Industry growth
-
ల్యాబ్ డైమండ్లతో ఉపాధికి ఊతం
జైపూర్: ల్యాబ్‌లలో తయారు చేసే వజ్రాలు (ఎల్జీడీ) కృత్రిమమైనవి కావని, వాటికి కూడా ప్రస్తు తం సహజ వజ్రాలుగా ఆమోదయోగ్యత పెరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇలాంటి సానుకూల పరిణామాలు పరిశ్రమ వృద్ధికి దోహదపడగలవని, దీనితో ఉపాధి కల్పనకు కూడా ఊతం లభించగలదని ఆయన చెప్పారు. ఎల్జీడీల తయారీలో సౌర, పవన విద్యుత్ వంటి వనరులను వినియోగించడం వల్ల ఇది పర్యావరణానికి కూడా అనుకూలమైనదని మంత్రి తెలిపారు. జూన్ 22న అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 7.5 క్యారట్ల ఎల్జీడీని అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు బహూకరించడం ల్యాబ్ డైమండ్లకు పెరుగుతున్న ఆమోదయోగ్యతకు నిదర్శనం. ఎల్జీడీల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎల్జీ డీ సీడ్స్‌పై 5% కస్టమ్స్ సుంకాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, దేశీ యంగా ఎల్జీడీ యంత్రాలు, సీడ్స్, తయారీ విధానాన్ని రూపొందించడంపై పరిశోధనలు చేసేందుకు ఐఐటీ–మద్రాస్‌కు రీసెర్చ్ గ్రాంట్ ప్రకటించింది. 2025 నాటికి ఎల్జీడీ ఆభరణాల మార్కెట్ 5 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. 2021 –22లో కట్, పాలిష్డ్ ఎల్జీడీల ఎగుమతులు 1.35 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది ఏప్రిల్–డిసెంబర్ వ్యవధిలో 1.4 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. -
ఐటీ ఆదాయాలకు సవాళ్లు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ రంగంలో సవాళ్లు మొదలైనవి దేశీ ఐటీ కంపెనీల ఆదాయాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రతికూలంగా పరిణమించవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి దాదాపు 20 శాతంగా ఉండనుండగా .. 2024 ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ‘అమెరికా, యూరప్ వంటి కీలక మార్కెట్లలో.. ముఖ్యంగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) విభాగంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఇవి దేశీ ఐటీ సేవల కంపెనీల ఆదాయాల వృద్ధిపై ప్రభావం చూపనున్నాయి’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం తర్వాత బీఎఫ్ఎస్ఐ సెగ్మెంట్లో కొంత ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు. ఫలితంగా ఈ విభాగం ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్ మధ్య స్థాయికి పడిపోవచ్చని వివరించారు. అయితే, తయారీ రంగంలో 12–14 శాతం, ఇతర సెగ్మెంట్లలో 9–11 శాతం వృద్ధి నమోదు కావచ్చని.. తత్ఫలితంగా బీఎఫ్ఎస్ఐ విభాగంలో క్షీణత ప్రభావం కొంత తగ్గవచ్చని వివరించారు. దాదాపు రూ. 10.2 లక్షల కోట్ల భారతీయ ఐటీ రంగంలో 71 శాతం వాటా ఉన్న 17 కంపెనీల డేటాను విశ్లేషించి క్రిసిల్ ఈ నివేదిక రూపొందించింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► క్లయింట్లు ఐటీపై ఇష్టారీతిగా ఖర్చు చేయకుండా, ప్రతి రూపాయికి గరిష్టమైన ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి డీల్స్నే కుదుర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. దీనితో పాటు డిజిటల్ సొల్యూషన్స్, క్లౌడ్, ఆటోమేషన్ సామరŠాధ్యలు మొదలైనవి డిమాండ్‌కి దన్నుగా ఉండనున్నాయి. ► ఐటీ రంగం ఆదాయాల్లో బీఎఫ్ఎస్ఐ వాటా 30 శాతం వరకు ఉంటోంది. తలో 15 శాతం వాటాతో రిటైల్, కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ విభాగాలు ఉంటున్నాయి. మిగతా వాటా లైఫ్ సైన్సెస్ .. హెల్త్‌కేర్, తయారీ, టెక్నాలజీ.. సర్వీసెస్, కమ్యూనికేషన్.. మీడియా మొదలైన వాటిది ఉంటోంది. ► ఐటీ సంస్థలు కొత్తగా నియామకాలు .. ఉద్యోగులపై వ్యయాలను తగ్గించుకోనుండటంతో 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభదాయకత స్వల్పంగా 0.50–0.60 శాతం మెరుగుపడి 23 శాతంగా ఉండొచ్చు. ► ఉద్యోగులపై వ్యయాలు పెరగడం వల్ల 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 1.50–1.75 శాతం మందగించి దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 22–22.5 శాతానికి తగ్గవచ్చు. ► అట్రిషన్‌లు (ఉద్యోగుల వలసలు) ఇటీవల కొద్ది త్రైమాసికాలుగా తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత తగ్గవచ్చు. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ ఉద్యోగులను సమర్ధంగా ఉపయోగించుకోవడం, సిబ్బందికి శిక్షణనిస్తుండటం, రూపాయి క్షీణత ప్రయోజనాలు మొదలైన సానుకూల అంశాల కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 0.50–60 శాతం మెరుగుపడి 23 శాతానికి చేరవచ్చు. అయినప్పటికీ కరోనా పూర్వం 2016–20 ఆర్థిక సంవత్సరాల మధ్య నమోదైన సగటు 24 శాతానికన్నా ఇంకా దిగువనే ఉండొచ్చు. ► దేశీ ఐటీ కంపెనీల రుణ నాణ్యత స్థిరంగానే ఉంది. రూపాయి మారకం విలువ గణనీయంగా పెరగడం, మాంద్యం ధోరణులు ఒక్కసారిగా ముంచుకురావడం వంటి రిస్కులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. -
మౌలిక రంగం డౌన్... తయారీ జూమ్!
న్యూఢిల్లీ: కీలకమైన ఎనిమిది మౌలిక పరిశ్రమల వృద్ధి రేటు మే లో పది నెలల కనిష్టానికి పడిపోయింది. 3.6 శాతానికి పరిమితమైంది. ముడిచమురు, సహజవాయువు ఉత్పత్తి క్షీణించడమే ఇందుకు కారణం. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతేడాది మే లో ఎనిమిది కీలక పరిశ్రమల వృద్ధి 3.9 శాతంగా ఉంది. 2017 జూలై తర్వాత మౌలిక రంగం వృద్ధి ఇంత తక్కువ స్థాయిలో ఉండటం ఇదే ప్రథమం. అప్పట్లో ఇది 2.9 శాతంగా నమోదైంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో 4.6 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది మే తో పోలిస్తే తాజాగా ఈ ఏడాది మేలో క్రూడాయిల్ ఉత్పత్తి 2.9 శాతం, సహజవాయువు ఉత్పత్తి 1.4 శాతం మేర క్షీణించింది. అటు రిఫైనరీ ఉత్పత్తుల తయారీలో వృద్ధి రేటు 4.9 శాతానికి (గతేడాది మేలో 5.4 శాతం), ఉక్కు 0.5 శాతానికి (3.8 శాతం), విద్యుదుత్పత్తి 3.5 శాతానికి (గత మేలో 8.2%) పరిమితమైంది. అయితే బొగ్గు 12.1%, ఎరువుల ఉత్పత్తి 8.4% వృద్ధి కనపర్చాయి. తయారీకి డిమాండ్ జోష్... ఇటు దేశీయంగాను, అటు విదేశాల నుంచి ఆర్డర్ల రాకతో జూన్‌లో తయారీ రంగం ఊపందుకుంది. తయారీ రంగ కార్యకలాపాల వృద్ధిని నమోదు చేసే నికాయ్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) 53.1 పాయింట్లకు చేరడం దీనికి నిదర్శనం. మేలో ఇది 51.2గా ఉంది. గతేడాది డిసెంబర్ తర్వాత ఇంత వేగవంతమైన వృద్ధి నమోదు కావడం ఇదే ప్రథమం. అలాగే, వరుసగా 11వ నెలలోనూ తయారీ రంగ పీఎంఐ కీలకమైన 50 పాయింట్లకు ఎగువన కొనసాగడం గమనార్హం. సాధారణంగా పీఎంఐ 50 పాయింట్లకు ఎగువన ఉంటే వృద్ధిని, అంతకన్నా దిగువన ఉంటే మందగమనాన్ని సూచిస్తుంది. భారీ ఆర్డర్లు, డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడిందని నివేదికను రూపొందించిన ఆర్థికవేత్త ఆష్నా దోధియా తెలిపారు. ఉత్పత్తి అవసరాలు పెరుగుతున్నందున తయారీ సంస్థలు కొనుగోలు కార్యకలాపాలు, అదనపు సిబ్బంది నియామకాలపై దృష్టి సారించాయి. ధరలపరంగా చూస్తే ముడివస్తువుల రేట్లు పెరగడంతో.. ఉత్పత్తి వ్యయాలూ పెరిగాయి. -
హెచ్‌యూఎల్ లాభం రూ. 1,057 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 1,057 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,019 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 4% వృద్ధి. ఈ కాలంలో లభించిన రూ. 106 కోట్ల అదనపు ఆదాయం ఇందుకు దోహదపడింది. ఇదే కాలంలో కంపెనీ అమ్మకాలు 13% పుంజుకుని రూ. 7,571 కోట్లకు చేరాయి. గతంలో రూ. 6,687 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. స్టాండెలోన్ ఫలితాలివి. మరోసారి పరిశ్రమ వృద్ధిని మించిన పనితీరును చూపినట్లు కంపెనీ చైర్మన్ హరీష్ మన్వని చెప్పారు. ఈ బాటలో అటు అమ్మకాలు, ఇటు లాభాల్లో మంచి పురోగతిని సాధించినట్లు తెలిపారు. అయితే మార్కెట్లు మందగమనంలో ఉన్నాయని, ఇకపై మరింతగా నెమ్మదించే అవకాశముందని కంపెనీ సీఎఫ్‌వో పీబీ బాలాజీ చెప్పారు. ప్రీమియం విభాగంలో చూస్తే కస్టమర్లు చిన్న తరహా ప్యాకెట్లు కొనేందుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. సబ్బుల అమ్మకాలు ఓకే సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకాలు 13% పుంజుకుని రూ. 3,848 కోట్లకు చేరగా, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు దాదాపు 15% పెరిగి రూ. 2,160 కోట్లయ్యాయి. పానీయాల విభాగం నుంచి 10% అధికంగా రూ. 837 కోట్ల ఆదాయం లభించగా, ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల అమ్మకాలు 19% ఎగసి రూ. 544 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు బీఎస్ఈలో దాదాపు 4% జంప్‌చేసి రూ. 686 వద్ద ముగిసింది.