Integrated Test Range
-
వీఎల్–ఎస్ఆర్ఎస్ఏఎం పరీక్ష సక్సెస్
బాలసోర్: ఒడిశా తీరం చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి శుక్రవారం చేపట్టిన వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణి (వీఎల్–ఎస్ఆర్ఎస్ఏఎం) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. నేవీ షిప్ నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి నిర్దేశించిన పరిమితుల ప్రకారం ఛేదించిందని అధికారులు తెలిపారు. ఈ ఆయుధ వ్యవస్థ అత్యంత సమీపంలోని వివిధ రకాల లక్ష్యాలను అడ్డుకుంటుందని, రాడార్ తదితరాలకు దొరక్కుండా తప్పించుకునే వాటిని కూడా ఎదుర్కొంటుందని వెల్లడించారు. ఈ క్షిపణి హై స్పీడ్ ఏరియల్ టార్గెట్‌ను ఛేదించడాన్ని అంచనా వేసేందుకు పలు ట్రాకింగ్ వ్యవస్థలను వినియోగించినట్లు చెప్పారు. ఈ ప్రయోగం డీఆర్డీవో, నేవీ ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిందన్నారు. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన డీఆర్డీవో, నేవీలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ విజయంతో భారత నావికాదళం గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ నేవీ, డీఆర్డీవో బృందాల కృషిని ప్రశంసించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న బృందాలను డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్ రెడ్డి అభినందించారు. భారత నావికా దళం సామర్థ్యాన్ని ఈ ఆయుధ వ్యవస్థ ఇనుమడింప జేస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన ‘‘ఆత్మనిర్భర్ భారత్’’లో ఇది మరో మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. -
నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్ష సక్సెస్
బాలాసోర్(ఒడిశా): శత్రు దేశ యుద్ధనౌకలను తుత్తునియలు చేసే అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) బుధవారం ప్రకటించింది. ఒడిశాలోని చాందీపూర్ సమీపంలో సముద్రతీర ప్రాంతంలో భారత నావికా దళం, డీఆర్డీవో సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారికావడం గమనార్హం. నావికాదళ హెలికాప్టర్ ద్వారా ప్రయోగించిన ఈ కొత్త యాంటీ–షిప్ మిస్సైల్ అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్ అవసరాల కోసం దేశీయంగా తయారుచేసిన లాంచర్‌ను ఈ క్షిపణిలో వినియోగించారు. క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు సంబంధిత శాస్త్రవేత్తలను డీఆర్డీవో చైర్మన్ జి.సతీష్ రెడ్డి అభినందించారు. -
ఒడిశాలో ‘నిర్భయ్’ క్షిపణి ప్రయోగం
బాలాసోర్(ఒడిశా): స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిచేసిన ‘నిర్భయ్’ క్షిపణిని బుధవారం ఒడిశాలోని చాందీపూర్‌లో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించారు. టర్బో–ఫ్యాన్ ఇంజిన్, రాకెట్ మోటార్ బూస్టర్‌తో సాయంతో దూసుకెళ్లి 1000 కి.మీ.S దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా తయారుచేసిన ఈ క్షిపణి.. అధునాతన నేవిగేషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. అయితే, ఈ ప్రయోగ ఫలితంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, గతంలో ఎక్కువసార్లు విఫలమైనట్లే ఈసారీ క్షిపణి ప్రయోగం విఫలమైందని వార్తలొచ్చాయి. -
‘ఆకాశ్’ పరీక్ష సక్సెస్..
వరుసగా రెండు క్షిపణులను ప్రయోగించిన వాయుసేన బాలాసోర్: ఉపరితలం నుంచి గాలిలోని లక్ష్యాలను ఛేదించగల మధ్యశ్రేణి ఆకాశ్ క్షిపణులను భారత వాయుసేన శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలసోర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి శనివారం మధ్యాహ్నం 11.55, 12 గంటల సమయంలో వరుసగా రెండు క్షిపణులను ప్రయోగించారు. మానవ రహిత విమానాలకు వేలాడ దీసిన లక్ష్యాలను ఇవి విజయవంతంగా ఛేదించాయి. యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గాలిలోంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులను ధ్వంసం చేయడానికి ఆకాశ్ క్షిపణులను రూపొందించారు. 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులు 60 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలవు. ఒకే సమయంలో వివిధ లక్ష్యాలను ఛేదించగలవు. -
నిశీధిలోనూ గురితప్పని ‘అగ్ని’
బాలాసోర్ (ఒడిశా): భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని క్షిపణిని తొలిసారిగా రాత్రివేళ విజయవంతంగా ప్రయోగించి పరీక్షించింది. భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించే అగ్ని-1 ఖండాంతర క్షిపణికి 700 కిలోమీటర్ల లక్ష్య ఛేదన పరిధి ఉంది. ఒడిషా తీరంలోని వీలర్ దీవిలో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో నాలుగో లాంచ్ ప్యాడ్ నుంచి శుక్రవారం రాత్రి భారత సైన్యం ఈ క్షిపణిని పరీక్షించి చూసిందని డీఆర్డీఓ అధికార ప్రతినిధి రవికుమార్‌గుప్తా తెలిపారు. ఈ పరీక్ష విజయవంతమైందని, ప్రయోగం లక్ష్యాలన్నిటినీ పూర్తిచేసిందని ఆయన పీటీఐ వార్తా సంస్థకు వివరించారు. భారత సైన్యానికి చెందిన స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ వినియోగ పరీక్షలో భాగంగా ఈ ప్రయోగం నిర్వహించిందని ఐటీఆర్ డెరైక్టర్ ఎం.వి.కె.వి.ప్రసాద్ తెలిపారు. అగ్ని-1 మధ్య శ్రేణి క్షిపణిని డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. దీనిని రాత్రివేళ ప్రయోగించటం ఇదే తొలిసారి. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సంసిద్ధంగా ఉండాల్సిన తన అవసరం దృష్ట్యా భారత సైన్యం రాత్రివేళ ఈ పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ గల ఈ క్షిపణి తన లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా చేరుకుంటుంది. 12 టన్నుల బరువు, 15 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణి 1,000 కిలోల పేలోడ్లను తీసుకువెళ్లగలదు. దీనిని ఇప్పటికే భారత సైన్యం అమ్ములపొదిలో చేర్చారు. -
‘అగ్ని’ కేతనం
అణ్వాయుధాలను మోసుకుపోయే సామర్థ్యం గల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. దీంతో సైన్యానికి అప్పగించేందుకు వీలుగా క్షిపణి పూర్తిస్థాయిలో సిద్ధమైందని డీఆర్డీవో ప్రకటించింది. సోమవారం ఉదయం ఒడిశా వీలర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ లాంఛర్ నుంచి 10.52 నిమిషాలకు అగ్ని-4ను ప్రయోగించినట్లు వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని ఈ క్షిపణి ప్రయోగించిన 20 నిమిషాల్లో విజయవంతంగా ఛేదించినట్లు తెలిపింది. ప్రత్యేకతలు ఇవీ ... ప్రయోగించిన మూడు సార్లూ విజయవంతం అణ్వాయుధాలను మోసుకుపోగలిగే సామర్థ్యం 4,000 కి.మీ.దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు 850 కిలోమీటర్లు పైకి వెళ్లి, తిరిగి వాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. 4,000 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించేందుకు తోడ్పడే అత్యాధునిక మైక్రో నావిగేషన్ వ్యవస్థ మునుపటి అగ్ని సిరీస్‌లతో పోలిస్తే బరువు తక్కువ. రెండు దశల్లో ఘన ఇంధన వినియోగం. - బాలాసోర్ (ఒడిశా) -
పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలసోర్: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యంగల పృథ్వీ-2 క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై 350 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ ద్వారా ఉదయం 9:15 గంటలకు ప్రయోగించినట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమైనట్లు తెలిపాయి. అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థగల పృథ్వీ-2 ఈ ప్రయోగంలో భాగంగా బంగాళాఖాతంలోని ఓ ప్రాంతంలో నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించిందని వివరించాయి. 500 కేజీల నుంచి 1,000 కేజీల వరకూ వార్హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యంగల ఈ క్షిపణి గతి మార్గాన్ని డీఆర్డీవో రాడార్లు, టెలిమెట్రీ స్టేషన్లు ఆసాంతం పరిశీలించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పృథ్వీ-2 క్షిపణి ప్రోగ్రామ్ డెరైక్టర్లు ఎ.డి. అదాలత్ అలీ, ఎన్. శివసుబ్రమణ్యం, ఇతర అధికారులు ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. మరోవైపు ఈ ప్రయోగం విజయవంతం అయినందుకు శాస్త్రవేత్తల బృందాన్ని రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ అభినందించారు.