చమురు ఉత్పత్తికి బూస్ట్
►హైడ్రోకార్బన్స్ అన్వేషణకు కొత్త లైసెన్సింగ్ విధానం
►ఏటా రెండుసార్లు గ్యాస్, చమురు బ్లాక్‌ల వేలం
►జూలైలో తొలి విడత నిర్వహణ
హ్యూస్టన్: దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తికి ఊతమిచ్చే దిశగా కేంద్రం కొత్త లైసెన్సింగ్ విధానాన్ని ప్రకటించింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద చమురు, గ్యాస్ బ్లాక్‌ల వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తొలి విడత వేలం ఈ ఏడాది జులైలో నిర్వహించనున్నట్లు ఇంధన పరిశ్రమ దిగ్గజాల సదస్సు సీఈఆర్‌ఏవీక్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఇప్పటిదాకా ఉన్న పాలసీ ప్రకారం లాభాల్లో వాటాల విధానం పాటిస్తుండగా.. ఓఏఎల్‌పీ కింద ఆదాయాల్లో వాటాల విధానం అమల్లోకి వస్తుంది.
అలాగే, ఆపరేటర్లకు ధర, మార్కెటింగ్ పరమైన స్వేచ్ఛ లభిస్తుంది. హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్సింగ్ విధానం (హెల్ప్) కింద ఇటీవలే 31 చిన్న క్షేత్రాలను కేటాయించినప్పటికీ.. జులైలో పెద్ద క్షేత్రాలను వేలం వేయనుండటం 2010 తర్వాత తొలిసారి కానుంది. వ్యాపారాలకు, ఇన్వెస్టర్లకు అనువైన కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని 2020 నాటికి పది శాతం మేర తగ్గించుకునేందుకు తలపెట్టిన వ్యూహంలో భాగంగా కొత్త విధానాన్ని రూపొందించినట్లు ప్రధాన్ చెప్పారు. ‘కొత్త విధానంలో ఉత్పత్తిదారులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం పర్యవేక్షించబోదు. కేవలం ఆదాయాల్లో వాటాలు మాత్రమే పంచుకుంటుంది‘ అని ఆయన వివరించారు.