inner voice
-
నిశ్శబ్దం: ఓ అద్భుత ఆంతరంగిక వాణి
ప్రకృతి మనకు అందించే శ్రవణానందకర శబ్దాలను విని ఆనందించేటందుకు, మనలోని సృజనాత్మక శక్తిని వెలికి తీసేటందుకు, రసాస్వాదనకు ఒక ప్రశాంత స్థితి, ఒక నిర్మలత కావాలి. అది నిశ్శబ్ద వాతావరణంలోనే కుదురుతుంది. ఆ కోణంలో చూసినపుడు మన సృజనశక్తులు జాగృతమై చైతన్యవంతమయ్యే ఓ అద్భుత స్థితికి కావలసిన ఆవరణను కల్పించేదే నిశ్శబ్దమంటే. ఒక చేతిలోని పదునైన ఉలిని ఒక కఠినమైన రాయిపై ఉంచి, మరొక చేతిలోని సుత్తితో లాఘవంగా, ఒడుపుగా తన మనసులోని అద్భుత రూపానికి జీవకళ ఉట్టిపడేటట్టుగా ఆకుంఠిత దీక్షతో శిల్పి పనిచేస్తుంటాడు. కావలసిన రంగులుంచుకున్న పళ్ళేన్ని ఒక చేతిలో, కుంచెను మరొకచేతిలో పట్టుకున్న ఓ చిత్రకారుడు తన ఊహాచిత్రానికి ఓ చక్కని రూపునిచ్చే తపోదీక్షలో ఉంటాడు. కలాన్ని తన చేతి వేళ్ళ మధ్య ఉంచుకుని ఆలోచనా క్షీరసాగరాన్ని మధనం చేస్తూ భావ సంక్లిష్టత, అస్పష్టతలనే కెరటాల గరళాన్ని అధిగమిస్తూ సాహిత్యామృతాన్ని అందించే యత్నం చేస్తుంటాడు రచయిత. ఈ సృజన ఒక నిశ్శబ్ద వాతావరణంలోనే సాధ్యమవుతుంది. నిశ్శబ్దంలో మనలోని ఏకాగ్రత, స్థిరత్వం, నిశ్చలతలు బలోపేతమవుతాయి. అపుడు మనం దృష్టి్ట కేంద్రీకరించగలుగుతాం. ఆంగ్ల భాషలో నిశ్శబ్దానికి, మౌనానికి అర్ధభేదం లేదు. నిశ్శబ్దం అనే ఒకేరకమైన మాటను వాడతారు. కాని, తెలుగుభాషలో ఈ రెండిటికి ఎంతో తేడా ఉండటమే కాదు ఎంతో లోతైన, విస్తృతమైన అర్థంలో వాడతాం.. కొన్ని సందర్భాలలో, ప్రదేశాలలో మనం నిశ్శబ్దంగా ఉండాలి. పాఠాలను, ప్రసంగాలను, సంగీత కచేరిలో సంగీతాన్ని వింటున్న వేళల్లో, గ్రంథాలయం లాంటి ప్రదేశాలలో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఈ నిశ్శబ్దం పాటించటంలో మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు. తప్పనిసరైన నియమం. అయితే, మౌనం మనం పాటించేది. వ్యక్తిగతం. మన ఇష్టపూర్వకంగా స్వీకరించేది. ధ్యానం ఒక నిశ్శబ్ద పయనం. మన అంతరంగమనే సాగరంలోకి వెళుతూ దాని ఘోషను వినగలిగే ఓ అద్భుత అవకాశం. ఈ మౌనం మనం నియమించుకున్న నిశ్శబ్దం ఒక ప్రశాంతమైన వాతావరణం. మన నడవడికను నెమరు వేసుకునే సందర్భం. మంచి, చెడులను తెలుసుకునేందుకు మనకై మనం పెట్టుకున్న నిబంధన. నిరంతర సుదీర్ఘ ప్రయాణం. అది మనల్ని ఉన్నతంగా ఆలోచింపచేస్తుంది మానవ దౌర్బల్యాలను, బలహీనతలను దాటగలిగే మానసిక స్థైర్యాన్ని ఈ నిశ్శబ్ద వాతావరణం మనకు ప్రసాదిస్తుంది. మన సాహిత్యకారులు నిశ్శబ్దం తాండవిస్తోంది అని వర్ణిస్తుంటారు. శబ్దశూన్యతే నిశ్శబ్దం అయినప్పుడు నర్తిస్తున్నదనటంలో అర్థమేమిటి? అపార్థాలతో కాపురం చేసే భార్యాభర్తల మధ్య మాటలుండవు. కాని, ఇరువురి మనసుల్లో అభివ్యక్తం కాని అనంతమైన ఆలోచనలు, భావాలు వారి మనోసంద్రపు తీరాన్ని తాకి మళ్లీ వెనకకు పోతుంటాయి. పై చెప్పిన మాటకు అర్థమిదే. భావాలు, మనోభావాలు ఘనీభవించిన స్థితే ఇక్కడ నిశ్శబ్దమంటే. పరపాలనలో మగ్గే ప్రజ తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద కూడ అధికారాన్ని, నియంత్రణను చూపుతూ, తమధన, మాన, ప్రాణాలను దోచుకునే పాలకుల దౌర్జన్యం, దోపిడీ కొంతవరకే ఓర్చుకోగలరు. వాటిని నిశ్శబ్దంగా భరిస్తుంటారు. వారి స్వాతంత్య్ర కాంక్ష అగ్నిపర్వతపు లావాలా పొగలు కక్కుతుంటుంది. ఈ నిశ్శబ్దం విస్ఫోటనమైన వేళ వచ్చే పర్యవసనం భయంకరంగా ఉంటుంది. అది బీభత్సాన్ని సృష్టిస్తుంది. ఒక్కోసారి కొన్ని వందల మాటల్లో చెప్పలేనిది కూడ ఒక అర్థవంతమైన నిశ్శబ్దం సూచిస్తుంది. అది మన మనసుకు అద్దం పడుతుంది. నిశ్శబ్దం ఓ అద్భుతమైన శక్తి. మన అనేకమైన మిశ్రమ భావాలకు భాష్యం చెప్పగలదీ నిశ్శబ్దం. నిశ్శబ్దమిచ్చే ఏకాంతంలో, ఆలోచనలో సత్యశోధన చేయగలం. సత్యాన్ని దర్శించగలం. అందుకే నిశ్శబ్దం ఒ అద్భుత ఆంతరంగిక వాణి. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు. -
లోపలి శత్రువు
ప్రతి మనిషికీ అంతరంగంలో ఆరుగురు శత్రువులు ఉంటారని చెబుతారు. ఆ శత్రువును ఓడించి అదుపులో పెట్టగలిగినప్పుడు ఆ మనిషికి పురోగతి సాధ్యమవుతుంది. అదుపులో పెట్టలేకపోతే పతనం తప్పదు. ఇది మనకు చిరకాలంగా వినిపిస్తున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ థియరీ. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేవి విడివిడిగా వ్యక్తులకు ఉండే ఆరుగురు అంతః శత్రువులు. వీటినే అరిషడ్వర్గాలు అంటున్నాము. వ్యక్తులపై కాకుండా సమూహాలపై దాడి చేసే అంతః శత్రువులు కూడా ఉంటారు. ఈ శత్రువులు సామాజిక విలువల రూపంలో కూడా ఉండవచ్చు. కట్టుబాట్ల రూపంలో ఉండవచ్చు. ఆచార సంప్రదాయాల రూపంలో కూడా ఉండవచ్చు. ఈ సంప్రదాయాలు మన మెదళ్లలో తిష్ఠ వేసుకొని ఆలోచనలను తమ గుప్పెట్లోకి తీసుకుంటూ ఉండవచ్చు. సమాజం గతిశీలమైనది. నిరంతర చలనం దాని స్వభావం. వస్తుగత మార్పులను ఎప్పటికప్పుడు అది ఆహ్వానిస్తూనే ఉంటుంది. సామాజిక చైతన్యాన్ని శాశ్వత విలువలతో, కట్లుబాట్లతో నియంత్రించడం సాధ్యం కాదు. ఒకప్పుడు సదాచారాలు అనుకున్నవి కాలక్రమంలో దురాచారాలుగా పరిగణించవచ్చు. అటువంటి దురాచారాలను క్రమానుగతంగా మన సమాజం తొలగించుకుంటూ పురోగమిస్తున్నది. అట్లా తొలగించుకోలేక మిగిలిపోయిన దురాచారాలే సమాజ వికాసానికి ప్రతిబంధకాలవుతున్నాయి. కాలానుగుణమైన మార్పుల్ని ఆహ్వానించడం ఒక పురోగామి సూత్రం. అటువంటి మార్పులు మన ఆలోచనల్లో రావాలి. మనం ఏర్పరచుకున్న చట్టాల్లో కూడా రావాలి. మొన్న ఒక అబార్షన్ సంబంధిత కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం చెప్పింది ఇదే. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడం మహిళలకు ఉండే తిరుగులేని హక్కుగా సమున్నత న్యాయస్థానం గుర్తించింది. ఇది వైవాహిక స్థితిగతులతో సంబంధం లేకుండా మహిళలందరికీ వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. మనదేశంలో పెళ్లి కాకుండానే గర్భం దాలుస్తున్న బాలికలు, యువతుల సంఖ్యకు లెక్కలేదు. ఇటువంటి అవాంఛిత గర్భాలకు వారినే బాధ్యులుగా చేయటం దుర్మార్గం. తాము ఎదిరించలేని వారు, తమ వారు అనుకున్న వారి అఘాయిత్యాల బారిన పడుతున్న యువతులు ఎంతో మంది ఉంటున్నారు. కామాంధుల అత్యాచారాలకు గురవు తున్న వారు కూడా ఎంతోమంది ఉంటున్నారు. వీరే కాదు, వ్యక్తిగత కారణాల రీత్యా వివాహానికి దూరంగా ఉండదలచిన వారు, విడాకులు తీసుకున్న వారు కూడా చాలామంది ఉంటారు. ఇష్టపూర్వకమైన కలయికలు చట్టవిరుద్ధం కాదని గతంలోనే న్యాయస్థానం తీర్పు చెప్పింది. కలయిక చట్టవిరుద్ధం కానప్పుడు గర్భస్రావం మాత్రం ఎట్లా చట్టవిరుద్ధమవుతుంది? ఈ వైరుద్ధ్యాన్ని సుప్రీంకోర్టు తొలగించింది. పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన స్త్రీలకు పునరుత్పాదక హక్కులనేవి సహజ హక్కులు. ఈ సత్యాన్ని న్యాయస్థానం గుర్తించినట్లయింది. మన న్యాయస్థానాలు అప్పుడప్పుడు ఇటువంటి ప్రగతి శీలమైన తీర్పులనివ్వడం ద్వారా సామాజిక వికాసానికి దోహదం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే అమెరికా సుప్రీంకోర్టు ఇదే విషయంలో భిన్నమైన తీర్పు చెప్పిన నేపథ్యంలో మన సుప్రీం తీర్పు గర్వకారణం. అయితే మన న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో సామాజికాంశాలకు సంబంధించి ప్రగతి నిరోధకమైన తీర్పుల్ని ఇవ్వకపోలేదు. న్యాయమూర్తులు కూడా సమాజంలో భాగమే కనుక సామాజిక విలువలుగా చలామణిలో ఉన్న భావజాల ప్రభావం వారిపై కూడా ఉండవచ్చు. పితృస్వామిక వ్యవస్థ భావజాల ప్రభావం నుంచి చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు కూడా తప్పించు కోలేకపోతున్నారు. పదేళ్ల కిందట సుప్రీంకోర్టులోనే ఒక విడాకుల పిటిషన్ మీద ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా సరే భర్త బదిలీపై వెళ్ళినప్పుడు భార్య తన ఉద్యోగాన్ని వదిలేసైనా సరే వెళ్లాలని కోర్టు చెప్పింది. సీతాదేవి శ్రీరాముడిని అనుసరించి వెళ్లినట్లు భార్య కూడా భర్తను అనుసరించి వెళ్లాలని కోర్టు అభిప్రాయ పడింది. అంతేకాదు, భార్యల సంపాదనను ‘లిప్‌స్టిక్ మనీ’గా కూడా పోల్చింది. 2018లో కేరళ హైకోర్టులో మరో న్యాయమూర్తి ఒక తీర్పును ఇస్తూ చేసిన వ్యాఖ్యానం మరింత దిగ్భ్రాంతికరంగా ఉన్నది. భార్యకు ఉండవలసిన లక్షణాలను చెప్పడానికి ఆయన ఒక సంస్కృత∙శ్లోకాన్ని ఉదహరించారు. పితృస్వామిక భావజాలానికి పరాకాష్ఠ ఈ శ్లోకం. బాగా పాపులర్. పురుషుల్లో చాలామందికి నచ్చుతుంది కూడా! ‘కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రి...’! భార్య చూడటానికి లక్ష్మీదేవిలా ఉండా లట! భర్తకు దాసి లాగా సేవ చేయాలి. మంత్రిలా సలహా లివ్వాలి. అమ్మలా తినిపించాలి. రంభలా శయనించాలి. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి. పురుషాధిక్య సమాజం కనుక పురుషుని కోణం నుంచి, కోర్కెల నుంచి అల్లిన శ్లోకం బాగానే ఉన్నది. కానీ దీన్నే తిరగేసి స్త్రీల కోణం నుంచి కొత్త శ్లోకం అల్లితే? తమ పురుషునిలో స్త్రీ కోరుకునే లక్షణాలపై పరీక్ష పెడితే ఎంతమంది పురుష పుంగవులు పాస్ మార్కులు తెచ్చు కోగలరు? చెప్పడం కష్టం. ఇటువంటి కాలం చెల్లిన మౌఢ్యాన్ని సమాజం వదిలించుకోలేకపోతే ఇప్పుడు మనకు అవసరమైన పురోగతిని సాధించటం సాధ్యం కాదు. అండపిండ బ్రహ్మాండమైన విశ్వంలో భూగోళమే ఒక పిపీలికం. మన పిపీలికం ఉన్న పాలపుంత ఈ చివరి నుంచి ఆ చివరవరకు కాంతి వేగంతో ప్రయాణం చేస్తే లక్ష సంవత్సరాలు పడుతుందట! ఈ పాలపుంతను పోలిన గెలాక్సీలు విశ్వంలో వందల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు నరజాతి సాధించిన శాస్త్ర సాంకేతిక ప్రతిభ ఎక్కడున్నట్టు? విశ్వ రహః పేటికా విపాటన లక్ష్యం సాధించేది ఎప్పుడు? భూగోళంలో తన చరిత్రను తాను ఇప్పటికీ మానవుడు పూర్తిగా ఆవిష్కరించలేదు. క్రీస్తు పుట్టిన తర్వాత రెండు వేల యేళ్లు, అంతకుముందో వెయ్యేళ్లు తప్ప అంతకుమించి మనకున్నది అరకొర జ్ఞానమే. ఎన్నో మహో న్నతమైన నాగరికతలు ఎందుకు అంతరించాయో తెలియదు. ఆ నాగరికతల పూర్తి వివరాలూ తెలియవు. మూడున్నర వేల ఏళ్లకు పూర్వమే మహిళలకు సురక్షితమైన గర్భస్రావ విధానాలు ఎటువంటి వివక్ష లేకుండా అందుబాటులో ఉన్నాయని ఆధారాలు కూడా ఈజిప్టులో దొరికాయి. ఇన్నాళ్లకు ఇప్పుడు మనం సుప్రీంకోర్టు తీర్పును గొప్ప ముందడుగుగా వర్ణించుకునే దుఃస్థితిలో ఉన్నాము. ఎటువంటి అరమరికలు, విభేదాలు లేనప్పుడే, ప్రజలం దరూ ఐక్యమైనప్పుడే, విజ్ఞానవంతులైనప్పుడే మానవజాతి శాస్త్ర సాంకేతిక పురోగతి సాధించగలుగుతుంది. కానీ మతాన్ని సంకుచితంగా అన్వయించి, మౌఢ్యంగా అనువదించి విసురు తున్న కత్తులతో, పారిస్తున్న నెత్తురుతో నరజాతి శత్రు శిబిరాలుగా విడిపోతున్నది. మనదేశంలో కులోన్మాదం కలిగిస్తున్న నష్టం ఇంతా అంతా కాదు. వీటితో పాటు ఇంకా మన మెదళ్లలో తిష్ఠవేసిన పితృస్వామిక భావజాలం సగం జనాభాలోని ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని చంపేస్తున్నది. ఈ పితృస్వామిక భావజాలం ఓ సైలెంట్ కిల్లర్. మతాలు, కులాలు, దురాచారాలు చేసిన నష్టం కంటే ఎక్కువ నష్టాన్ని నిశ్శబ్దంగా చేసుకుపోతున్నది. అభ్యుదయవాదులు, విప్లవకారు లుగా చెప్పుకునే వాళ్లు కూడా దీని కనికట్టు పట్టులో చిక్కుకుంటు న్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. మన టెలివిజన్లలో వచ్చే కార్యక్రమాల్లో చెత్త కార్యక్రమాలు కోకొల్లలు. సకుటుంబ సపరివార సీరియళ్ల పేరుతో కొన్ని సీరియళ్లు బోలెడంత సామాజిక కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఇన్ని చెత్తల్లో ఒక చెత్త ‘బిగ్ బాస్’. కానీ మన అభ్యుదయవాదుల టార్గెట్ మాత్రం ‘బిగ్ బాస్’ ఒక్కటే. ఎందుకంటే అందులో ఓ పదిమంది అమ్మాయిలు, ఓ పదిమంది అబ్బాయిలు కొంత కాలం పాటు కలిసి ఉంటారట! ఎంతో పరిణతి పొందిన యువతీ యువకులు వీరు. చదువుకున్న వాళ్ళు, స్వతంత్రంగా జీవన గమనాన్ని సాగిస్తున్న వారు. వాళ్ళంతా కలిసి కొన్ని రోజులపాటు ఒకే ఇంట్లో ఉండి ఆటలాడినంత మాత్రాన ఏదో ప్రళయం ముంచుకొస్తుందట! ఆకాశం కుంగిపోతుందట! అగ్ని పర్వతాలు బద్దలవుతాయట! మన సంస్కృతీ సంప్రదాయా లను ఈ కార్యక్రమం మంటగలుపుతున్నదని విమర్శించేవాళ్లు ఉన్నారు. ఏ సంస్కృతిని? కార్యేషు దాసి సంస్కృతినేనా? అది మంటగలిస్తేనే మానవజాతి విముక్తి సాధించగలుగుతుంది. ‘బిగ్‌బాస్’ అనేది సమాజానికి పనికి వచ్చే గొప్ప కార్యక్రమం కాకపోవచ్చు. అంతమాత్రాన అందులో పాల్గొం టున్న యువతీ యువకుల క్యారెక్టర్‌ను దెబ్బతీసే కామెంట్లు చేయడం న్యాయం కాదు. వాళ్ల మీద వేస్తున్న నిందలు అమానుషం. ముఖ్యంగా చాలామంది యువతులు ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని, ఎన్నో మూతివిరుపుల్ని అధిగమించి స్పాట్లైట్లోకి దూసుకొస్తున్నారు. సమాన స్థాయి కోసం ప్రపంచం మీదకు దండెత్తి వస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో, నవ చైతన్యంతో కదం తొక్కుతూ వస్తున్నారు. వీళ్ళూ అందులో భాగమే! వీలైతే స్వాగతిద్దాం. కాకపోతే చచ్చుబడిన మోకాళ్ళను అడ్డం పెట్టకుండా పక్కకు తప్పుకుందాం. మహిళా సాధికారత సాధ్యం కాకుండా ముందు ముందు మరే గొప్ప నాగరికత నిర్మాణం కాబోదు. ఆ సాధికారత సాధ్యం కావాలంటే పితృస్వామిక భావజాలాన్ని ఓడించక తప్పదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇవి ముగింపు లేని కథలు
అంతరంగం సాహిత్యమంటే పదాల గారడీలు, మాటల చమత్కారాలు కాదు! వాక్యాలను సంక్లిష్ట పరచడం, భావాలను ప్రహేళికల్లా కూర్చడం అంతకన్నా కాదు! రోజు రోజుకూ పతనం వైపు వేగంగా పరుగెడ్తున్న ఆధునిక జీవనంలో, దిగజారిపోతున్న నైతిక ప్రమాణాలని, సున్నితమైన మానవ సంబంధాలను తిరిగి మెరుగుపరిచే సామాజిక బాధ్యతను వహించేది సాహిత్యం. నా కథల విషయానికి వస్తే, నా కథల్లోని మనుషులు నాకు చిరపరిచితులు. వారి కష్టాలూ–కన్నీళ్లూ, బాధలూ– వ్యథలే గాకుండా వారి అరుదైన జీవన నైపుణ్యాలు– అద్భుతమైన సౌందర్యదృష్టీ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవితాన్ని ప్రశాంతంగా జీవించే స్థితప్రజ్ఞతా కూడా నాకు చిరపరిచితాలే! పల్లెవాసుల జీవితాల్లోని మానవీయ కోణాలనీ, సహజ మానవ ప్రవర్తనలనీ, నిరాడంబర కల్పనా చాతుర్యాలనీ దగ్గరుండి చూసినపుడు, కొన్నిసార్లు వాటితో మమేకమైపోయినపుడు కలిగిన స్పందనలే నా కథలు. నిజానికి ఇవి ముగింపు లేని కథలు! కాగితం మీద నేను వారి కథలను ముగించినా, కాలం పుస్తకంలో వారి జీవితాల కథలు ఇంకా కొనసాగుతూనే వుంటాయి. ఆధునిక సాహిత్యపు ఆరవ ప్రాణమైన కథాప్రక్రియ– పరిణామక్రమంలో శైలీ, శిల్పం, విషయం, భాషలాంటి అంశాల్లో ఎన్నో ప్రయోగాత్మక మార్పులు చెందుతున్న నేపథ్యంలో, నా కథల్లో శైలీ, శిల్పం, ఎత్తుగడ, ముగింపులాంటివి ఏ మేరకు సాహితీ విలువలను కలిగి ఉన్నాయో, ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయో, ఏ స్థాయిలో లేవో కూడా నాకు పెద్దగా తెలియదు. నేను చెప్పదలుచుకున్న విషయానికి సంబంధించి, పాత్రల పరిధి మేరకే సంభాషణలో, సంవాదాలో వ్రాస్తాను తప్ప– శిల్పం లోపించకూడదని, శైలి కొత్తగా వుండాలని, పాత్రల స్థాయికి మించిన సంభాషణలను, లౌక్యాన్నీ వ్రాయలేను. కొన్ని మానవీయమైన వాక్యాలూ, దృశ్యాలూ మాత్రం కథకు ‘అన్నీ తామై’ నిలబడతాయని మాత్రం తెలుసు. 1987లో మొదటి కథ ‘అడవి పువ్వు’ వ్రాసినప్పటి నుండీ ఇప్పటిదాకా– అంటే దాదాపుగా 28 సంవత్సరాలుగా 18 కథలు మాత్రమే వ్రాయడం నాకు తీవ్ర అసంతృప్తిగా ఉంది. కానీ రాసిన వాటికి తగిన గుర్తింపు (11 బహుమతులు కాకుండా) లభించడం ఎంతో సంతృప్తిగా ఉంది. నెమలినార(కథలు); రచన: బి.మురళీధర్ పేజీలు: 220; వెల: 150; ప్రతులకు: బి–85, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఆదిలాబాద్–504001. బి.మురళీధర్ 9440229728 -
అంతర్వాణి చెప్పడం వరకే
జ్యోతిర్మయం ‘ఆద్యశాంతి’ అనే భారతీయ నామాన్ని ధరించిన ఒక అమెరికన్ ప్రారంభంలో జెన్ సాధకుడు. ఆద్యశాంతి ‘ఆధ్యాత్మికంగా మేల్కొన్నాడు’ అని గురువు గమనించి, ‘ఇక ఇతర్లు మేల్కొనడానికి మార్గం చూపు’ అని దీవించి పంపాడు. అప్పటి నుంచి (1996) ఆద్య శాంతి బోధిస్తూ ఉన్నాడు. అతడితో ఒకరు జరిపిన సంభాషణ ఇక్కడ ఇస్తున్నాను. ప్రశ్న: ఇరవై ఐదేళ్ల వయసులో మీ మొదటి ‘మేల్కొనడం’ జరిగిందంటా రు. ఆ సమయాన మీకేదో కంఠధ్వని వినిపించింది అని చెప్పారు. అది ఎవరిది? మీ ‘కాన్షెన్స్’ అంతరాత్మ అంటా రా? లేక, లోనవుండేటి మరే దైనా నిశ్చల కంఠస్వరమా? ఆద్యశాంతి: అదో అంతర్వాణి. దానికి మీరే పేరైనా పెట్టండి. ప్ర: అందరికీ ఆ వాణి ఉన్నదంటారా? ఆద్య: అంతా మానవులమే కాబట్టి, అందరి లోనూ ఉండి తీరాలి. కానీ సాపేక్ష న్యాయంగా మాట్లాడితే, ఆ ధ్వని ఉన్నా అందరూ ఆలకిస్తున్నారా? అనేది ప్రశ్న. ఎక్కువ మంది వినే స్థితిలో లేరు. అంత ర్వాణి, చిత్తశుద్ధి ఈ రెండూ ఒకటే. నా యవ్వనపు అనుభవాన్ని తరచూ ఉదహరిస్తూ ఉంటాను. ఎవరో యువతిని ‘డేట్’ చేసేటప్పుడు, ‘ఈ యువతితో నీకు పొసగదు. చివరికెలాగూ ఇది విఫలమవుతుంది.’ అని అంతర్వాణి చెపుతూనే ఉంటుంది. ముందే వింటే ఏ చిక్కూ లేదు. చివరకు మీ ఇద్దరి మధ్యా సంబంధం సరిగా లేదని తెలియవస్తుంది. తీరా విఫలమైన తర్వాత, ‘పొరపాటు చేశాను’ అని కనుక్కునే బదులు, మొదట్లోనే ఆ కంఠస్వరం సత్యాన్నే పలుకుతోంది అని తెలుసుకొని ఉంటే, ఏ తంటా ఉండేది కాదు. కానీ చివరకు ఆ అంతర్వాణే నెగ్గింది. ఆ కంఠస్వరం మర్మమైనదేం కాదు. ప్రజా నీకంలో అధిక భాగం అప్పుడప్పుడూ వినే ఉంటారు. కానీ దానిని తోసిపుచ్చుతాం. ఆ స్వరం తాను అలా ఎందుకంటున్నదో సమర్థన కూడా ఇవ్వాలిని డిమాండ్ చేస్తాం. మనలోని ఆ స్వరం సత్యమైనదని నిర్ధారణగా చెప్పడానికి, అది తనని తాను సమర్థిం చుకోకుండా ఉండటమే గుర్తు. ఎందుకిలా అంటు న్నావ్ అని నీ ‘అహాన్ని’ అడిగితే, నీ అహం నీకెన్ని కారణాలైనా చెప్తుంది. శాయశక్తులా తనని తాను సమర్థించుకుంటుంది. ఈ అంతర్వాణికి నిశ్చయధ్వని ఉండదు. నమ్మించడానికి ఏ ప్రయ త్నమూ చేయదు. ఈ అంతర్వాణి ఒక వరం లాంటిది. ఒకరు వింటారు, మరొకరు వినరు. నేనెందుకు విన్నానో తెలియదు. వింటున్నందుకు ఆనందిస్తూ ఉంటాను. అన్ని సందర్భాల్లో విన్నాను అనీ చెప్పలేను. కానీ అది చెప్తూనే ఉన్నది. ప్ర: అది మార్గదర్శి లాంటిదా, రక్షణ ఇస్తుం టుందా! మన మనసులో భాగమా? ఆద్య: అవన్నీ కలసినది. అది ఉనికికి చెందిన మహా ప్రవాహం. నీలంరాజు లక్ష్మీప్రసాద్