ఐ క్లిక్ కేంద్రాలు ప్రారంభించిన డీజీపీ
నగరంలో రెండు ప్రాంతాల్లో ఏర్పాటు
పోలీసు అధికారులతో సమావేశం
గుంటూరు క్రైం : రాష్ర్ట డీజీపీ జేవీ రాముడు బుధవారం నగరంలో ఏర్పాటుచేసిన రెండు ఐ క్లిక్ కేంద్రాలను ప్రారంభించారు. తొలుత ఉదయం 11.30 గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన ఐ క్లిక్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అనంతరం కొత్తపేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలో నూతనంగా ఏర్పటు చేసిన ఈ-కౌంటర్‌ను ప్రారంబించారు. తదనంతరం శంకర్‌విలాస్ సెంటర్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన ఐక్లిక్ కేంద్రాన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఐజీ ఎన్.సంజయ్,ఎస్పీలు కె.నారాయణ నాయక్, సర్వశ్రేష్ట త్రిపాఠి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.
పోలీసు అధికారులతో సమావేశం
అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఐజీ, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో నేరాలు జరుగుతున్న తీరు, చేపడుతున్న చర్యలు, పోలీస్ స్టేషన్ల పెంపు, తదితర అంశాల గురించి డీజీపీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాజధాని ఏర్పాటు క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వుండేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు.
సమావేశం అనంతరం కలెక్టర్ కాంతిలాల్ దండే నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో డీజీపీతో పాటు ఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీలు హాజరయ్యారు. విందు అనంతరం జిల్లా పరిస్థితులు, శాంతి భద్రతల సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. 4 గంటలకు డీజీపీ బయలుదేరి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లారు.