ఇవి ముగింపు లేని కథలు
అంతరంగం
సాహిత్యమంటే పదాల గారడీలు, మాటల చమత్కారాలు కాదు! వాక్యాలను సంక్లిష్ట పరచడం, భావాలను ప్రహేళికల్లా కూర్చడం అంతకన్నా కాదు! రోజు రోజుకూ పతనం వైపు వేగంగా పరుగెడ్తున్న ఆధునిక జీవనంలో, దిగజారిపోతున్న నైతిక ప్రమాణాలని, సున్నితమైన మానవ సంబంధాలను తిరిగి మెరుగుపరిచే సామాజిక బాధ్యతను వహించేది సాహిత్యం.
నా కథల విషయానికి వస్తే, నా కథల్లోని మనుషులు నాకు చిరపరిచితులు. వారి కష్టాలూ–కన్నీళ్లూ, బాధలూ– వ్యథలే గాకుండా వారి అరుదైన జీవన నైపుణ్యాలు– అద్భుతమైన సౌందర్యదృష్టీ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవితాన్ని ప్రశాంతంగా జీవించే స్థితప్రజ్ఞతా కూడా నాకు చిరపరిచితాలే! పల్లెవాసుల జీవితాల్లోని మానవీయ కోణాలనీ, సహజ మానవ ప్రవర్తనలనీ, నిరాడంబర కల్పనా చాతుర్యాలనీ దగ్గరుండి చూసినపుడు, కొన్నిసార్లు వాటితో మమేకమైపోయినపుడు కలిగిన స్పందనలే నా కథలు. నిజానికి ఇవి ముగింపు లేని కథలు! కాగితం మీద నేను వారి కథలను ముగించినా, కాలం పుస్తకంలో వారి జీవితాల కథలు ఇంకా కొనసాగుతూనే వుంటాయి.
ఆధునిక సాహిత్యపు ఆరవ ప్రాణమైన కథాప్రక్రియ– పరిణామక్రమంలో శైలీ, శిల్పం, విషయం, భాషలాంటి అంశాల్లో ఎన్నో ప్రయోగాత్మక మార్పులు చెందుతున్న నేపథ్యంలో, నా కథల్లో శైలీ, శిల్పం, ఎత్తుగడ, ముగింపులాంటివి ఏ మేరకు సాహితీ విలువలను కలిగి ఉన్నాయో, ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయో, ఏ స్థాయిలో లేవో కూడా నాకు పెద్దగా తెలియదు. నేను చెప్పదలుచుకున్న విషయానికి సంబంధించి, పాత్రల పరిధి మేరకే సంభాషణలో, సంవాదాలో వ్రాస్తాను తప్ప– శిల్పం లోపించకూడదని, శైలి కొత్తగా వుండాలని, పాత్రల స్థాయికి మించిన సంభాషణలను, లౌక్యాన్నీ వ్రాయలేను. కొన్ని మానవీయమైన వాక్యాలూ, దృశ్యాలూ మాత్రం కథకు ‘అన్నీ తామై’ నిలబడతాయని మాత్రం తెలుసు.
1987లో మొదటి కథ ‘అడవి పువ్వు’ వ్రాసినప్పటి నుండీ ఇప్పటిదాకా– అంటే దాదాపుగా 28 సంవత్సరాలుగా 18 కథలు మాత్రమే వ్రాయడం నాకు తీవ్ర అసంతృప్తిగా ఉంది. కానీ రాసిన వాటికి తగిన గుర్తింపు (11 బహుమతులు కాకుండా) లభించడం ఎంతో సంతృప్తిగా ఉంది.
నెమలినార(కథలు); రచన: బి.మురళీధర్ పేజీలు: 220; వెల: 150; ప్రతులకు: బి–85, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఆదిలాబాద్–504001.
బి.మురళీధర్
9440229728