‘పారిశ్రామికాన్ని’ సగర్వంగా చాటుదాం
విధాన ప్రకటన కార్యక్రమ ఏర్పాట్లపై సీఎం సమీక్ష
♦ 2,500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు
♦ ప్రత్యేక వెబ్సైట్లో కొత్త విధానం వివరాలు
♦ ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో పరిశ్రమల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యున్నతంగా రూపొందించిన తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా సగర్వంగా చాటాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
ఈ నెల 12న హెచ్ఐసీసీ వేదికగా నూతన విధానాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘాలు, పరిశ్రమల ప్రతినిధులు, బిజినెస్ స్కూళ్ల నిర్వాహకులు, ఐటీ, ఫార్మా తదితర రంగాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ప్రముఖులు హాజరవుతున్న కార్యక్రమంలో ప్రత్యేకత చాటేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. అసెంబ్లీ ఇప్పటికే ఆమోదించిన ఐపాస్ చట్టం, నూతన విధానంలోని అద్వితీయ అంశాలను సగర్వంగా ప్రకటించుకోవాలన్నారు.
ఈ నెల 12న ఉదయం 11 గంటలకు విధాన ప్రకటన చేసిన మరుక్షణం నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు ఉండేలా చూడాలన్నారు. అదే రోజు ప్రారంభించే ప్రత్యేక వెబ్సైట్లో అన్ని వివరాలు ఉండాలని సీఎం ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి తెలంగాణలో అందుబాటులో ఉందని, ఇప్పటికే 1.60 లక్షల ఎకరాల భూమిని టీఎస్ఐఐసీకి అప్పగించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
వాటర్‌గ్రిడ్ ద్వారా పరిశ్రమలకు నీరు ఇవ్వడంతో పాటు, పారిశ్రామిక వాడల్లో మంచినీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులను ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో తెలంగాణలో పరిశ్రమలు స్థాపించే వారికి అనుకూల వాతావరణం కల్పిస్తామని సీఎం స్పష్టీకరించారు.
అనుమతుల కోసం తిరగొద్దు
తెలంగాణలో విద్యుత్ కొరతను అధిగమించడాన్ని ప్రపంచమంతా గమనిస్తోందని, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం వెల్లడించారు. అనుమతుల కోసం పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పదిహేను రోజుల్లోనే అనుమతులు ఇవ్వడాన్ని నూతన విధానం ప్రత్యేకతగా అభివర్ణించారు. పరిశ్రమల అనుమతులు, ఇతర వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సీఎం కార్యాలయంలో ప్రత్యేక అధికారి నేతృత్వంలో చేజింగ్ సెల్ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
బహుళజాతి సంస్థలు, ప్రముఖ పరిశ్రమలు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ఆసక్తితో గమనిస్తున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్’ అనే నినాదానికి ఆకర్షితులై పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారన్నారు. తెలంగాణ వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలకు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా వుందన్నారు.
రక్షణ శాఖ పరిశోధన సంస్థలు, ఐటీ కంపెనీలు, వివిధ కంపెనీల డేటా బేస్ సెంటర్లు ఉండటంతో పాటు అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ విడిభాగాలు ఇక్కడే తయారవుతున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. దేశంలోని వివిధ కంపెనీల ప్రతినిధులు, సీఈఓలు, ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులు, ఫిక్కీ, ఫ్యాప్సీ వంటి పరిశ్రమల సంఘాలు నూతన పారిశ్రామిక విధానం మార్గదర్శకాల విడుదల కార్యక్రమానికి హాజరవుతున్నారు. క్రెడాయ్, ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్ రంగాల ప్రముఖులనూ ఆహ్వానిస్తున్నారు.
హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోని పరిశ్రమల యజమానులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, జాతీయ మీడియా సంస్థలకు ఆహ్వానాలు పంపినట్లు సీఎం వెల్లడించారు.