పడగొట్టిన విదేశీ అంశాలు
►సెన్సెక్స్ 192 పాయింట్లు డౌన్
►25,895 వద్ద ముగింపు
►70 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ
►మూడు వారాల్లో అత్యధిక నష్టం
యూరోజోన్ ద్రవ్యోల్బణం జూలై నెలకు అనూహ్యంగా 0.4%కు పడిపోవడం, పోర్చుగల్(లిస్బన్) స్టాక్ ఎక్స్ఛేంజీలో బ్యాంకింగ్ సంస్థ ఎస్పిరిటో శాంటో షేర్లు 50% పతనంకావడం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. యూరో ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్టానికి చేరగా, ఎస్పిరిటో బ్యాంక్ రెండో క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రికార్డుస్థాయి న ష్టాలను ప్రకటించడం ఇందుకు కారణమయ్యాయి. దీంతో దేశీయంగానూ స్టాక్ మార్కెట్లు బలహీనంగా మొదలయ్యాయి. ఆపై స్వల్ప ఒడిదుడుకుల మధ్య కదులుతూ వచ్చాయి.
యూరప్ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతుండటంతో ఉన్నట్టుండి మిడ్ సెషన్లో అమ్మకాలు పెరిగాయి. వెరసి సెన్సెక్స్ కనిష్టంగా 25,853 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 192 పాయింట్ల నష్టంతో 25,895 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా గత మూడు వారాల్లోలేని విధంగా 70 పాయింట్లు క్షీణించి 7,721 వద్ద నిలిచింది. ఉక్రెయిన్ ఆందోళనలు, జూలై ఎఫ్‌అండ్‌వో ముగింపు వంటి అంశాలు కూడా మార్కెట్ల హెచ్చుతగ్గులకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు. సెన్సెక్స్ ఇంతక్రితం జూలై 11న 348 పాయింట్లు పతనమైంది.