రాజా చారికి బ్రిగేడియర్ జనరల్ హోదా
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ వ్యోమగామి, కల్నల్ రాజా జె.చారి(45) ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ హోదాకు ఎంపికయ్యారు. ఈ హోదాకు ఆయన్ను ఎంపిక చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ గురువారం ఒక ప్రకటన చేశారు. ఈ నియమాకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంది. అధ్యక్షుడు జరిపే అన్ని పౌర, సైనిక నియామకాలపై సెనేట్ సాధారణంగా ఆమోదముద్ర వేస్తుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం రాజా చారి టెక్సాస్‌లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్లో క్రూ–3 కమాండర్, ఆస్ట్రోనాట్‌గా ఉన్నారు. రాజా చారి తండ్రి శ్రీనివాసా చారి తెలంగాణకు చెందిన వారు. ఆయన హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదివి అమెరికాకు చేరుకున్నారు. వాటర్లూలోని జాన్ డీర్ సంస్థలో పనిచేశారు.
రాజా చారి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, మేరీల్యాండ్‌లోని యూఎస్ నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 461వ ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్ కమాండర్‌గా, ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎఫ్–35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్‌కు డైరెక్టర్‌గాను వ్యవహరించారు. రాజా చారి తన కెరీర్లో 2,500 గంటలకు పైగా ఫ్టైట్ టైంను సాధించారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో బ్రిగేడియర్ జనరల్(బీడీ) ఒన్ స్టార్ జనరల్ ఆఫీసర్ స్థాయి. ఇది కల్నల్‌కు ఎక్కువ, మేజర్ జనరల్ స్థాయికి తక్కువ.