జూన్ 9న భూకంపాలను గుర్తించే ఉపగ్రహ ప్రయోగం
చెన్నై: సునామీ, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించే ఉపగ్రహాన్ని జూన్ 9వ తేదీన ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ వెల్లడించారు. చెన్నై విమానాశ్రయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో భూకంపం, సునామీ తీవ్రమైనవని, వీటి రాకను ముందుగానే పసిగట్టినట్లయితే ముందస్తు చర్యలు తీసుకునేందుకు, ప్రజలను కాపాడేందుకు వీలవుతుందన్నారు.
అదేవిధంగా భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ(ఐఆర్ఎన్ఎస్ఎస్) ఏర్పాటులో భాగంగా ఇటీవల అంతరిక్షానికి పంపిన నాలుగో ఉపగ్రహం బాగా పనిచేస్తోందని కిరణ్కుమార్ తెలిపారు. పూర్తిస్థాయి ఐఆర్ఎన్ఎస్ఎస్ సేవల కోసం ఏడు ఉపగ్రహాలు అవసరమని, ఇందుకుగాను 5వ ఉపగ్రహాన్ని డిసెంబర్లో, 6, 7వ ఉపగ్రహాలను వచ్చే ఏడాది మార్చిలో ప్రయోగిస్తామన్నారు.