర్క్యులేషన్, అడ్వర్టైజింగ్, బ్రాండ్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్ తదితర విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. టీవీ చానెళ్లు, వెబ్‌సైట్లు, రేడియో తదితరాల్లో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాలుంటాయి. వీటిలో యాంకరింగ్, యాక్టింగ్, ప్రొడక్షన్, బ్రాడ్‌కాస్టింగ్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ విభాగాల్లో మంచి అవకాశాలుంటాయి.
 
 సృజనాత్మకత, నూతన త్వం:
  సినిమా, టీవీ విభాగాల్లో డెరైక్షన్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ ఇంజనీర్, స్క్రీన్‌ప్లే, యాంకరింగ్, న్యూస్‌రీడింగ్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్.. ఇలా వివిధ అవకాశాల్లో అర్హత, సమర్థతనుబట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. సృజనాత్మకత, నూతనత్వాన్ని ప్రతిబింబించడం ద్వారా కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు.
 అప్రంటీస్, అసిస్టెంట్ డెరైక్టర్, అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు బృందాన్ని నడిపించగల నాయకత్వ లక్షణాలు ఉంటే డెరైక్టర్ స్థాయికి ఎదగొచ్చు.
   సినిమా, సీరియళ్ల చిత్రీకరణ తర్వాత దృశ్యాలను సరైన క్రమంలో పేర్చడం ఎడిటర్ బాధ్యత. సమయస్ఫూర్తి, సృజనాత్మకత, కళాత్మకత అనేవి ఎడిటింగ్ రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు. అడ్వర్టైజింగ్ సంస్థలు, మల్టీమీడియా, వెబ్‌డిజైనింగ్ కంపెనీలు, టీవీ, ఫిల్మ్ స్టూడియోలలో అసిస్టెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఇన్‌పుట్ ఎడిటర్ స్థాయికి చేరొచ్చు. ఆర్థిక వెసులుబాటు ఉంటే సొంతంగా ప్రొడక్షన్‌హౌస్ ఏర్పాటుచేసుకోవచ్చు. ప్రారంభ వేతనం రూ.20వేల వరకు ఉంటుంది. నైపుణ్యాలు మెరుగుపరచుకుంటే నెలకు రూ.లక్ష వరకు ఆర్జించవచ్చు.
 
 మీడియా-కోర్సులు:
 నగరంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా, ఇగ్నో, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వంటి ప్రముఖ సంస్థలు జర్నలిజం కోర్సులను అందిస్తున్నాయి.
  ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్‌కమ్యూనికేషన్ (న్యూఢిల్లీ) సంస్థ.. ఇంగ్లిష్ జర్నలిజం, హిందీ జర్నలిజం, అడర్వర్టైజింగ్-పబ్లిక్ రిలేషన్స్ విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సులను ఆఫర్ చేస్తోంది. జర్నలిజంలో పీజీ కోర్సును అందుబాటులో ఉంచింది. డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ కోర్సుల్లో చేరొచ్చు. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వివరాలకు www.iimc.nic.in.
  వెబ్‌డిజైనింగ్, మల్టీమీడియా కోర్సుల్లో జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (www.jnafau.ac.in) రెగ్యులర్, డిస్టెన్స్ విధానాల్లో కోర్సులు అందిస్తోంది.
 
 సినీ, టెలివిజన్- కోర్సులు , సంస్థలు
 - నగరంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రామానాయుడు ఫిల్మ్ స్కూల్ వంటి వాటిలో సినీ, టెలివిజన్ కోర్సులున్నాయి.     
 - ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ (నోయిడా), సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ (కోల్‌కతా), ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణె) వంటి ప్రముఖ సంస్థల్లో యాక్టింగ్, యాంకరింగ్, ఎడిటింగ్, డెరైక్షన్ తదితర అంశాల్లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

 నైపుణ్యాలు పెంచుకుంటే ఉన్నత అవకాశాలు
 ప్రపంచం మనుగడ ఉన్నంత కాలం మీడియా ఉంటుంది. భవిష్యత్తులో ఈ రంగంలో మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకొని, నైపుణ్యాలు పెంచుకుంటే     ఈ రంగంలో త్వరగా ఎదిగేందుకు అవకాశముంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యువత అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అనువుగా తయారవ్వాలి.
 - ప్రొఫెసర్ వాసుకి బెలవాడి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్, హెచ్‌సీయూ.
 
 చిత్ర పరిశ్రమలో కళాత్మక అవకాశాలు
 నాకు చిన్నప్పటి నుంచి ఫిల్మ్‌మేకింగ్ అంటే ఆసక్తి. 2013 టోఫెల్ స్కాలర్‌షిప్ రావడంతో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరాను. ఏటా పది వేల డాలర్లు ఇస్తారు. ఫిల్మ్, ఎకనామిక్స్‌లో మేజర్ డిగ్రీలు చేస్తున్నా. ఫిల్మ్ మేకింగ్ నా లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాలు ఉండాలన్నదే నా కోరిక. సినిమాలంటే కేవలం పాటలు, ఫైట్స్ మాత్రమే కాదు.. అవి జీవితాలను ప్రతిబింబించేలా ఉండాలి. సృజనాత్మకత ఉన్నవారికి వినోదరంగం అద్భుతమైన వేదిక అనేది నా అభిప్రాయం.
 - అలీజానూర్‌ఖాన్,
 యూనివర్సిటీ ఆఫ్
 సదరన్ కాలిఫోర్నియా.
 
 డిజిటల్ మీడియాదే హవా
 నాకు ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. ‘అమ్మాయివి కెమెరాతో నీకేంటి పని..’ అని కొందరు విమర్శించినా, నాన్న ప్రోత్సాహంతో దాన్నే కెరీర్‌గా మార్చుకున్నా. నా అర్హత పత్రాలు పంపడంతో అమెరికాలోని రింగ్లింగ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో రూ.1.20 కోట్ల స్కాలర్‌షిప్‌తో సీటు లభించింది. ప్రస్తుతం డిజిటల్‌యుగం నడుస్తోంది. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ తరుణంలో అందుకునే నేర్పు, ఓర్పు ఉండాలేగానీ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలో అవకాశాలకు కొరతలేదు’’
 -పూజా అపర్ణ కొల్లూరి, రింగ్లింగ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్, అమెరికా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement