Indian Army chief
-
సరిహద్దులు సురక్షితం.. కానీ కొంత సున్నితం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాదీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్–చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ప్రస్తుతం సాధారణంగా, స్థిరంగానే ఉన్నప్పటికీ, కొంత సున్నితమైనవేనని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. సరిహద్దుల్లో ఎప్పుడు ఎలాంటి సవాలు ఎదురైనా గట్టిగా తిప్పికొట్టడానికి మన సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉన్నతస్థాయి సన్నద్ధతను పాటిస్తున్నాయని వెల్లడించారు. తగినన్ని సైనిక రిజర్వ్ దళాలు సరిహద్దుల్లో మోహరించాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో భద్రతాపరమైన వైఫల్యాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. సైనిక దినోత్సవం నేపథ్యంలో జనరల్ మనోజ్ పాండే గురువారం మీడియాతో మాట్లాడారు. సరిహద్దు వివాదం సహా ఇతర అంశాలకు పరిష్కారం కనుగొనడానికి భారత్, చైనా మధ్య సైనిక, దౌత్యవర్గాల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇక భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాట్లను కట్టడి చేస్తున్నామని తెలిపారు. జమ్మూకశీ్మర్‌లో హింసాకాండ తగ్గుముఖం పట్టిందని, రాజౌరీ–పూంచ్ సెక్టార్లో మాత్రం హింసాత్మక సంఘటనలు కొంతమేరకు పెరిగాయని వివరించారు. సరిహద్దుకు అవతలివైపు ఉగ్రవాద సంస్థలు చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. జమ్మూకశీ్మర్‌లో కాల్పుల విరమణ కొనసాగుతోందన్నారు. సరిహద్దు అవతలి వైపు నుంచి భారత్‌లోకి ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇండియా–మయన్మార్ సరిహద్దులో.. రెండు దేశాల నడుమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనే దిశగా భూటాన్–చైనా మధ్య కొనసాగుతున్న చర్చలపై జనరల్ మనోజ్ పాండే స్పందించారు. ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నామని చెప్పా రు. భూటాన్‌తో భారత్‌కు బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇక ఇండియా–మయన్మార్ సరిహద్దులో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని అంగీకరించారు. అక్కడి పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. -
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రోడ్రిగ్స్ కన్నుమూత
న్యూఢిల్లీ/పనాజీ: భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్(88) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గోవాలోని పనాజీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గత 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించినట్లు భారత సైన్యం ట్విట్టర్లో తెలియజేసింది. జనరల్ రోడ్రిగ్స్ 1990 నుంచి 1993 వరకు భారత సైనికాధిపతిగా పనిచేశారు. 2004 నుంచి 2010 దాకా పంజాబ్ గవర్నర్‌గా సేవలందించారు. రోడ్రిగ్స్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. -
పాక్, చైనాకు ఆర్మీ చీఫ్ వార్నింగ్!
న్యూఢిల్లీ: పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనాతో దేశానికి ముప్పు పొంచి ఉందని, అయితే సరైన సమయంలో స్పందించడం ద్వారా వారి పన్నాగాలను తిప్పికొట్టవచ్చని భారత సైనిక దళాల ప్రధానాధికారి మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. భారత్‌ను ఇరుకున పెట్టేవిధంగా ఇరు దేశాల మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని, ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని నిర్లక్ష్యం చేయలేమని పేర్కొన్నారు. ఆర్మీ డే(జనవరి 15) సమీపిస్తున్న నేపథ్యంలో జనరల్ నరవాణే మంగళవారం పత్రికా సమావేశం(వార్షిక) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. మనం మాత్రం టెర్రరిస్టుల పట్ల ఉక్కుపాదం మోపుతున్నాం. సరైన సమయంలో సరైన చోట సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టమైన సందేశం ఇస్తున్నాం’’ అని ప్రత్యర్థి దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. (చదవండి: 20 లక్షల కోసం ఆర్మీ కెప్టెన్ దురాగతం) అదే విధంగా.. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19ను ఎదుర్కోవడం అతిపెద్ద సవాలు అన్న ఆర్మీ చీఫ్ నరవాణే.. ‘‘ఉత్తర సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితి విధించి బలగాలను అప్రమత్తం చేశాం. శాంతియుతమైన పరిష్కారం కనుగొనడానికి మేం సహకరిస్తాం. అయితే అదే పరిస్థితుల్లో దీటుగా బదులిచ్చేందుకు కూడా సన్నద్ధమై ఉన్నాం. సమీప భవిష్యత్తులో రక్షణ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సాంకేతిక సహకారం అందిపుచ్చుకునే దిశగా ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకున్నాం’’ అని తెలిపారు. ఇక చైనాతో తూర్పు లదాఖ్‌లో ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ.. భారత్- చైనా వాస్తవాధీన రేఖ వద్ద మోహరించిన బలగాల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదని స్సష్టం చేశారు. ఇరు దేశాలు పరస్పర చర్చలు, సహకారంతో ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాయనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం తూర్పు లదాఖ్‌లో సుమారు 50 వేల భారత బలగాలు ఉన్నట్లు సమాచారం. -
పాక్‌కు సరైన రీతిలో బదులిస్తాం: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్‌కు సరైన రీతిలో బదులిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే హెచ్చరించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌లోని హంద్వారాలో పౌరుల ప్రాణాలను కాపాడేందుకు ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డి అమరులైన కల్నల్ అశుతోష్ శర్మతో పాటు మరో నలుగురు జవాన్ల పట్ల దేశం గర్విస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ సైన్యం తరచుగాకాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, భారత్‌లోకి ఉగ్రవాదులను రవాణా చేస్తోందని ఆరోపించారు. జనం ప్రాణాలను బలిగొంటున్న కరోనా మహమ్మారిపై పోరాడాలన్న ఆసక్తి పాకిస్తాన్‌కు లేదని, ప్రస్తుతం దాని దృష్టి మొత్తం భారత్‌లోకి ఉగ్రవాదులను పంపడంపైనే ఉందని మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే పాకిస్తాన్‌కు గుణపాఠం తప్పదని తేల్చిచెప్పారు. -
పాకిస్తాన్‌కు సరైన బుద్ది చెబుతాం..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ దుస్సాహసానికి భారత సైన్యం ఎల్లప్పుడు దీటుగా బదులిస్తుందని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. భారత్‌లో పదే పదే అక్రమ చొరబాట్లకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌కు సరైన బుద్ధి చెబుతామన్నారు. సోమవారం పీటీఐతో మాట్లాడిన ఎంఎం నరవాణే.. హంద్వారా ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్, భద్రతా సిబ్బంది, పోలీసులు, సైనికుల త్యాగాన్ని కీర్తించారు. గ్రామస్తులు, బందీలకు ఎటువంటి గాయాలు కాకుండా కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అశుతోశ్ శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్‌ను సమర్థవంతంగా పూర్తి చేశారని పేర్కొన్నారు. అదే విధంగా దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న దాయాది దేశం తీరుపై ఎంఎం నరవాణే మండిపడ్డారు. (భారత్ మందులు ఎగుమతి చేస్తుంటే.. పాక్..) ‘‘ప్రస్తుత పరిణామాలన్నింటినీ చూస్తుంటే కోవిడ్-19 వల్ల తలెత్తిన సంక్షోభం నుంచి గట్టెక్కడం కంటే పొరుగు దేశంలో చొరబడేందుకే పాకిస్తాన్‌కు ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తోంది. కశ్మీరీల స్నేహితుడిని అంటూ పాక్ పదే పదే ప్రగల్భాలు పలుకుతుంది కదా. మారణకాండ, ఉగ్రదాడులు సాగించడమేనా స్నేహం అంటే. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను ప్రోత్సహించే గుణాన్ని త్యజించనంత వరకు.. భారత్ వాళ్లకు సరైన రీతిలో బదులు ఇస్తూనే ఉంటుంది’’అని హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్-19పై సార్క్ దేశాల వీడియో కాన్ఫరెన్స్‌లో కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ పాకిస్తాన్ ఆ వేదికపై తన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకుందని ఈ సందర్భంగా నరవాణే విమర్శించారు. కరోనాపై పోరాటం చేసేందుకు ఆ దేశం సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు.(కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) కాగా చంగీముల్లా గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు సహా సుమారు 11 మందిని ఉగ్రవాదులు ఓ ఇంట్లో బందీలు చేసినట్లు సమాచారం అందించిన వెంటనే.. కల్నల్ శర్మ, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఖాజీ నేతృత్వంలో సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకోవడంతో.. కల్నల్, మేజర్ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అమరులయ్యారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.(ఓ వీర సైనికా నీకు వందనం) -
భారత్ మందులు ఎగుమతి చేస్తుంటే.. పాక్..
శ్రీనగర్: ప్రపంచమంతా కరోనా(కోవిడ్-19) మహమ్మారిని తరిమికొట్టేందుకు పోరాడుతుంటే పాకిస్తాన్ మాత్రం తన తీరును మార్చుకోవడం లేదని భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే ఆగ్రహం వ్యక్తం చేశారు. దాయాది దేశం నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) రేఖ వద్ద పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న వేళ సరిహద్ద వెంబడి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా పరిస్థితులను పర్యవేక్షించేందుకు నరవాణే రెండు రోజుల పర్యటన నిమిత్తం కశ్మీర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ‘‘భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలు మహమ్మారిని ఎదుర్కొనేందుకు పోరాటం చేస్తుంటే పొరుగు దేశం మాత్రం మనల్ని ప్రమాదంలో పడేయాలని చూడటం అత్యంత దురదృష్టకరం’’అని పేర్కొన్నారు. ‘‘మన పౌరులను కాపాడుకుంటూనే.. ఇతర దేశాలకు వైద్య బృందాలను పంపిస్తూ... ఔషధాలు ఎగుమతి చేస్తూ మనం బిజీగా ఉంటే... మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంపొందిస్తోంది. ఇది ఏమాత్రం శుభ శకునం కాదు’’అని నరవాణే పాక్ తీరును ఎండగట్టారు. ఇక భారత సైన్యంలో ఇప్పటి వరకు ఎనిమిది మందికి కరోనా సోకగా.. ఒకరు పూర్తిగా కోలుకుని విధుల్లో చేరారని నరవాణే వెల్లడించారు.(జమ్మూ కశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్) కాగా జమ్మూ కశ్మీర్‌లోని కీరన్ సెక్టార్ పరిధిలో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసి)కు ఎదురుగా ఉన్న దూద్‌నైల్లో కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్ ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 10న దూద్‌నైల్‌లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్ల వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులతో పాటు 15 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. -
తదుపరి ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్
న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే నియమితులు కానున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన తర్వాత అత్యంత సీనియర్ అయిన ముకుంద్ నరవానే ఆర్మీ చీఫ్‌గా నియమితులై 13 లక్షల మంది ఉన్న ఆర్మీని నడపనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఉన్నత స్థాయిలో పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాల వద్ద పనిచేస్తున్న ఈస్ట్రన్ కమాండ్‌ను నడిపించారు. 37 ఏళ్ల తన సర్వీసులో సమస్యాత్మక ప్రాంతాలైన జమ్మూకశ్మీర్ వంటి చోట్ల పనిచేశారు. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. మూడేళ్ల పాటు మయన్మార్‌లో ఉండి భారత ఎంబసీతో కలసి పని చేశారు. ఈయన నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, ఇండియన్ మిలిటరీ అకాడెమీ పూర్వ విద్యార్థి. ఈయన గతంలో ‘విశిష్ట సేవా అవార్డ్’తో పాటు ‘అతి విశిష్ట సేవా మెడల్’ కూడా అందుకున్నారు. తన బెటాలియన్‌ను జమ్మూకశ్మీర్‌లో చక్కగా నడిపించినందుకు సేనా మెడల్ కూడా అందుకున్నారు. బిపిన్ రావత్ పదవీ విరమణ అనంతరం డిఫెన్స్ స్టాఫ్ మొట్టమొదటి చీఫ్‌గానూ పనిచేసే అవకాశం ఉంది. -
భారత్‌పై అణు దాడి తప్పదు : పాక్
ఇస్లామాబాద్ : భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై దాయాది పాకిస్థాన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అనవసరమైన ఆరోపణలు చేస్తే అణు దాడి తప్పదని పేర్కొంది. పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్ ఈ మేరకు తన ట్విటర్లో ట్వీట్ చేశారు. ‘‘ఇండియన్ ఆర్మీ చీప్ భాద్యతారాహిత్యంగా మాట్లాడారు. ఇది ముమ్మాటికీ కవ్వింపు చర్యనే. అణుక్షిపణుల దాడికి భారత్ మాకు ఆహ్వానం పంపుతున్నట్లుంది. ఒకవేళ వారు యుద్ధానికి కాలుదువ్వితే అందుకు మేం కూడా సిద్ధమే. భారత్‌పై అణుదాడి తీవ్ర స్థాయిలో చేసి తీరతాం. ఆయన(రావత్) అనుమానాలు త్వరలోనే నివృత్తి అవుతాయని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మరోవైపు విదేశాంగ ప్రతినిధి ఫైసల్ కూడా రావత్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యాఖ్యలను తేలికగా తీసుకోబోమని ఆయన పేర్కొన్నారు. ఇక రావత్ దిగజారి మాట్లాడారని నిఘా వ్యవస్థ ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ అసిఫ్ గుఫర్ మండిపడ్డారు. శుక్రవారం ఆర్మీడే సందర్భంగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ... నిబంధనలకు విరుద్ధంగా పాక్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఆరోపించారు. అణు ఒప్పందాలను పాక్ ఉల్లంఘిస్తోందని.. పరిస్థితి చేజారితే పాక్ వాటిని భారత్ పై ప్రయోగించే అవకాశం లేకపోలేదని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం గనుక అనుమతిస్తే పాకిస్థాన్‌పై అణుయుద్ధానికి సైన్యం సిద్ధంగా ఉందని రావత్ పేర్కొన్నారు. “Very irresponsible statement by Indian Army Chief,not befitting his office. Amounts to invitation for nuclear encounter.If that is what they desire,they are welcome to test our resolve.The general's doubt would swiftly be removed, inshallah.” — Khawaja M. Asif (@KhawajaMAsif) 13 January 2018 The threatening and irresponsible statement by the Indian Army Chief today is representative of a sinister mindset that has taken hold of India. Pakistan has demonstrated deterrence capability.1/2 — Dr Mohammad Faisal (@ForeignOfficePk) 13 January 2018 These are not issues to be taken lightly. There must not be any misadventure based on miscalculation. Pakistan is fully capable of defending itself. 2/2 — Dr Mohammad Faisal (@ForeignOfficePk) 13 January 2018 -
ఇది డర్టీవార్.. కొత్త మార్గాల్లో పోరాడాలి
కశ్మీర్‌పై ఆర్మీ చీఫ్ రావత్ న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యం ‘డర్టీవార్’ను ఎదుర్కొంటోందని, ఈ యుద్ధంలో వినూత్న పోరాట మార్గాలను అనుసరించాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. రాళ్ల దాడిని ఎదుర్కోవడానికి మానవ కవచంగా ఓ కశ్మీరీ పౌరుడిని జీప్‌కు కట్టేసిన ఆర్మీ అధికారి మేజర్ లీతుల్ గొగోయ్‌ని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. మిలిటెంట్ల ప్రభావిత కశ్మీర్లో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న యువ అధికారులకు నైతిక స్థైర్యం పెంచడానికే గొగోయ్‌కి అవార్డు ఇచ్చామన్నారు. ‘ఇది ప్రచ్ఛన్న యుద్ధం. ప్రత్యర్థులు నీచ మార్గాల్లో యుద్ధం చేస్తున్నారు.. అందుకే వినూత్న విధానాల్లో పోరాడాలి’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘జనం మాపై రాళ్లు, పెట్రోల్ బాంబులు విసురుతున్నారు. మేమేం చేయాలని మా జవాన్లు అడిగితే వేచి చూసి, చచ్చిపోండని చెప్పాలా? జాతీయ పతాకం కప్పిన శవపేటికను తీసుకొచ్చి అందులో మీ శవాలను గౌరవంగా ఇంటికి పంపుతామని చెప్పాలా? ఆర్మీ చీఫ్‌గా నేనలా చెప్పలేను.. మా జవాన్లలో నైతిక బలాన్ని నేను కొనసాగించాల’ని రావత్ అన్నారు. కశ్మీర్ ఆందోళనకారులు రాళ్లు రువ్వకుండా తుపాకులతో కాల్పులు జరిపితే ఎదుర్కోవడానికి సులభంగా ఉండేదన్నారు. ‘మీరు మాపై రాళ్లు రువ్వకుండా కాల్పులు జరపండి.. తర్వాత ఏం చేయాలో అది చేస్తా’ అని వారిని ఉద్దేశించి అన్నారు. ఏ దేశంలోనైనా ప్రజలకు ఆర్మీపై భయం లేకపోతే ఆ దేశం నాశనమవుతుందని వ్యాఖ్యానించారు. తమది స్నేహపూర్వక సైన్యమని, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి తమను పిలిచినప్పుడు ప్రజలు భయపడాల్సి ఉంటుందని అన్నారు. -
అమెరికాకు ఇండియన్ ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: భారత సైనిక ప్రధాన అధికారి జనరల్ దల్బీర్ సింగ్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 5 నుంచి 8 వరకు అమెరికాలో ఆయన పర్యటించనున్నారు. ఓ సదుద్దేశంతో ఈ పర్యటనకు తెరతీశారు. ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయి సైనిక సంబంధాల్లో భాగంగానే ఈ పర్యటన ఖరారైంది. కాగా, ఈ పర్యటనలోనే దల్బీర్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించే పలు కార్యక్రమాలకు భారత ఆర్మీ మరింత కట్టుబడి ఉంటుందనే విషయాన్ని బాన్ కీ మూన్ కు ఆయన తెలియజేయనున్నారు. దీంతోపాటు యూఎస్ సెంట్రల్ కమాండ్, యూఎస్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ వంటి సంస్థలను కూడా ఆయన సందర్శిస్తారు. ఈ సందర్భంగా రక్షణకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోనున్నట్లు సమాచారం. -
జపాన్ ఆర్మీ చీఫ్ తో భారత ఆర్మీ చీఫ్ భేటీ
టోక్యో: జపాన్ ప్రధాన సైనికాధికారిని ఇతర అధికారులను భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణకు సంబంధించిన ఆందోళనలపై పరస్పరం చర్చించుకున్నారు. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన సహకారం ఎప్పటికీ కొనసాగేదిశగా వారి మధ్య చర్చలు జరిగినట్లు భారత ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ 16 నుంచి 19 వరకు దల్బీర్ సింగ్ జపాన్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్మీ విడుదల చేసిన ప్రకటనలో 'జనరల్ సింగ్ నారాసినో, సిమోసిజు, జపాన్ ఎయిర్ డిఫెన్స్ స్కూల్, ఫుజి క్యాంపు, జపాన్ మిడిల్ ఆర్మీకి చెందిన హెడ్ క్వార్టర్స్ లో పర్యటిస్తారు' అని పేర్కొంది. -
పాకిస్థాన్ కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కు భారత సైనికదళాల కొత్త ప్రధానాధికారి జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ గట్టి హెచ్చరిక జారీచేశారు. తమ సైనికులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. తగినరీతిలో జవాబు చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. సైనికుల తలలు తీయడం లాంటి ఘటనలు జరిగితే అవసరమైనదానికంటే ఎక్కువగా, వేగంగా, ఘాటుగా స్పందిస్తామని హెచ్చరించారు. పదవి చేపట్టి 24 గంటలు గడవక ముందే ఆయనీ హెచ్చరికలు చేయడం విశేషం. 26వ ఆర్మీ చీఫ్‌గా గురువారం సుహాగ్ బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు భారత సైనికుల తలలు నరికివేసిన ఘటనపై తగిన రీతిలోనే స్పందించామని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ బ్రికమ్ సింగ్ సమర్థించుకున్నారు. -
సరిహద్దు దాటి వస్తే కాల్చిపారేస్తాం: ఆర్మీ చీఫ్
ఏ ఉగ్రవాది అయినా సరే.. జమ్ము కాశ్మీర్ వద్ద నియంత్రణ రేఖను దాటి వచ్చాడంటే వెంటనే కాల్చిపారేస్తామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించి నియంత్రణ రేఖ వద్ద ఓ పౌరుడిపై కాల్పులు జరిపిందంటూ పాకిస్థానీ మీడియా గోల పెట్టడంతో ఆయనీ ప్రకటన చేశారు. 'ఎల్ఓసీని దాటి వచ్చే ఏ ఉగ్రవాదిమీద అయినా కాల్పులు జరిపి తీరుతాం' అని ఆయన స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరుపక్షాలూ గౌరవించేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నామే గానీ పెంచి పోషించాలని మాత్రం అనుకోవడం లేదని అన్నారు. పొరుగువారు నిబంధనలు పాటిస్తే తాము కూడా పాటిస్తామని, వాళ్లు ఉల్లంఘిస్తే తాము కూడా ఉల్లంఘించి తీరుతామని విక్రమ్ సింగ్ చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల రాకను అడ్డుకోడానికే తాము కాల్పులు జరుపుతున్నాం తప్ప పౌరుల మీద కాదని జనరల్ అన్నారు. డిసెంబర్ నెలలో ఇరుదేశాల డీజీఎంఓల సమావేశం తర్వాతి నుంచి కాల్పుల విరమణ ఉల్లంఘనలు గణనీయంగా తగ్గాయన్నారు.