స్వాతి హత్యకేసు చెన్నై పోలీసులకు బదిలీ
చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసు విచారణను చెన్నై పోలీసులకు బదిలీ చేస్తూ మద్రాసు హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో స్వాతి శుక్రవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ముందుగా ఈ కేసును రైల్వే పోలీసులు విచారణ చేపట్టగా, ఎలాంటి పురోగతి లేకపోవడంతో హైకోర్టు కేసును చెన్నై పోలీసులకు బదిలీ చేసింది. అంతకు ముందు ఈ హత్య కేసుపై మధ్యాహ్నం 3 గంటలకు ప్రాథమిక నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించారు.
మరోవైపు డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఇవాళ స్వాతి కుటుంబసభ్యుల్ని కలిశారు. ఆమె తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో కుటుంబానికి ఇటువంటి పరిస్థితి రాకూడదన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఎవరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. అయితే సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి ఊహా చిత్రాలను రైల్వే పోలీసులు విడుదల చేశారు.