జోరు తగ్గని పర్యాటకం
న్యూఢిల్లీ: భారత పర్యాటకులపై రూపాయి పతనం ప్రభా వం స్వల్పమేనని ప్రముఖ యాత్రా పోర్టళ్లు అంటున్నా యి. రూపాయి పతనంతో భారత టూరిస్టులు బెంబేలెత్తిపోవడం లేదని, తమ టూర్లను రద్దు చేసుకోవడం లేదని యాత్రాడాట్‌కామ్ సర్వేలో వెల్లడైంది. ఈ సంస్థ మొత్తం 6,000 మందిపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 62 శాతం మంది తమ షెడ్యూల్ ప్రకారమే టూర్లను కొనసాగిస్తున్నారని సర్వే పేర్కొంది. దక్షిణాసియా దేశాల పర్యటనకే భారత టూరిస్టుల ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆ తర్వాతి స్థానాల్లో యూరప్, అమెరికా, బ్రిటన్లు ఉన్నాయని తెలిపింది.
ప్రణాళిక ప్రకారమే...
పర్యాటకులు కనీసం రెండు నెలలు ముందుగానే తన ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటారని, అందువల్ల రూపాయి పతనం ప్రభావం పెద్దగా ఉండదని మేక్‌మైట్రిప్‌డాట్‌కామ్ పేర్కొంది. అయితే విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గిందని ఎక్స్‌పీడియాడాట్‌కోడాట్‌ఇన్ పేర్కొంది. అయితే రూపాయి పతనం వల్ల భారత్‌ను సందర్శించే విదేశీయుల సంఖ్య పెరుగుతుందని వివరించింది.