Hydrocarbons
-
గ్రీన్‌లాండ్‌ను కొనేద్దామా!
వాషింగ్టన్/స్టాక్‌హోమ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలోనే అదిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్‌పై కన్నేశారు. ‘డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడం వీలవుతుందా?’ అని ట్రంప్ తన సలహాదారుల అభిప్రాయాన్ని కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అపారమైన సహజవనరులతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం కావడంతో గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ దృష్టి సారించారు. డెన్మార్క్‌లో ప్రావిన్స్ అయిన గ్రీన్లాండ్కు స్వయంప్రతిపత్తి ఉంది. 20 లక్షల చదరపు కి.మీ విస్తీర్ణం గల గ్రీన్లాండ్ జనాభా 57వేలు. ఈ ద్వీపంలోని 85 శాతం భూభాగంపై 3 కి.మీ మందంతో మంచుదుప్పటి కప్పుకుంది. ట్రంప్ ప్రతిపాదనపై కొందరు సన్నిహితులు స్పందిస్తూ..‘గ్రీన్లాండ్లోని తూలేలో అమెరికాకు ఇప్పటికే వైమానిక స్థావరం ఉంది. కాబట్టి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం వ్యూహాత్మకమే’ అని తెలిపారు. అయితే అధికారం నుంచి తప్పుకునేలోపు తనపేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసేందుకే ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. 1946లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ గ్రీన్‌లాండ్‌ను తమకు అమ్మితే రూ.712.47 కోట్లు ఇస్తామని చెప్పగా, ఈ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది. గ్రీన్లాండ్లో విస్తారమైన హైడ్రోకార్బన్ నిక్షేపాలు, అరుదైన ఖనిజాలు, తీర ప్రాంతంపై అమెరికా అమితాసక్తితో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం వికీలీక్స్ బయటపెట్టింది. మేం అమ్మకానికి లేం: గ్రీన్లాండ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ఖండించింది. ఈ విషయమై గ్రీన్లాండ్ విదేశాంగ శాఖ స్పందిస్తూ..‘అమెరికాతో వ్యాపారానికి మా తలుపులు తెరిచిఉంటాయి. కానీ గ్రీన్లాండ్ అమ్మకానికి మేం సిద్ధంగా లేం. సహజవనరులు, చేపలు, పునరుత్పాదక విద్యుత్, సాహస క్రీడలకు గ్రీన్లాండ్ నెలవు’ అని స్పష్టం చేసింది. గ్రీన్లాండ్ మాజీ ప్రధాని లార్స్ రాముస్సేన్ మాట్లాడుతూ..‘ట్రంప్ ఏప్రిల్ ఫూల్ జోక్ చేస్తున్నారనుకుంటా. కానీ ఇది సీజన్ కాదుగా’ అని వ్యాఖ్యానించారు. మూడుదేశాల వలస పాలనలో.. గ్రీన్‌లాండ్‌ను 13వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దంవరకూ నార్వే పాలించింది. 1499లో పోర్చుగీసు వారు ఈ ద్వీపం తమదని ప్రకటించుకున్నారు. 18వ శతాబ్దం ఆరంభంలో గ్రీన్‌లాండ్‌ను ఉమ్మడిగా పరిపాలించాలని డెన్మార్క్–నార్వే నిర్ణయించాయి. 1814లో నార్వే–స్వీడన్ విడిపోవడంతో గ్రీన్‌లాండ్‌పై అధికారాలు డెన్మార్క్‌కు దక్కాయి. గ్రీన్లాండ్లో మెజారిటీ ఇన్యుట్ జాతిప్రజలే. వీరంతా గ్రీన్లాండిక్ భాష మాట్లాడుతారు. దీంతో ఈ ప్రాంతంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా కాలనీగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ 1953లో విలీనం చేసుకుంది. డానిష్ భాషను తప్పనిసరి చేసింది. దీంతో ఉన్నతవిద్య కోసం పలువురు గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్‌కు వెళ్లడం ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమైనా గ్రీన్లాండ్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష బయలుదేరింది. దీంతో డెన్మార్క్ 1972లో హోంరూల్ చట్టం తీసుకొచ్చింది. విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, సహజవనరులు మినహా అన్ని అధికారాలను స్థానిక ప్రభుత్వానికి అప్పగించింది. 2008లో జరిగిన రెఫరెండంలో మరిన్ని అధికారాలు కావాలని గ్రీన్లాండర్లు తీర్పునిచ్చారు. దీంతో పోలీస్, న్యాయ వ్యవస్థలు, సహజవనరులు, విమానయానం, సరిహద్దు చట్టాలు చేసే అధికారం గ్రీన్లాండ్కు దక్కాయి. -
చమురు,సహజ వాయువు రంగంలో ‘ఎంఈఐఎల్’
ఎత్తిపోతల పథకాలు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా – పంపిణీలలో ఎన్నో విజయాలు అధిగమించిన ఎంఈఐఎల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్నది. హైడ్రోకార్బన్స్ డివిజన్ ద్వారా చమురు వెలికితీత,గ్యాస్ పంపిణీ సహజ వాయువు రంగంలో వివిధ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నది. కువైట్, జోర్డాన్‌లో రిఫైనరీ పనులను చేపట్టింది. దేశంలోని రాజస్థాన్, అస్సాం, గుజరాత్, ఆంధ్రపదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో చమురు, సహజ వాయువు రంగంలో ఎంఈఐఎల్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ హైడ్రో కార్బన్ రంగంలో విస్తరిస్తున్నది. విదేశీ ప్రాజెక్టులు జోర్డాన్‌కు చెందిన అరబ్ పొటాష్ కంపెనీ (ఏపీసీ) నుంచి 54 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్టును ఎంఈఐఎల్ దక్కించుకుంది. ఇంజనీరింగ్, సామగ్రి సరఫరా, వాటి అమరిక, కమిషనింగ్ పనులను ఎంఈఐఎల్ చేపట్టింది. 54 మెగావాట్ల గ్యాస్ టర్బైన్, హీట్ రికవరీ అండ్ స్టీమ్ జెనరేటర్ సిస్టమ్ (హెచ్ఆర్ఎస్జీ) ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు పనులన్నింటినీ పూర్తి చేసి గతేడాది అక్టోబర్‌లోనే విద్యుత్ ఉత్పత్తిని ఎంఈఐఎల్ ప్రారంభించింది. అలాగే కువైట్‌లోని అల్ జౌరి ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో 60 నుంచి 78 మీటర్ల వ్యాసంతో 70,000 మిలియన్ టన్నుల సామాగ్రితో 66 ట్యాంకులను ‘ఎంఈఐఎల్’ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం 3000 మంది సిబ్బందిని నియమించింది. ఇప్పటికే ట్యాంకుల నిర్మాణం చాలా వరకు పూర్తయింది. వీటికి హైడ్రో టెస్ట్ కొనసాగుతుంది. డిసెంబరు 2019 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలన్న సంకల్పంతో ఎంఈఐఎల్ ఉన్నది. ఎటువంటి ప్రమాదం లేకుండా కోటి గంటల పాటు పనిచేయడం ద్వారా కెఐపిఐసి నుండి ‘ఎంఈఐఎల్’ అప్రిసియేషన్ సర్టిఫికెట్ కూడా పొందింది. రాజస్థాన్‌లోని రాగేశ్వరి వద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ రాజస్థాన్ లోని రాగేశ్వరి వద్ద గ్యాస్ ప్రాసెస్ ప్రాజెక్టును కెయిర్న్ ఇండియా కోసం ‘ఎంఈఐఎల్’ నెలకొల్పింది. కెయిర్న్ ఇండియా నుంచి ఆగస్టు 2018 లో ఆర్డర్ ను పొంది అదే నెలలో అన్ని వనరులను సమీకరించి, వేగంగా పనులు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ఒక సవాల్ గా తీసుకొని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ పరికరాల సహాయంతో రోజుకు 24 గంటల పాటు పని చేయడం ప్రారంభించడం ద్వారా మార్చి 2019 నాటికే కేవలం ఆరు నెలలు కాలంలో నిర్మించింది. ఈ రంగంలో ఇంత వేగంగా ప్రాజెక్టును ఒక రికార్డు. ఈ అసమానమైన విజయం కారణంగా, ‘ఎంఈఐఎల్’ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకొని అంతర్జాతీయ హైడ్రోకార్బన్ పరిశ్రమలలో ప్రముఖ స్థానానికి చేరుకుంది. అస్సాం, గుజరాత్ లలో పైప్లైన్ల రీప్లేస్మెంట్ ప్రాజెక్టులు అస్సాం లోని గెలికి వద్ద ఆరు పైప్ లైన్ విభాగాల పనిని ఓఎన్జీసి కోసం ఎంఈఐఎల్ చేపట్టింది. 2017లో 48.3 కిలోమీటర్ల పైప్ లైన్ల పని పూర్తి చేయగా 2018 లో 91.62 కిలో మీటర్ల పనిని పూర్తి చేసింది. ఐదు పైప్ లైన్ విభాగాలను వేయడం ద్వారా పైప్ పరిమాణం 8 అంగుళాల నుండి 14అంగుళాలకు పెంచడం ద్వారా పైప్ సామర్థ్యాన్ని పెంచుతుంది. 2018 లో రెండు విభాగాలలో 11.39 కిలోమీటర్ల మేర పనులను ఎంఈఐఎల్ పూర్తిచేసింది. సౌత్ సాంతల్ జిజిఎస్ మరియు సిటిఎఫ్ నుంచి బెచ్చరాజి జిజిఎస్-1 వరకు ఎల్పి గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా అస్సాం రెన్యువల్ ప్రాజెక్టులో భాగంగా ఎంఈఐఎల్ ఎఫ్లూఎంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటిపి), వాటర్ ఇంజక్షన్ ప్లాంట్ (డబ్ల్యుఐపి), జిజిఎస్ 5 లను 2018 ఏర్పాటు చేసింది. గుజరాత్ లోని మెహసానా వద్ద నాలుగు దశలలో అగ్నిమాపక వ్యవస్థ అప్-గ్రేడింగ్ పనులను ఎంఈఐఎల్ చేపట్టింది. ఫైర్ వాటర్ నెటవర్క్స్, హైడ్రంట్స్, వాటర్ ఫోమ్ మానిటర్, వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్ లతో పాటు స్ర్పింకర్ రింగ్‌లను ఏర్పాటు చేసింది. మొత్తం నాలుగు దశలకు గాను రెండు దశలను పూర్తి చేయడం జరిగింది. మిగతా రెండు దశలు జూలై 2019 నాటికి పూర్తవుతాయి. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సిటీ గ్యాస్ డిస్ట్రిబబ్యూషన్ (సిజిటి) ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్నాటక రాష్ట్రాల్లోని 16 జిల్లాలను ఎంఈఐఎల్ దక్కించుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, కర్నాటకలోని తుంకూరు, బెల్గవి జిల్లాల్లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ఆటోమొబైల్ రంగాలకు ‘మేఘా గ్యాస్’ అనే పేరుతో సహజ వాయువు పైపుడ్ గ్యాస్ సరఫరా చేస్తోంది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం, నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పైపులతో గ్యాస్ ను సరఫరా చేయనుంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కింద 360 కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటు చేయగా మరో 900 కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నది. నాగాయలంక, పెనుగొండ ఆన్‌షోర్ గ్యాస్ ఫీల్డ్ గ్యాస్ గ్రిడ్ నెట్వర్క్ పనులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంఈఐఎల్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని నాగాయలంకలో పనులు పూర్తి చేసి కృష్ణా జిల్లాకు సహజ వాయువు పైపుడ్ గ్యాస్ ను సరఫరా చేస్తోంది. అలాగే తెలంగాణలోని ఇండస్ట్రియల్ కు సహజ వాయువు పైపుడ్ ద్వారా సరఫరా చేయబోయే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పెనుగొండ గ్యాస్ గ్రిడ్ పనులు పూర్తి చేశారు. ఓన్జీఎస్ అనుమతుల వచ్చాక గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు సరఫరా చేయడానికి సిద్దంగా ఉంది. -
చమురు ఉత్పత్తికి బూస్ట్
►హైడ్రోకార్బన్స్ అన్వేషణకు కొత్త లైసెన్సింగ్ విధానం ►ఏటా రెండుసార్లు గ్యాస్, చమురు బ్లాక్‌ల వేలం ►జూలైలో తొలి విడత నిర్వహణ హ్యూస్టన్: దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తికి ఊతమిచ్చే దిశగా కేంద్రం కొత్త లైసెన్సింగ్ విధానాన్ని ప్రకటించింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద చమురు, గ్యాస్ బ్లాక్‌ల వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తొలి విడత వేలం ఈ ఏడాది జులైలో నిర్వహించనున్నట్లు ఇంధన పరిశ్రమ దిగ్గజాల సదస్సు సీఈఆర్ఏవీక్లో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఇప్పటిదాకా ఉన్న పాలసీ ప్రకారం లాభాల్లో వాటాల విధానం పాటిస్తుండగా.. ఓఏఎల్‌పీ కింద ఆదాయాల్లో వాటాల విధానం అమల్లోకి వస్తుంది. అలాగే, ఆపరేటర్లకు ధర, మార్కెటింగ్ పరమైన స్వేచ్ఛ లభిస్తుంది. హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్సింగ్ విధానం (హెల్ప్) కింద ఇటీవలే 31 చిన్న క్షేత్రాలను కేటాయించినప్పటికీ.. జులైలో పెద్ద క్షేత్రాలను వేలం వేయనుండటం 2010 తర్వాత తొలిసారి కానుంది. వ్యాపారాలకు, ఇన్వెస్టర్లకు అనువైన కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని 2020 నాటికి పది శాతం మేర తగ్గించుకునేందుకు తలపెట్టిన వ్యూహంలో భాగంగా కొత్త విధానాన్ని రూపొందించినట్లు ప్రధాన్ చెప్పారు. ‘కొత్త విధానంలో ఉత్పత్తిదారులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం పర్యవేక్షించబోదు. కేవలం ఆదాయాల్లో వాటాలు మాత్రమే పంచుకుంటుంది‘ అని ఆయన వివరించారు.